వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ) పరిహారం చెల్లించడానికి ఆర్థిక వనరుల్లేక రుణ మార్గాన్ని ఎంచుకున్న కేంద్రం.. దానిపై మరింత స్పష్టతనిచ్చింది. రెండురోజుల క్రితం జరిగిన జీఎస్‌టీ మండలి 41వ సమావేశంలో రాష్ట్రాల ముందుంచిన రెండు ప్రతిపాదనలపై అదనపు వివరాలు వెల్లడించింది. ఐచ్ఛికాల గురించి వివరణాత్మక నోట్ పంపితే తాము పరిశీలించి వారం రోజుల్లోపు అభిప్రాయం చెబుతామని రాష్ట్రాలు సూచించడంతో కేంద్ర ఆర్థికశాఖ శనివారం ఆ పని చేసింది. కేవలం జీఎస్‌టీ అమలు కారణంగా ఏర్పడిన రూ.97వేల కోట్ల నష్టాన్ని భరించడానికి సిద్ధపడిన రాష్ట్రాలకు ఆర్‌బీఐ నుంచి ప్రత్యేక గవాక్షం ద్వారా ఇప్పించే రుణంపై వడ్డీని, అసలును కేంద్రమే చెల్లిస్తుందని భరోసా ఇచ్చింది. అలా కాకుండా కరోనా మహమ్మారి కారణంగా నష్టపోయిన రూ.2.35 లక్షల కోట్లను పొందాలన్న ఐచ్ఛికాన్ని ఎంచుకున్న రాష్ట్రాలు ఆర్‌బీఐ తీసుకొనే రుణాలపై వడ్డీని సొంతంగా చెల్లించుకోవాలని, అసలును మాత్రమే కేంద్రం చెల్లిస్తుందని పేర్కొంది.ఈ రుణం రాష్ట్రాల ఎఫ్‌ఆర్‌బీఎంల పరిధిలోకి వస్తుందని స్పష్టత ఇచ్చింది. జీఎస్‌టీ అమలు కారణంగా తలెత్తే నష్టాన్ని మాత్రమే పరిహారంగా రాష్ట్రాలకు చెల్లించాలని జీఎస్‌టీ చట్టం చెబుతోందని, అంటే దాని అర్థం ఇతరత్రా కారణాలవల్ల తలెత్తే నష్టాలను చెల్లించాల్సిన అవసరం లేదనేనని కేంద్రం అభిప్రాయపడింది. చట్టం రూపొందించే సమయంలో ఇలాంటి దైవ్యకార్య ఘటనలను దాని రూపకర్తలు ఊహించి ఉండరని పేర్కొంది. దైవకార్యం, సాధారణ నష్టం మధ్య తేడాను చట్టంలోని సెక్షన్ 7 నిర్వచించలేదు కాబట్టి జరిగిన మొత్తం నష్టాన్ని సెస్సు ద్వారా చెల్లించాలని అటార్నీ జనరల్ చేసిన సూచనలను కేంద్రం అంగీకరించిందని ఆర్థిక శాఖ వివరణాత్మక నోట్‌లో పేర్కొంది.
మొదటి ఐచ్ఛికం..
జీఎస్‌టీ అమలు కారణంగా ఈ ఏడాది తలెత్తే రూ.97వేల కోట్ల నష్టాన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో రుణం రూపంలో పొందొచ్చు. ప్రతి రెండు నెలలకు జీఎస్‌టీ పరిహారం చెల్లించినట్లుగానే ఈ రుణ మొత్తం కూడా ప్రతి రెండు నెలలకు రాష్ట్రాలకు అందుతుంది.
- దాదాపు ప్రభుత్వ సెక్యూరిటీల తరహాలోనే తక్కువ వడ్డీ ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ వడ్డీరేటు అంతకు మించితే ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్రాల అభివృద్ధి రుణాలపై ఉండే వడ్డీ మధ్య 0.5% (50 బేసిస్ పాయింట్లు)ను రాయితీ రూపంలో కేంద్రం భరిస్తుంది.
- ఈ రుణం పొందడానికి రాష్ట్రాలకు ప్రత్యేక అనుమతి ఇస్తుంది. ఇప్పటికే ఉన్న ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి అతీతంగా దీన్ని తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
- కేంద్రపాలిత ప్రాంతాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది.
- 2022 జూన్ వరకు (పరిహార చెల్లింపు కాలపరిమితి) ఈ రుణాలపై వడ్డీని సెస్సు నుంచి కేంద్రం చెల్లిస్తుంది. ఆ తర్వాత అసలును కూడా దాన్నుంచే చెల్లిస్తుంది. ఈ రుణాల చెల్లింపు పూర్తయ్యేంతవరకూ పరిహార సెస్సు కాలపరిమితిని పొడిగిస్తారు.
- ఈ రుణాలపై వడ్డీని, అసలును రాష్ట్రాలు తమ సొంత వనరుల నుంచి చెల్లించాల్సిన అవసరమే ఉండదు.
- ఈ ఆప్షన్‌ని ఎంచుకున్న రాష్ట్రాలకు ఎలాంటి షరతులు పాటించాల్సిన అవసరం లేకుండానే ఎఫ్‌ఆర్‌బీఎంలో ఇప్పటికే అనుమతించిన 0.5%కి తోడు మరో 0.5% రుణాలు అధికంగా తీసుకోవడానికి వీలు కల్పిస్తారు. దీనివల్ల రాష్ట్రాలు అదనంగా రూ.లక్ష కోట్లు రుణంగా పొందడానికి వీలవుతుంది.
- రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుమతించిన మేరకు పూర్తి రుణాలు తీసుకోలేకపోతే మిగిలిన మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో అదనంగా తీసుకోవడానికి వీలు కల్పిస్తారు. దీనికితోడు కేంద్రం నిర్దేశించిన గడువులోగా సంస్కరణలను పూర్తిచేసిన రాష్ట్రాలు దానికింద తీసుకోవాల్సిన మొత్తం మిగిలిపోతే దాన్నికూడా వచ్చే సంవత్సరం తీసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తారు.
- సంధి కాలంలో ఏర్పడిన పరిహార బకాయిలను ప్రస్తుతం తీసుకొనే రుణాలపై వడ్డీ, అసలు తీరిన తర్వాతే చెల్లిస్తారు.
రెండో ఐచ్ఛికం
కొవిడ్-19 కారణంగా ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ నుంచి రుణాలు తీసుకోవచ్చు. దానికి సంబంధించిన అసలును పరిహార సెస్సు నుంచి చెల్లిస్తామని మాత్రం కేంద్రం ఆఫీస్ మెమోరాండం జారీ చేస్తుంది.
- ఈ ఏడాది వరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్‌ఆర్‌బీఎం కింద రుణాలు తీసుకోవడానికి అనుమతి ఉన్న 3%+ జీఎస్‌టీ కారణంగా ఏర్పడిన నష్టం+ కేంద్రం నిర్దేశించిన సంస్కరణలు పూర్తిచేసిన రాష్ట్రాలకు అదనంగా 1% మొత్తం వరకు రుణం తీసుకోవడానికి వీలు కల్పిస్తారు.
- లేదంటే 3% జీఎస్‌డీపీ+ 1% జీఎస్‌డీపీ+ 1% జీఎస్‌డీపీ (సంస్కరణలు పూర్తిచేస్తేనే)వరకు తీసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఈ రెండింటిలో దేని కింద ఎక్కువ వస్తే ఆ మొత్తం రుణంగా తీసుకోవడానికి అనుమతిస్తారు.
- కేంద్రం నిర్దేశించిన నాలుగు సంస్కరణలు పూర్తిచేసిన రాష్ట్రాలు 1% అదనపు రుణాలు ఈ ఏడాదిలోపే తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిపోయిన వాటిని వచ్చే ఏడాదికి పొడిగించుకోవడానికి వీల్లేదు.
- ఈ రుణాలపై వడ్డీలను రాష్ట్రాలు సొంత ఆదాయ వనరుల నుంచే చెల్లించుకోవాలి. అసలును మాత్రం సంధికాలం తర్వాత సెస్సు నుంచి కేంద్రం చెల్లిస్తుంది.
- రూ.2.35 లక్షల కోట్లలో జీఎస్‌టీ అమలు కారణంగా ఏర్పడే రూ.97వేల కోట్లను రాష్ట్రాలు తీసుకున్న రుణాలుగా పరిగణించరు. మిగిలిన రూ.1.38 లక్షల కోట్లను రాష్ట్రాల రుణాలుగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తెస్తారు.