నగదు రహిత చెల్లింపులను- క్రెడిట్, డెబిట్ కార్డులద్వారా అమెరికా విశ్వవ్యాప్తం చేసింది. మరోవైపు ఈ పద్ధతికి చైనా జోరుగా చెల్లుచీటీ ఇస్తోంది. నేడు చైనాలో జనం ఆహారశాలల్లో ఆహారం మొదలుకొని ఈ-కామర్స్ సైట్లలో వస్తువులు కొనడం వరకు- డిజిటల్ వాలెట్లు, క్యూఆర్‌కోడ్‌లను విస్తృతంగా వాడుతున్నారు. ఇప్పటికే 83 కోట్ల మందికిపైగా ప్రజలు స్మార్ట్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాల ద్వారా డిజిటల్ చెల్లింపులకు మారారు. అక్కడి బిచ్చగాళ్లు సైతం క్యూఆర్‌కోడ్ ద్వారా ముష్టి స్వీకరిస్తున్నారంటే ఈ విధానం ఎంతగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.
చెల్లింపుల సంధానకర్తలుగా బ్యాంకుల స్థానాన్ని అలీబాబా (చైనా అమెజాన్), టెన్సెంట్ (చైనా ఫేస్‌బుక్) ఆక్రమిస్తున్నాయి. చిల్లర వర్తకులు క్రెడిట్ కార్డు చెల్లింపులపై చైనా బ్యాంకులకు 0.5 శాతం నుంచి 0.6 శాతం రుసుము చెల్లించాల్సి ఉంటే, మొబైల్ వాలెట్లపై కేవలం 0.1 శాతం రుసుము చెల్లిస్తే సరిపోతుంది. అందుకే గతేడాది అలీపే (అలీబాబా), వియ్‌చాట్ పే (టెన్సెంట్) యాప్‌ల ద్వారా 12.8 లక్షల కోట్ల డాలర్ల విలువైన డిజిటల్ చెల్లింపులు జరిగాయి. నేడు ప్రపంచంలో జరుగుతున్న డిజిటల్ చెల్లింపుల్లో సగం చైనావే కావడం గమనార్హం.
ఆఫ్రికాకు వరం
చైనా ప్రారంభించిన నగదు రహిత ఆన్‌లైన్ చెల్లింపుల విప్లవం- బ్యాంకు సౌకర్యాలు కొరవడిన ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. ఆఫ్రికాలో నేడు 4 జీ నెట్‌వర్క్‌లు, స్మార్ట్ ఫోన్లతో మొబైల్ చెల్లింపులు విజృంభిస్తున్నాయంటే, అది చైనా పెట్టుబడులు, సాంకేతికతల చలవే. భారతదేశంలోనూ ఈ ఏడాది అక్టోబరు నెలలో మొట్టమొదటిసారిగా కార్డుల కన్నా ‘యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)’ ద్వారానే ఎక్కువ లావాదేవీలు జరిగాయి. గూగుల్ పే, ఫోన్ పే, భీమ్ వంటి యూపీఐ యాప్‌లతో డిజిటల్ లావాదేవీలు జరపడంలో బెంగళూరు (38.10 శాతంతో) అగ్రస్థానం వహించగా, తదుపరి స్థానాలను హైదరాబాద్ (12.50 శాతం), దిల్లీ (10.22 శాతం) ఆక్రమించాయి. ఈ గణాంకాలను బెంగళూరుకు చెందిన ‘పేమెంట్ గేట్‌వే రేజర్ పే’ వెల్లడించింది.
అలీబాబా, వియ్‌చాట్ పే యాప్‌లు క్రమంగా బ్యాంకుల వ్యాపారాన్ని లాగేసుకుంటున్నా, ఈ రెండు మొబైల్ వాలెట్లు ఇప్పటికీ బ్యాంకు ఖాతాలతో అనుసంధానమై పనిచేస్తున్నాయి. అమెరికాకు చెందిన కంపెనీ ఫేస్‌బుక్ వీటికన్నా ఎన్నో అడుగులు ముందుకేసి అసలు బ్యాంకులతో, స్థానిక కరెన్సీలతో నిమిత్తం లేకుండా 2020లో సొంతంగా ‘లిబ్రా’ అనే డిజిటల్-క్రిప్టో కరెన్సీని ప్రవేశపెట్టాలనుకొంటోంది. చైనా తానూ తక్కువ తినలేదంటూ లిబ్రాకు దీటుగా కేంద్ర బ్యాంకు డిజిటల్ కరెన్సీని విడుదల చేయదలచింది. బహుశా ఈ కరెన్సీ 2020 మధ్యనాళ్లలోనే రంగప్రవేశం చేయవచ్చు. మార్కెట్ మూలధనీకరణలో ప్రపంచంలోనే అగ్ర బ్యాంకు అయిన జేపీ మోర్గన్ చేజ్ (జేపీఎం) సైతం ఈ పోటీలోకి దూకింది. ఈ ఏడాది మొదట్లోనే సొంతంగా జేపీఎం ‘కాయిన్’ అనే క్రిప్టో కరెన్సీని ప్రారంభించింది. ఆ బ్యాంకు ఖాతాదారు సంస్థలు మెరుపు వేగంతో నిధులు బదిలీ చేయడానికి ఉపకరించే ఈ కరెన్సీ ‘బ్లాక్ చెయిన్’ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది.
లిబ్రా ఎలా పనిచేస్తుంది?
మరోవైపు లిబ్రాను అంతర్జాతీయ డిజిటల్ కరెన్సీగా మార్చాలని ఫేస్‌బుక్ లక్షిస్తోంది. కానీ, డిజిటల్ చెల్లింపుల్లో చైనా అంచెలంచెలుగా ముందుకెళుతుంటే లిబ్రాకు అమెరికా, ఐరోపాల్లోని బ్యాంకింగ్ రంగం నుంచి, నియంత్రణ సంస్థల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. లిబ్రా అనేది ఓ క్రిప్టో కరెన్సీ. అన్ని క్రిప్టోలు డిజిటల్ కరెన్సీలే కానీ, అన్ని డిజిటల్ కరెన్సీలు క్రిప్టోలు కావు. లిబ్రాను ఎలాంటి రుసుము చెల్లించనక్కరలేకుండా ప్రపంచంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా భద్రంగా, వేగంగా బదిలీ చేయవచ్చు. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ మాదిరిగా లిబ్రా విలువలో హెచ్చుతగ్గులు ఉండవు. డాలర్, యూరో, యెన్‌ల ఆధారంగా స్థిరమైన విలువతో చలామణీ అవుతుంది. ఎవరైనా లిబ్రాను కొనగానే దానికి సమానమైన విలువ బ్యాంకు ఖాతాలో డాలర్, యెన్, యూరోల రూపంలో జమ అవుతుంది. ఈ డిపాజిట్లపై వడ్డీ సైతం వస్తుంది. లిబ్రాను మళ్లీ డాలర్లు, యూరోల్లోకి మార్చుకోవాలంటే ఫేస్‌బుక్ యాప్ ‘క్యాలిబ్రా’ అప్పటి మారక విలువ ప్రకారం చెల్లింపు నిర్వహిస్తుంది.
డిజిటల్ కరెన్సీగా లిబ్రాను..!
స్విట్జర్లాండ్‌కు చెందిన లాభాపేక్ష లేని ఒక సంస్థ అజమాయిషీలో లిబ్రా పనిచేస్తుంది. లిబ్రా అమలులోకి వస్తే ఏ కంపెనీ అయినా సరే ఆ డిజిటల్ నాణేలతో వాలెట్లు తయారుచేయవచ్చు. ఫేస్‌బుక్‌లో, దాని మెసెంజర్ సర్వీసులో, వాట్సాప్‌లో ప్రపంచవ్యాప్తంగా 270 కోట్లమంది వినియోగదారులు ఉన్నారు. వారందరూ లిబ్రాతో చెల్లింపులు జరపడానికి, మదుపు చేసుకోవడానికి, రుణాలు ఇచ్చిపుచ్చుకోవడానికి తోడ్పడే డిజిటల్ కరెన్సీగా లిబ్రాను తీర్చిదిద్దాలనుకొంటున్నారు. మొదట చెల్లింపు సేవల వేదికగా ఫేస్‌బుక్ పే ను ఆవిష్కరించారు. దీని ద్వారా ఫేస్‌బుక్ అనుబంధ సంస్థలైన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ల ద్వారా సైతం చెల్లింపులు జరపవచ్చు.