తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక వృద్ధిపై కరోనా పోటు- పునరుజ్జీవమెలా? - వృద్ధి రేటుపై ఆర్​బీఐ

కరోనా డెల్టా వేరియంట్​ వ్యాప్తి దృష్ట్యా వైరస్​ కట్టడి కోసం పలు రాష్ట్రాలు లాక్​డౌన్​ వంటి నిబంధనలు విధించాయి. ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను ఆర్​బీఐ సహా వివిధ రేటింగ్​ సంస్థలు తగ్గిస్తూ వస్తున్నాయి. కరోనా రెండో దశ వ్యాప్తికి ముందు భారత వృద్ధి రేటు 10.5-13.7శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసిన ఆయా సంస్థలే.. ప్రస్తుతం 9.5 శాతానికే పరిమితమవుతున్నాయని చెబుతున్నాయి.

gdp of india in corona second wave
భారత జీడీపీ

By

Published : Jun 24, 2021, 6:40 PM IST

ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిరేటును సాధించటం.. భారత్​కు నెరవేరని లక్ష్యంగానే కనిపిస్తోంది. కరోనా ఉత్పరివర్తనం చెందుతూ వ్యాపిస్తుండటం, వైరస్​ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​తో వ్యాపార కార్యాకలాపాలు స్తంభించటం, వ్యాక్సినేషన్​ ప్రక్రియ కూడా నెమ్మదిగా సాగుతుండటం కారణంగా.. వృద్ధిరేటు పెరిగే సూచనలు కనిపించటం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా(ఆర్​బీఐ) సహా ఇతర సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 9.5 శాతానికే పరిమితమవుతుందని చెబుతున్నాయి. అంతకుముందు ఇవే సంస్థలు 10.5-13.7శాతం మధ్య వృద్ధిరేటు ఉంటుందని లెక్కగట్టాయి. కరోనా రెండో దశతో వాటిల్లిన నష్టం, పొంచి ఉన్న మూడో దశ ముప్పు కారణంగా వృద్ధి అంచనాలను ఆయా సంస్థలు గణనీయంగా తగ్గించాయి.

తగ్గించిన మూడీస్​...

ఈ ఏడాది భారత వృద్ధి రేటు అంచనాలను 13.9 శాతం నుంచి 9.6 శాతానికి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్​ ఏజెన్సీ మూడీస్​ ఇన్వెస్టర్స్​ సర్వీస్​ పేర్కొంది. ఏప్రిల్​, మే నెలల్లో కరోనా రెండో దశ ఉద్ధృతి ప్రభావం ఆర్థిక కార్యకలాపాలపై పడిందని తన నివేదికలో తెలిపింది. 'కరోనా కారణంగా 2021 వృద్ధి అంచనాలపై అనిశ్చితి కనిపిస్తోంది. అయితే ఏప్రిల్​- జూన్ త్రైమాసికానికే అది పరిమితం కావొచ్చు. ఈ ఏడాది భారత వాస్తవ జీడీపీ 9.6శాతం, 2022లో 7శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనా వేస్తున్నాం' అని వెల్లడించింది.

రూ.5.48 లక్షల కోట్ల నష్టం..

బ్రిటన్​కు చెందిన 'బార్​క్లేస్​' అనే బ్రోకరేజ్​ సంస్థ కూడా.. 2022లో భారత వృద్ధి రేటు అంచనాను 0.8 శాతం తగ్గించి 9.2 శాతానికి పరిమితమవుతుందని చెప్పింది. కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​ వంటి తదితర నిబంధనల వల్ల ఏప్రిల్​-జూన్ మధ్య రూ.5.48 లక్షల కోట్ల సంపదను భారత్​ నష్టపోయినట్లు అంచనా వేసింది.

ఆర్​బీఐ అంచనా 9.5శాతమే..

కరోనా రెండో దశ విజృంభణ దృష్ట్యా వృద్ధి రేటు 9.5శాతానికి పరిమితమవుతుందని జోస్యం చెప్పింది ఆర్​బీఐ. '2021-22లో వాస్తవ జీడీపీ 9.5శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఏప్రిల్​-జూన్ త్రైమాసికంలో 18.5శాతం, జులై-సెప్టెంబర్​లో 7.9శాతం, అక్టోబర్​-డిసెంబర్​లో 7.2శాతం, జనవరి- మార్చిలో 6.6శాతం వృద్ధి ఉంటుంది' అని ఈ నెల ప్రారంభంలో నూతన పరపతి విధానాన్ని ప్రకటించినప్పుడు ఆర్​బీఐ గవర్నర్ శక్తి కాంతదాస్​ తెలిపారు.

వేరియంట్లతో పొంచి ఉన్న ముప్పు..

భారత్​లో కరోనా రెండో దశ ఉద్ధృతికి డెల్టా వేరియంట్​ కారణం కాగా.. ఇప్పుడు వైరస్​ మళ్లీ ఉత్పరివర్తనం చెంది డెల్టా ప్లస్​ వేరియంట్​గా వ్యాప్తి చెందుతోంది. మంగళవారం ఈ వేరియంట్​ను ఆందోళకరమైన వైరస్​ రకంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ వైరస్​ వేగంగా వ్యాప్తి చెంది.. మూడో దశ కరోనా ముప్పుకు దారి తీయవచ్చని.. తద్వారా.. ఆర్థిక వ్యవస్థకు మరిన్ని కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్న భయాలు వినిపిస్తున్నాయి.

టీకాలతోనే పునరుజ్జీవం..

వ్యాక్సినేషన్​ కార్యక్రమం పుంజుకుంటే.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో ఆర్థిక వృద్ధి నెమ్మదిగా పెరిగే అవకాశం ఉందని మూడీస్ సంస్థ​ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. భారత్​లో రోజూ కోటీ టీకా డోసుల చొప్పున పంపిణీ చేస్తే ఆర్థిక పునరుజ్జీవం సాధ్యమవుతుందని ఎస్​బీఐ రీసెర్చ్​ నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడానికి వ్యాక్సినేషన్​ కార్యక్రమంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉందని తెలుస్తోంది.

ఇదీ చూడండి:Corona Pandemic: దేశార్థికానికి కొవిడ్‌ శరాఘాతాలు

ఇదీ చూడండి:కొవిడ్​ 2.0తో రూ.2 లక్షల కోట్ల నష్టం!

ABOUT THE AUTHOR

...view details