కరోనా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ముప్పు ఉండకపోవచ్చని అంచనావేసింది ఐక్యరాజ్యసమితి. వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటాయని.. అయితే భారత్, చైనా మాత్రం ఇందుకు మినహాయింపని విశ్లేషించింది.
భారత్, చైనా మినహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్న ప్రజానీకంపై వైరస్ తీవ్ర ప్రభావం చూపనుందని పేర్కొంది ఐరాస. ఆయా దేశాలను గట్టెక్కించేందుకు 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అవసరమని చెప్పింది.
'అభివృద్ధి చెందుతున్న దేశాలపై కొవిడ్-19 దెబ్బ: ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మంది జనాభా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం తీసుకోవాల్సిన చర్యలు' అనే అంశంపై ఐరాస వాణిజ్యం, అభివృద్ధి వేదిక (యూఎన్‌సీటీఏడీ) పరిశోధన చేసింది. భారత్‌పై కరోనా ప్రభావం పెద్దగా ఉండబోదని నివేదికలో పేర్కొన్నా... అందుకు కారణాలు వివరించలేదు. అయితే వస్తువుల ఎగుమతులపై ఆధారపడే దేశాలకు రెండు నుంచి మూడు ట్రిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు తగ్గే అవకాశం ఉందని లెక్కగట్టింది ఐరాస.