కరోనా వల్ల గత ఏడాది తీవ్రంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్నట్లు ఇటీవల సంకేతాలొచ్చాయి. కొవిడ్ సంక్షోభం తర్వాత తొలిసారి వృద్ధి రేటు 2020-21 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సానుకూలంగా (0.4 శాతంగా) నమోదైనట్లు తేలడం ఇందుకు నిదర్శనం. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం, చాలా రాష్ట్రాలు లాక్డౌన్, కర్ఫ్యూ విధిస్తుండటం వల్ల ఆర్థిక వ్యవస్థపై మళ్లీ ఆందోళనలు తీవ్రమవుతున్నాయి.
వ్యాపారాలపై ప్రభావం..
కొవిడ్-19 తీవ్రతతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరైన మహారాష్ట్ర మరోసారి కరోనా విలయాన్ని చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్న అక్కడి ప్రభుత్వం.. అమరావతి, నాగ్‌పుర్ నగరాల్లో పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. ఇక పుణె, నాసిక్, ఔరంగాబాద్ నగరాల్లో పాక్షిక లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తోంది.
డైనింగ్‌పై పూర్తి నిషేధం, పార్సిల్పైనా ఆంక్షల కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది.
గుజరాత్‌లోని.. అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్ నగరాల్లో మార్చి 31వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దీనితో పాటు మధ్యప్రదేశ్‌లోనూ పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కరోనా తీవ్రత ఉన్నట్లు తేలిన తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల దిశగా అడుగులు వేస్తుండటం వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
సప్లయ్ చైన్‌పై ప్రభావం..
అయితే కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ దేశవ్యాప్త లాక్డౌన్ విధిస్తారా? అనే విషయంపై కేంద్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఆంక్షల వల్ల దేశవ్యాప్తంగా సప్లయ్ చైన్ దెబ్బతింటుందంటున్నారు నిపుణులు.
'రికవరీ దశలో హై ఫ్రీక్వెన్సీ డేటా ఇప్పుడిప్పుడే సానుకూలంగా నమోదవుతోంది. అయితే కరోనా కేసుల్లో పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని మరోసారి అంక్షలు అమలు చేయడం వల్ల.. రికవరీలో కొంత ఒడుదొడుకులు ఎదురయ్యే అవకాశముంది' అని యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్ ముఖ్య ఆర్థికవేత్త పృథ్వీరాజ్ శ్రీనివాస్ 'ఈటీవీ భారత్'తో అన్నారు.
కేసుల్లో పెరుగుదల కారణండా మళ్లీ చాలా మంది ఆదాయం కోల్పోవచ్చని అంచనా వేశారు. "ఏడాది క్రితం కరోనా వ్యాప్తికి, ఇప్పుడు మరోసారి వైరస్ విజృంభించడానికి మధ్య ఓ వ్యత్యాసం ఉంది. అప్పుడు ఆదాయంతోపాటు డిమాండ్ భారీగా తగ్గింది. అయితే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెటలో కమొడిటీల ధరలు తిరిగి గణనీయంగా పుంజుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆదాయం తగ్గిపోతే డిమాండ్ వృద్ధిపై మళ్లీ ప్రతికూల ప్రభావం పడుతుంది" అని వివరించారు పృథ్వీరాజ్.