కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు.. పార్లమెంట్ ప్రాంగణంలో సందడి అంతా ఇంతా కాదు. ఆర్థికశాఖ కార్యాలయం నుంచి అత్యంత భద్రత నడుమ బడ్జెట్ ప్రతుల ట్రక్కు పార్లమెంట్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత జాగిలాల తనిఖీల అనంతరం పత్రాలను సభ్యులకు అందిస్తారు. అయితే ఈసారి ఆ కోలాహాలం ఏదీ కనిపించకపోవచ్చు. కరోనా మహమ్మారి దృష్ట్యా ఈ ఏడాది బడ్జెట్ పత్రాలను ప్రింట్ చేయట్లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే జరిగితే స్వతంత్ర్య భారతంలో తొలిసారిగా బడ్జెట్ ప్రతులు లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరగడం ఇదే తొలిసారి కానుంది.
బడ్జెట్ ప్రతులు..
సాధారణంగా బడ్జెట్ సమావేశాలకు రెండు వారాల ముందు నుంచే బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆర్థికశాఖ కార్యాలయంలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రతుల ముద్రణ చేపడతారు. 100 మందికి పైనే ఇందులో పనిచేస్తారు. అయితే కరోనా వ్యాప్తి ముప్పు దృష్ట్యా అంతమందిని రెండువారాల పాటు ఒకే చోట ఉంచడం ప్రమాదమని భావించిన కేంద్రం.. ఈ విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లింది. బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ చేయకూడదనుకుంటున్నట్లు తెలిపింది. ఇందుకు సభ్యులు కూడా సమ్మతించడంతో ఈ ఏడాది బడ్జెట్ ప్రతుల ముద్రణ చేపట్టట్లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనికి బదులు సభ్యులందరికీ బడ్జెట్ సాఫ్ట్ కాపీలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.