ప్రజల జీవితాలకు ఆరోగ్య రంగం ఎంత కీలకమైందో, అందులో లోటుపాట్లు ఏమిటో కరోనా సంక్షోభం ఎత్తిచూపిందని నిపుణులు అంటున్నారు. ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కూడా ఎంత అవసరమో మహమ్మారి ప్రపంచానికి గుర్తు చేసిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఆ దిశగా కీలక నిర్ణయాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఏ రంగాలకు లేని విధంగా ఈసారి ఆరోగ్య రంగానికి బడ్జెట్లో కేటాయింపులు అవసరమని సూచిస్తున్నారు.
ఫార్మాకు పోత్సహకాలు కావాలి..
ప్రపంచంలోనే మన ఫార్మా రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రంగానికి.. ముఖ్యంగా పరిశోధన, అభివృద్ధి, నవకల్పన విభాగాలకు రానున్న బడ్జెట్లో భారీ ప్రోత్సహకాలు అత్యంత అవసరమని ఆరోగ్య రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ అంశాలకు అధిక ప్రాధాన్యం..
'ప్రజారోగ్యం కన్నా ముఖ్యమైంది ఏదీ లేదనే విషయాన్ని కరోనాతో రుజువైంది. ఇది హెల్త్‌కేర్‌పై పెట్టుబడులు పెరగాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. పెరిగిన అవసరాలకు తగ్గట్లు జాతీయ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలతో వైద్య రంగంలో సిబ్బందిని పెంచుకోవాలి. మెడికల్ కాలేజీల సంఖ్య పెరగాలి. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో.. స్థానికంగా వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.' అని జాతీయ హెల్త్‌కేర్ సమాఖ్య అధ్యక్షురాలు, అపోలో ఆస్పత్రులు ఎగ్జిక్యుటివ్ వైస్ ఛైర్పర్సన్ ప్రీతా రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్లో ఈ అంశాన్నింటికీ అధిక ప్రాధాన్యం ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
'కరోనాతో దెబ్బతిన్న తమ వ్యాపారాల రికవరీకి ప్రభుత్వం నుంచి అదనపు పోత్సాహకాలు అందుతాయని ప్రైవేటు హెల్త్‌కేర్ విభాగం భారీ అశలు పెట్టుకుంది. టైర్ 2-3 పట్టణాలకు విస్తరించేందుకు సబ్సిడీతో స్థలాల కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనకు పన్ను మినహాయింపు, హెల్త్‌కేర్ విభాగానికి జీఎస్టీ నిబంధనల్లో సడలింపులు ఉండాలని ఆశిస్తోంది' అని తెలిపారు ప్రీతా రెడ్డి.
ఉద్యోగాలూ పెరుగుతాయ్..
బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అత్యధిక కేటాయింపుల అవసరాన్ని కొవిడ్ మహమ్మారి నొక్కి చెప్పిందని ఫోర్టీస్ హెల్త్‌కేర్ ఎండీ, సీఈఓ అశుతోశ్ రఘువన్షి అన్నారు.