బడ్జెట్ తనను నిరాశపర్చిందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యురాలు అషిమ గోయల్ పేర్కొన్నారు. అదే సమయంలో ఆదాయపు పన్ను నిబంధనల్లో మార్పులు, ద్రవ్యలోటు సడలింపు వంటి అంశాలు బాగున్నాయని ఆమె వెల్లడించారు. ఆమె ఈఏసీ-పీఎంలో తాత్కాలిక సభ్యురాలిగా పనిచేస్తున్నారు. ఇక ఆర్థిక మందగమనంపై సీతారామన్ ప్రసంగంలో ఒక్క ముక్క కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.
మందగమనంపై మాట్లాడలేదు...
వృద్ధిరేటును వేగవంతం చేయడానికి ఆర్థిక ఉపశమనాలు.. బాధ్యతాయుతమైన వ్యయాలను బడ్జెట్‌లో బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ రీసెర్చ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.
"మొత్తం మీద ప్రభుత్వ తొలి బడ్జెట్‌లో కనిపించాల్సిన విజన్ ఇందులో లోపించింది. ఇది ఒక లక్ష్యాన్ని వెల్లడించి ఉండాల్సింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆర్థిక మందగమనంపై అందరూ ఆందోళన చెందుతున్నారు. కానీ, మూడుగంటల బడ్జెట్ ప్రసంగంలో మందగమనంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ బడ్జెట్ ఆర్థిక మందగమనానికి ఎలా అడ్డుకట్ట వేస్తుందో వెల్లడించలేదు. సీతారామన్ క్యాచ్-22 అనే విచిత్ర పరిస్థితుల్లో ఉన్నారు. కానీ, ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌లో సమతూకం సాధించారు" అని వెల్లడించారు.
అదే సమయంలో 2008లో ప్రభుత్వం తీసుకున్న చర్యలను మరోసారు అమలు చేయకపోవడాన్ని గోయల్ స్వాగతించారు. అప్పట్లో వడ్డీరేట్లు మరీ తక్కువగా ఉన్నాయన్నారు.
ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్: ఫోన్లు ప్రియం- పెట్రోల్ చౌక!