చైనాలో పందిమాంసం రోజువారీ ఆహారంలో భాగం. ప్రపంచంలో మూడింట రెండు వంతుల పోర్క్ను చైనా ఉత్పత్తి చేస్తుంది. అంతే పరిమాణంలో వినియోగిస్తుంది కూడా. అయితే.. చైనాలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెంది.. పంది మాంసం ధరలు రెండు రెట్లు అధికమయ్యాయి. ఈ కారణంగా నవంబర్లో ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠాన్ని తాకింది.
4.5 శాతంగా నమోదు..
వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) గత నవంబర్లో 4.5 శాతంగా నమోదైనట్లు జాతీయ గణాంకాల సంస్థ (ఎన్బీఎస్) వెల్లడించింది. అది గత అక్టోబర్లో 3.8గా ఉండగా తాజాగా నమోదైన లెక్కలు 2012, జనవరి నుంచి ఇప్పటి వరకు గరిష్ఠంగా ఉన్నాయి.
బ్లూమ్ బర్గ్ న్యూస్ సర్వే విశ్లేషకులు ఈఏడాది ద్రవ్యోల్బణం సుమారు 4.3 శాతంగా నమోదవుతుందని అంచనా వేశారు.
స్వైన్ ఫీవర్తో..
2018 ఆగస్టు నుంచి చైనాలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందింది. పందులకు మాత్రమే సోకే ఈ వ్యాధి వల్ల మానవులకు ఎలాంటి హాని లేకపోయినప్పటికీ.. విధిలేని పరిస్థితుల్లో అధికారులు అధిక సంఖ్యలో పందులను చంపారు. ఫలితంగా చైనాలో పంది మాంసం సరఫరాపై ప్రభావం పడింది. గత నవంబర్లో మాంసం ధరలు సుమారు 110.2 శాతం మేర పెరిగాయి.