ప్రపంచమంతా ఇప్పుడు ఎక్కడ చూసినా.. కరోనా సంక్షోభం గురించే చర్చ. ఈ మహమ్మారి ప్రజల ఆరోగ్యంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలను తీవ్రంగా కుంగదీసింది.
ఏదైనా సంక్షోభం ఎదురైతే ఆర్థికంగా బీమా సంస్థలు అండగా ఉంటాయి. అయితే కొవిడ్-19 వల్ల ఆ సంస్థలు కూడా అనిశ్చితి ఎదుర్కొంటున్నట్లు ఆ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు బీమా రంగం పరిస్థితి మెరుగ్గానే ఉన్నా.. ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయని అంటున్నారు.
జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహన బీమా ఇలా అన్నింటిపై కరోనా ప్రభావం పడిందని విశ్లేషిస్తున్నారు నిపుణులు.
కరోనాకు ముందు ఇలా..
బీమా రంగంలో ఫిబ్రవరి 2020 వరకు పరిస్థితి సజావుగానే ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు ఆరోగ్యేతర బీమా విభాగంలో 13 శాతం వృద్ధి, జీవిత బీమా విభాగంలో 18 శాతం వృద్ధి నమోదైంది. కరోనా వ్యాప్తితో ఈ లెక్కలన్నీ తారుమారయ్యాయి.
వైరస్ సంక్షోభంతో ప్రజల ఆదాయాల్లో మార్పులు వచ్చాయి. కొత్తగా బీమా తీసుకునే వినియోగదారుల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటికే బీమా తీసుకున్న వారూ పాలసీ రెన్యువల్ వాయిదా వేసుకుంటున్నట్లు బీమా సంస్థలు చెబుతున్నాయి.
ఆరోగ్య బీమాపై ఆర్థిక భారం..
ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు 2-3 సంవత్సరాల వరకు బీమా సంస్థలు క్లెయిమ్స్ పైనే దృష్టి సారించేలా ఉన్నాయని బీమా రంగంలోని వారు అంటున్నారు. కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఖర్చు ఎక్కువవుతోంది. కేసులు పెరుగుతుండటం వల్ల క్లెయిమ్‌లు కూడా పెరుగుతున్నాయి. ఇవి ఆరోగ్య బీమా సంస్థలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి.
నిజానికి కరోనా వల్ల కొత్తగా ఆరోగ్య బీమా తీసుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. అయితే క్లెయిమ్ రేటుతో పోలిస్తే.. కొత్తగా పాలసీ తీసుకునే వారు తక్కువగా ఉన్నట్లు చెబుతున్నాయి బీమా సంస్థలు. ఈ కారణంగా ఆరోగ్య బీమా సంస్థలు నష్టాలవైపు పయనిస్తున్నట్లు ఆ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. రెన్యువల్ గడువు పెంచటం వల్ల ఈ నష్టాలు మరింత పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉపశమనంతోనే ఉపయోగం..
కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించింది. ప్రభుత్వ బాండ్లపైనా వడ్డీ రేట్లు తగ్గాయి. దీని కారణంగా బీమా సంస్థలు అధిక మొత్తాలను నిల్వ చేయడం కష్టంగా మారింది. నిల్వ మొత్తాలపై కొన్ని నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తే.. బీమా సంస్థలకు కొంతమేర ప్రయోజనం కలుగుతుందని బీమా రంగ నిపుణులు చెబుతున్నారు.
"ఆరోగ్య బీమా రంగం ముందు కరోనా మహమ్మారి అనేక సవాళ్లను ఉంచింది. కరోనా కారణంగా ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన మాత్రం పెరిగింది. ఈ మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరికి కరోనా బీమా పాలసీ ఉండటం అత్యవసరం. కరోనా కోసం పలు ప్రత్యేక పాలసీలను కూడా బీమా సంస్థలు ప్రవేశపెట్టనున్నాయి."