దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ మహమ్మారి కారణంగా లెక్కలేనన్ని ఉద్యోగాలపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా సంక్షోభం వల్ల భారత్ లోని 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులు పేదరికం బారిన పడనున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) స్పష్టం చేసింది.
లాక్డౌన్తో పాటు కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉద్యోగాలు, ఉపాధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించనున్నట్లు ఐఎల్ఓ పేర్కొంది. ఈ మేరకు మార్చి 18న విడుదల చేసిన నివేదికకు కొనసాగింపుగా 'ఐఎల్ఓ మానిటర్ సెకండ్ ఎడిషన్: కొవిడ్-19 వరల్డ్ ఆఫ్ వర్క్'ను వెలువరించింది. కొవిడ్-19ను రెండో ప్రపంచయుద్ధం తర్వాత సంభవించిన 'అత్యంత దారుణమైన ప్రపంచ సంక్షోభం'గా అభివర్ణించింది.
"అసంఘటిత రంగంలోని లక్షలాది మంది కార్మికులపై కొవిడ్-19 ఇప్పటికే ప్రభావం చూపించింది. వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల ఫలితంగా భారత్, నైజీరియా, బ్రెజిల్ దేశాల్లో అసంఘటిత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతోంది. భారత్లో 90 శాతం మంది ప్రజలు అసంఘటిత ఆర్థిక వ్యవస్థ పరిధిలో ఉన్నారు. ఇందులో 40 కోట్ల మంది కార్మికులు సంక్షోభ సమయంలో తీవ్రమైన పేదరికం బారిన పడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు."-అంతర్జాతీయ కార్మిక సంస్థ
భారత్లో లాక్డౌన్ వల్ల ఉపాధికి గండిపడిందని, వేలాది మంది సొంత గ్రామాలకు తరలివెళ్తున్నారని ఐఎల్ఓ పేర్కొంది. ఉద్యోగుల పనివేళలు, ఆదాయంపైనా విపత్కర ప్రభావం పడిందని స్పష్టం చేసింది.
19.5 కోట్ల ఉద్యోగాలు ఉఫ్!
కరోనా సంక్షోభం వల్ల 2020 రెండో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 6.7 శాతం పనిగంటలు తుడిచిపెట్టుకుపోతాయని ఐఎల్ఓ అంచనా వేసింది. ఇది 19.5 కోట్ల ఉద్యోగుల పూర్తి స్థాయి పనిగంటలకు సమానమని తెలిపింది. అరబ్ దేశాల్లో అత్యధికంగా 8.1 శాతం, ఐరోపాలో 7.8 శాతం, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో 7.2 శాతం పనిగంటలపై కరోనా ప్రభావం ఉంటుందని లెక్కగట్టింది. ఎగువ మధ్య తరగతి దేశాల్లోనే అధిక నష్టం సంభవిస్తుందని స్పష్టం చేసింది. 2008-09లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో పోలిస్తే ఈ ప్రభావం చాలా ఎక్కువ అని వెల్లడించింది.