భారత్‌పై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ నివేదికలో 2020-21లో భారత్ వృద్ధిరేటు 5.1శాతంగా ఉండనుందని పేర్కొంది. అదే తిరిగి పుంజుకొంటే మాత్రమే 2021-22 నాటికి 5.6శాతానికి చేరుతుందని అంచనా వేస్తోంది. కరోనావైరస్ వ్యాప్తి దేశంలో వ్యాపారంపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ మార్కెట్లు, పర్యాటక రంగం, పంపిణీ వ్యవస్థలు దెబ్బతింటాయని పేర్కొంది. ప్రపంచ వృద్ధిరేటుపై ఈ వైరస్ ప్రభావం 50బేసిస్ పాయింట్లు ఉంటుందని వెల్లడించింది.
‘‘చాలా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వృద్ధిరేటు మందగిస్తోంది. చైనాలో వృద్ధిరేటు నెమ్మదించిన ప్రభావం, భారీగా ఎన్‌పీఏలు, గాలిబుడగల్లా పెరిగిన కార్పొరేట్ బ్యాలెన్స్‌షీట్‌లు పెట్టుబడులకు భారంగా మారతాయి’’ అని పేర్కొంది. ‘కరోనావైరస్: ముప్పు ముంగిట ప్రపంచ ఆర్థిక వ్యవస్థ’ అనే పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. మరోపక్క ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ కూడా భారత వృద్ధిరేటు 2020లో 5.4శాతంగా ఉంటుందని పేర్కొంది. గతంలో 6.6శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఈ సంస్థ ప్రపంచ వృద్ధిరేటు కూడా 2.4శాతం ఉంటుందని చెప్పింది. యూబీఎస్ సంస్థ కూడా భారత వృద్ధిరేటు 20బేస్ పాయింట్ల మేరకు ప్రభావితం కావచ్చని పేర్కొంది.
చైనాపై ఆధారపడటమే ముప్పు..
2003లో సార్స్ వ్యాధి వ్యాపించే సమయంతో పోలిస్తే ఇప్పుడు చైనాపై ఆధారపడటం బాగా పెరిగిపోయింది. ప్రపంచ ఉత్పాదక రంగం, పర్యాటకం, వాణిజ్యం, కమోడిటీ మార్కెట్లలో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. 2003లో సార్స్ ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఇది ఒక శాతం లోపుగానే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ 2020 నాటికి ప్రపంచ మార్కెట్లు చైనా మీద ఆధారపడటం పెరిగిపోయింది. ఉదాహరణకు భారత్‌నే తీసుకొంటే 2002-03లో చైనాతో వ్యాపారం కేవలం 4.8 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు 2018-19 నాటికి 18 రెట్లు పెరిగి 87 బిలియన్ డాలర్లకు చేరింది.
ప్రపంచ జీడీపీలో చైనా వాటా 19.71శాతం ఉంది. అంటే దాదాపు ఐదోవంతు అన్నమాట. చైనా వృద్ధిరేటులో మార్పులు దీనిపై కచ్చితంగా పడతాయి. చైనా ప్రపంచంలోనే 13 శాతంతో అతిపెద్ద ఎగుమతిదారుగా.. 11 శాతంతో రెండో అతిపెద్ద దిగుమతిదారుగా నిలిచింది. కరోనాతో చైనాలో దాదాపు 50 కోట్ల మంది దిగ్బంధంలో ఉన్నారు. చాలా కర్మాగారాలు మూతపడిపోయాయి. ఈ సారి కూడా ప్రపంచ జీడీపీ 0.5శాతం ప్రభావితం అవుతుందని చెబుతున్నారు. కానీ ఈ స్థాయి దాటి మరింత ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి.
భారత్ దిగుమతులపై ఇలా..
భారత్ దిగుమతులు అత్యధికంగా చేసుకొనే దేశం. దేశీయ పరిశ్రమలు చాలా వరకు ముడి సరుకులను చైనా నుంచి దిగుమతి చేసుకొంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతుల్లో 45శాతం చైనా నుంచే వస్తున్నాయి. మూడో వంతు యంత్ర పరికరాలు అక్కడి నుంచే భారత్‌కు చేరుకొంటున్నాయి. భారత్ దిగుమతి చేసుకొనే ఆర్గానిక్ కెమికల్స్‌లో 40శాతం చైనా నుంచి వచ్చేవే. ఆటోమొబైల్ విడిభాగాలు, ఫర్టిలైజర్స్‌లో 25శాతం డ్రాగన్ నుంచి కొనుగోలు చేస్తున్నాము. భారత్ ఫార్మారంగంలో వాడే కీలకమైన ముడి పదార్థాల్లో 65-70శాతం చైనాలో తయారైనవే. మొబైల్ ఫోన్స్, విడిభాగాల్లో 90శాతం చైనాలో తయారయ్యేవే ఉంటున్నాయి. ఇవే కాకుండా పంపిణీ వ్యవస్థ దెబ్బతినడంతో భారత కంపెనీల ఉత్పాదక సామర్థ్యం కూడా తగ్గుతుంది. సీఎల్‌ఏఎస్ నివేదిక ప్రకారం ఫార్మా, కెమికల్స్, ఎలక్ట్రానిక్ రంగాలు ఈ ప్రభావంతో 10శాతం వరకు ధరలను పెంచవచ్చు.
- భారత్‌కు ఎలక్ట్రానిక్ పరికరాల అతిపెద్ద ఎగుమతి దారు చైనానే. ముడిసరుకుల నుంచి తయారైన వస్తువుల వరకు భారీగా ఇక్కడకు వస్తాయి. ముఖ్యంగా ముడిసరుకుల కొరత, ఉత్పత్తి తగ్గిపోవడం, ధరలు పెరగడం వంటి ప్రతికూలాంశాలను భారత ఎలక్ట్రానిక్స్ రంగం ఎదుర్కోవాల్సి ఉంది.
- రసాయన పరిశ్రమలు మూతపడటం, షిప్‌మెంట్లపై ఆంక్షల కారణంగా మరింత ప్రభావితం కానున్నాయి. చైనా నుంచి భారత్‌కు ‘ఇండిగో’ భారీగా సరఫరా అవుతుంది. ఇది డెనిమ్ పరిశ్రమకు చాలా అవసరం.
- ఆటోమొబైల్ పరిశ్రమ భారీగా చైనాపై ఆధారపడింది. ఇప్పటి వరకు చైనా నుంచి వచ్చే పరికరాల సరఫరాలో పెద్దగా అడ్డంకులు ఏర్పడలేదు. కానీ, భవిష్యత్తులో అక్కడ పరిశ్రమల మూసివేత కొనసాగితే మాత్రం 8-10శాతం వరకు విడిభాగాల కొరత ఎదుర్కోక తప్పదు.
- చైనా నుంచి బల్క్‌డ్రగ్స్‌ను భారత్‌కు అత్యధికంగా దిగుమతి చేసుకొంటారు. వీటిని వినియోగించి ఔషధాలు తయారుచేసి ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నాం. ఇప్పుడు కరోనా కారణంగా ఈ పరిశ్రమ బాగా ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
- సోలార్‌పవర్ పరిశ్రమలో ముడిపదార్థాల కొరత తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సోలార్ ప్యానల్స్, సెల్స్ అత్యధికంగా చైనా నుంచి వస్తున్నాయి.
- చైనా నుంచి పర్యాటకుల రాక తగ్గడం తూర్పు ఆసియా దేశాలపై ప్రభావం చూపిస్తోంది. భారత్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోనుంది.
- చైనాలో కరోనా కారణంగా నూతన సంవత్సర సెలవును పొడిగిస్తే ఐటీ పరిశ్రమపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయా సంస్థల రెవ్యెన్యూ, వృద్ధిరేటు ప్రభావితం కానున్నాయి.
మన ఎగుమతులపై ఇలా..
భారత్ అత్యధికంగా సరుకులు ఎగుమతి చేస్తున్న దేశాల్లో చైనా మూడో స్థానంలో ఉంది. మన మొత్తం ఎగుమతుల్లో 5శాతానికి పైగా ఆ దేశానికి వెళతాయి. ముఖ్యంగా ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్, మత్స్య పరిశ్రమకు చెందిన ఉత్పత్తులు, కాటన్ వంటివి ఉన్నాయి.
దీంతోపాటు భారత్‌కు చెందిన చాలా కంపెనీలు చైనాలోని తూర్పు ప్రాంతాలో కర్మాగారాలను నెలకొల్పాయి. వీటిల్లో 72శాతం షాంగై, బీజింగ్, గ్యాంగ్‌డాంగ్, జియాన్‌జ్సు,షాన్‌డాంగ్ వంటి నగరాల వద్ద ఉన్నాయి.
ఇప్పుడు వైరస్ ప్రభావం కారణంగా ఈ కంపెనీల ఉత్పత్తిపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా తయారీ, ఐటీ, తయారీ రంగ సేవలు, బీపీవో, లాజిస్టిక్స్, కెమికల్స్, ఎయిర్‌లైన్స్, టూరిజం వంటివి ఉన్నాయి. చైనాలో టెక్స్‌టైల్ పరిశ్రమలు మూతపడటంతో భారత్ నుంచి దుస్తులు, నూలు, ఇతర ముడి పదార్థాలకు డిమాండ్ తగ్గనుంది.
ఇవీ చూడండి:10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్