తెలంగాణ

telangana

ETV Bharat / business

చిప్‌ల కొరత.. ఎప్పటికో నిశ్చింత? - చిప్‌ల కొరత

చిప్​ల కొరత కారణంగా దేశీయ వాహన కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. బుక్ చేసుకున్న కార్ల డెలివరీ కోసం 2-3 నెలలు ఎదురుచూసే పరిస్థితి ఎదురైంది. మరికొన్ని నెలల పాటు చిప్‌ల కోరతతో తంటాలు తప్పకపోవచ్చని కార్ల కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

chip shortage
చిప్‌ల కొరత

By

Published : Aug 18, 2021, 8:32 AM IST

'చిప్‌'.. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లో ఎంతో ముఖ్యమైన ఈ విడిభాగం ఇప్పుడు వాహన తయారీ కంపెనీలు, వినియోగదార్లకు చుక్కలు చూపిస్తోంది. చిప్‌లు తగినంతగా లభ్యం కాక ఉత్పత్తి తగ్గించాల్సిన పరిస్థితిని కంపెనీలు ఎదుర్కొంటుంటే, 'బుక్‌' చేసుకున్న కార్ల డెలివరీ కోసం 2-3 నెలలు ఎదురుచూసే పరిస్థితి వినియోగదార్లది. మరికొన్ని నెలల పాటు చిప్‌ల కోరతతో తంటాలు తప్పకపోవచ్చని కార్ల కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

కొన్ని వాహన కంపెనీలు రోజులో ఒక షిఫ్ట్‌లో మాత్రమే ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తుంటే, మరికొన్ని కంపెనీలు వారానికి ఒకటి, రెండు రోజుల పాటు యూనిట్లు మూసివేస్తున్నాయి. దీనివల్ల పెద్ద ఎత్తున ఉత్పత్తి నష్టం ఏర్పడుతోంది.

అన్ని కంపెనీలకూ అదే సమస్య

మారుతీ సుజుకీ, హ్యూందాయ్‌, టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా.. ఇలా అన్ని కంపెనీలకూ చిప్‌ల కొరత తలెత్తింది. కొంతకాలంగా కార్లలో చిప్‌ల వాడకం ఎంతో పెరిగింది. 'మెమరీ ఫంక్షన్స్‌' తో ఇంజన్‌ను నియంత్రించడం నుంచి ఎన్నో రకాల ఎలక్ట్రానిక్‌ సదుపాయాలు, బ్లూటూత్‌ కనెక్టివిటీ, డ్రైవర్‌-అసిస్ట్‌, నేవిగేషన్‌ సిస్టమ్స్‌, హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ సిస్టమ్స్‌లను కార్లలో వినియోగిస్తున్నారు.వీటికి చిప్‌లు తప్పనిసరి. అందువల్లే ప్రారంభ శ్రేణి కార్లను మినహాయిస్తే, మధ్య శ్రేణి నుంచి హైఎండ్‌ కార్లలో చిప్‌ల వినియోగం అధికమైంది. ఇదే సమస్యగా మారింది.

కొరత ఎందుకంటే..

కొవిడ్‌-19 వల్ల ఇంటి నుంచి పని, ఆన్‌లైన్‌ విద్య, వెబినార్లు, దృశ్యమాధ్యమ సమావేశాలతో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌ట్యాప్‌, డెస్క్‌టాప్‌లకు గిరాకీ పెరిగింది. ఈ డిజిటల్‌ ఉత్పత్తుల కంపెనీల నుంచి చిప్‌ కంపెనీలు పెద్దఎత్తున చిప్‌ల సరఫరా ఆర్డర్లు తీసుకున్నాయి. అదే సమయంలో వాహన కంపెనీలు కార్ల అమ్మకాలు అంతగా లేవని, సమీప భవిష్యత్తులో పెరగవనే ఆలోచనతో చిప్‌ సరఫరా ఆర్డర్లు తగ్గించాయి.

కొవిడ్‌-19 తీవ్రత తగ్గాక, ప్రజల్లో ఎక్కువ మంది 'ప్రజా రవాణా వ్యవస్థ'ల్లో ప్రయాణించేందుకు ఇష్టపడటం లేదు. సొంత కార్లో వెళ్లడం మేలనే ఆలోచన చేస్తున్నారు. దీంతో కార్లు కొనేవారి సంఖ్య పెరిగింది. దీనికి తగ్గట్లుగా కార్లు ఉత్పత్తి చేయడానికి చిప్‌లు అందుబాటులో లేకపోయాయి. మధ్యశ్రేణి ఎస్‌యూవీ/ ఎంయూవీ (బహుళ వినియోగ వాహనం)లకు ఇంతగా డిమాండ్‌ పెరుగుతుందని కార్ల కంపెనీలు ఊహించలేదు. అదే ప్రస్తుత సమస్యకు ప్రధాన కారణం.

ప్రపంచ వ్యాప్తంగా చిప్‌లను ఉత్పత్తి చేసే కంపెనీల సంఖ్య తక్కువ. పైగా కొవిడ్‌-19 విస్తరణ, ఆంక్షలు- లాక్‌డౌన్‌ వల్ల చిప్‌ కంపెనీల్లో ఏడాదిన్నర కాలంగా ఉత్పత్తికి అంతరాయాలు ఏర్పడ్డాయి. దీనివల్ల ఆయా సంస్థల వద్ద ఆర్డర్లు పేరుకుపోయాయి.

ప్రత్యామ్నాయాలపై దృష్టి

చిప్‌ల కొరతతో దేశీయ వాహన కంపెనీలు తమ ఉత్పత్తి ప్రణాళికల్లో మార్పులు- చేర్పులు చేస్తున్నాయి. చిప్‌లను బహిరంగ విపణిలో అధిక ధరకు కొనుగోలు చేయడంతో పాటు, చిప్‌ల అవసరం లేని ప్రాథమిక శ్రేణి మోడళ్లు ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ మధ్యశ్రేణి, హైఎండ్‌ వాహనాలకు గిరాకీ ఎక్కువగా ఉన్నందున వాహన కంపెనీలు ప్రస్తుతానికి ఈ సమస్యను అధిగమించటం కష్టసాధ్యంగానే కనిపిస్తోంది.

పరిశ్రమకు భారీ నష్టం

  • చిప్‌ల కొరత వల్ల వచ్చే మూడు నెలల్లో దేశీయ వాహన కంపెనీలు తగినంతగా కార్లు ఉత్పత్తి చేయలేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దాదాపు లక్ష కార్ల ఉత్పత్తి తగ్గిపోతుందని అంచనా. దీనివల్ల కలిగే ఆదాయ నష్టం రూ.10,000 కోట్ల వరకు ఉండొచ్చు.
  • మారుతీ సుజుకీ కార్ల ఉత్పత్తి ఈ ఏడాది జూన్‌లోనే కొంత తగ్గింది. ఈ నెలలోనూ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. గుజరాత్‌లోని సుజుకీ మోటార్‌ గుజరాత్‌ (ఎస్‌ఎంజీ) యూనిట్‌లో ఉత్పత్తి తగ్గనున్నట్లు ఇప్పటికే మారుతీ సుజుకీ వెల్లడించింది. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలను ఒక షిప్ట్‌కు తగ్గించడంతో పాటు, శనివారాల్లో ఉత్పత్తి నిలిపి వేయాలని ప్రతిపాదించారు.
  • మహీంద్రా అండ్‌ మహీంద్రా థార్‌ మోడల్‌ కోసం 9 నెలల 'వెయింటింగ్‌' ఉన్నట్లు డీలర్లు చెబుతున్నారు.
  • ఎస్‌యూవీ విభాగంలో అధిక అమ్మకాలు నమోదు చేస్తున్న కియా మోటార్స్‌, ఎంజీ మోటార్స్‌ ఇటీవల తమ కార్ల ఉత్పత్తిని తగ్గించాయి. చిప్‌లతో పాటు కొన్ని కీలక విడిభాగాల సరఫరా లేకపోవడం దీనికి కారణం.
  • సెమీకండక్టర్‌ కొరత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు హ్యూందాయ్‌ మోటార్‌ ఇండియా ఎండీ అండ్‌ సీఈఓ ఎస్‌ఎస్‌ కిమ్‌ పేర్కొన్నారు.
  • 'సెమీకండక్టర్ల కొతర లేకపోతే ఏప్రిల్‌- జులై మధ్యకాలంలో మరో 30,000 కార్లు అధికంగా విక్రయించగలిగే వాళ్లం' అని టాటా మోటార్స్‌ ప్రతినిధి ఒకరు ఇటీవల పేర్కొన్నారు. మరో మూడు నెలల పాటు ఇదే పరిస్థితి తప్పేటట్లు లేదని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'క్రమంగా గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థ'

ABOUT THE AUTHOR

...view details