తెలంగాణ

telangana

ETV Bharat / business

'కరోనా సంక్షోభంతో భారత్‌పై ప్రపంచ కంపెనీల దృష్టి' - వాణిజ్య వార్తలు

కరోనా సంక్షోభంతో ప్రపంచ స్థాయి సంస్థల దృష్టి భారత్‌పై పడిందని అమెరికా భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం వెల్లడించింది. రానున్న రోజుల్లో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు కూడా భారత్‌కు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ జియోలో ఫేస్‌బుక్ 5.7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం ఇందుకు నిదర్శనమని చెప్పుకొచ్చింది.

USISPF on Indian Business
కరోనాతో భారత్‌కు పెట్టుబడులు

By

Published : Apr 23, 2020, 11:45 AM IST

ప్రపంచ స్థాయి కంపెనీలకు భారత్ ఇప్పుడు సరికొత్త పెట్టుబడి కేంద్రంగా కనిపిస్తోందని అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌) విశ్లేషించింది. కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం నెలకొన్నా.. రిలయన్స్‌ జియోలో ఫేస్‌బుక్ 5.7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం ఇందుకు నిదర్శనమని పేర్కొంది. ఈ పెట్టుబడితో భారత్‌పై విదేశీ కంపెనీలకు ఉన్న విశ్వాసం ప్రతిబింబిస్తోందని తెలిపింది.

"కరోనా కారణంగా భారీగా విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు భారత్‌కు అవకాశాలు ఏర్పడ్డాయి. తయారీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న చైనాకు ప్రత్యామ్నాయం అవ్వగలిగే శక్తికూడా భారత్‌కు ఉంది. ఈ పరిణామంతో ఉద్యోగాల సృష్టితో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుంది."

-ముకేశ్ అగి, యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ అధ్యక్షుడు

భారత్ చేయాల్సింది ఇదే..

విదేశీ కంపెనీల స్థాయికి తగ్గ అవకాశాలతో పాటు పారదర్శకత, స్థిరత్వంతో కూడిన విధానాల ద్వారా భారత్ విదేశీ కంపెనీల్లో విశ్వాసం పెంచుకోవాల్సిన అవసరం ఉందని అగి అభిప్రాయపడ్డారు. భారత్‌ ఇప్పటికే కార్పొరేట్ సుంకాల సంస్కరణలు తీసుకువచ్చిందని.. అయితే కార్మిక చట్టాలు, భూ సంస్కరణలూ అవసరమని వివరించారు.

సరైన నిర్ణయాలతోనే..

భారత్‌ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే ఏడాదికి కనీసం 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ అంచనా వేసింది. ప్రస్తుత సమయాల్లో భారత్ సరైన నిర్ణయాలు తీసుకుంటే చాలా వరకు కంపెనీలు ఇక్కడకు తరలి వస్తాయని తెలిపింది.

ఇదీ చూడండి:పెను సంక్షోభం... అయినా కోలుకునే అవకాశం

ABOUT THE AUTHOR

...view details