తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా ధాటికి భయాందోళనల్లో ప్రపంచార్థికం - global economy is making a difference

కరోనా విజృంభణతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. కార్యకలాపాలు స్తంభించిపోయి అనేక పరిశ్రమలు దివాళా దిశగా అడుగులు వేస్తున్నాయి. నగదు కొరతతో సతమతమవుతున్న ప్రపంచ ఆర్థిక దిగ్గజాలు తమకున్న ఆస్తులను అమ్మేసుకునేందుకే మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన కేంద్ర బ్యాంకులైన అమెరికా ఫెడరల్‌ రిజర్వు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా, స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌ వంటివి మార్కెట్లలో ద్రవ్యలభ్యత(లిక్విడిటీ)ను పెంచేందుకు కృషి చేస్తున్నాయి.

corona
కరోనా ధాటికి భయాందోళనల్లో ప్రపంచార్థికం

By

Published : Apr 12, 2020, 7:22 AM IST

కోవిడ్‌-19 మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి దింపే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎదురవుతున్న లాక్‌డౌన్‌లతో వ్యాపార కార్యకలాపాల్లో పలు సమస్యలు, అడ్డంకులు తలెత్తి వైమానిక, పర్యాటక రంగాల్లోని చాలా కంపెనీలు దివాలా దిశగా నడిచే అవకాశం కనిపిస్తోంది. భారత్‌పై ఇప్పటికే ఈ తరహా ప్రభావం పడింది. విమానయాన సంస్థలు, రెస్టారెంట్లు, హోటళ్లు, చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, ఎగుమతి ఆధారిత రంగంపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం పడింది.

మహమ్మారి ప్రభావంతో ప్రపంచ వాణిజ్య ఎగుమతుల్లో 5,000 కోట్ల డాలర్ల మేర క్షీణత ఉంటుందని వాణిజ్యం, అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సు అంచనా వేసింది. భారత్‌పై వాణిజ్య ప్రభావం 34.80 కోట్ల డాలర్ల మేర ప్రభావం పడనుందని తెలుస్తోంది. అమెరికా, చైనా, ఐరోపా, పశ్చిమాసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడిపదార్థాలపై ఆధారపడే దేశాలకు, వాటికి ఎగుమతులు చేసే కంపెనీలు దారుణంగా దెబ్బతినబోతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులంతా తమవద్ద నగదునే ఉంచుకోవాలని భావిస్తుండటంతో బంగారం తదితర విలువైన లోహాల ధరలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో డబ్బులు సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నగదు కొరతతో సతమతమవుతున్న ప్రపంచ ఆర్థిక దిగ్గజాలు తమకున్న ఆస్తులను అమ్మేసుకునేందుకే మొగ్గు చూపుతున్నాయి. అల్లకల్లోలంగా ఉన్న మార్కెట్లకు మదుపరులు దూరమవుతున్నారు. చమురు అమ్మకాలు, క్రిప్టో కరెన్సీలు, బంగారం, వెండి, సోయాబీన్‌ వంటి కమాడిటీస్‌ పెట్టుబడుల్ని నమ్ముకోవడంకన్నా నగదునే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. దీని ఫలితంగా ఆర్థిక మార్కెట్లలో పరిస్థితి మరింతగా విషమించే అవకాశం ఉంది.

ఈ క్రమంలో ప్రధాన కేంద్ర బ్యాంకులైన అమెరికా ఫెడరల్‌ రిజర్వు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా, స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌... వంటివి మార్కెట్లలో ద్రవ్యలభ్యత(లిక్విడిటీ)ని పెంచేందుకు కృషి చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సజావుగా పనిచేసేందుకు సరిపోయేంత నగదు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. ‘క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌’ తాజా రౌండ్‌ను ఫెడరల్‌ రిజర్వ్‌ ఇప్పటికే ప్రారంభించింది. 2008 ఆర్థిక సంక్షోభం తరవాత ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే తొలిసారి. నగదు కొరత సమస్యల్ని పరిష్కరించేందుకు ఇలాంటి చర్యకు ఉపక్రమించారు. ఫెడరల్‌ రిజర్వ్‌ తన వడ్డీరేటును సున్నాకు తగ్గించేసింది. 70 వేలకోట్ల డాలర్ల మేరకు ఆర్థిక మార్కెట్లలోకి ద్రవ్యలభ్యతను ప్రవేశపెట్టనుంది. భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ)కు ఇలాంటి పరిస్థితి ఇంకా తలెత్తలేదు. భారత్‌కు సంబంధించి ఆర్థిక మార్కెట్లకు ఇంకా లిక్విడిటీ సమస్యలు ఎదురు కాలేదు. భారత ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యలభ్యత పరిస్థితి ఇప్పటికీ సులభతరంగానే ఉంది. భారత ఆర్థిక మార్కెట్లలో రూపాయి లిక్విడిటీని సులభతరంగా సాగేలా చూసేందుకు వీలుగా ఆర్‌బీఐ ఇప్పటికే లక్ష కోట్ల రూపాయల మేర దీర్ఘకాలిక రెపో ఆపరేషన్‌ (ఎల్టీఆర్‌వో)ను ప్రారంభించింది. మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రతిచర్యల్లో భాగంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత తరుణంలో ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడకుండా శక్తిమేర కృషి చేసే సంకేతం ఇచ్చేందుకు ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ పాలసీ రేటు కోతనూ పరిశీలించే అవకాశం ఉంది. ప్రస్తుతం తీవ్రస్థాయి అనిశ్చితి, లాక్‌డౌన్లు కొనసాగుతున్న పరిస్థితుల్లో వడ్డీరేటు కోతలు గిరాకీని పెంచలేవు. ఇప్పుడు ఆర్‌బీఐ ఏం చేయాలి? లాక్‌డౌన్ల కారణంగా అంతరాయాల తరవాత దివాలా తీసే ప్రమాదం ఉన్న కంపెనీలకు రుణపరమైన తోడ్పాటుపై దృష్టి సారించాలి. మహమ్మారి కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలకు రుణ ప్రవాహాలను కొనసాగించడం వల్ల అమ్మకాల ఆదాయాలు పడిపోయినా- ద్రవ్యలభ్యత బాగానే ఉండటం వల్ల జీతాలు చెల్లించగలుగుతారు. ఇది వారి కార్మికులకు ఉపశమనం కలగజేస్తుంది. అంతేకాదు, మహమ్మారి అదుపులోకి వచ్చిన తరవాత వస్తువులు, సేవల గిరాకీని కాపాడినట్లవుతుంది. లాక్‌డౌన్ల సమయంలో ఇలాంటి కంపెనీలు తగినంత ఆదాయాన్ని సంపాదించడమూ కష్టతరమయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ పరిణామం రుణాలు తిరిగి చెల్లించడంలో ఎగవేతలకు దారితీసే ప్రమాదముంది. మహమ్మారి కారణంగా దెబ్బతిన్న రుణగ్రహీతలకు సంబంధించి... వ్యక్తిగత రుణాలతో సహా అన్ని రుణాల తిరిగి చెల్లింపులపై కొన్ని నెలలపాటు తాత్కాలిక నిషేధాన్ని అనుమతించడం సమంజసమైన చర్య.

-పూజా మెహ్రా (రచయిత్రి- దిల్లీకి చెందిన పాత్రికేయులు)

ABOUT THE AUTHOR

...view details