ఈ నెల 5న ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదార్లకు భారీ ఊరట లభించే ఆవకాశం ఉందని కేపీఎంజీ సంస్థ తన తాజా సర్వేలో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి ఇంకా పెంచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అదే విధంగా కొత్తగా 40 శాతం పన్ను శ్లాబును ప్రారంభించి.. రూ.10 కోట్లకుపైగా వార్షిక ఆదాయం ఉన్న వారిని అందులో చేర్చే అవకాశముందని తెలిపింది.
దేశవ్యాప్తంగా 226 మంది పరిశ్రమ వర్గాలపై.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు బడ్జెట్ సర్వే నిర్వహించింది కేపీఎంజీ సంస్థ.
సర్వేలోని ముఖ్య విషయాలు
- సర్వేలో పాల్గొన్న వారిలో 74 శాతం మంది వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పెంచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
- రూ. 10 కోట్ల ఆదాయం ఉన్న వారిని...40 శాతం శ్లాబులోకి చేర్చే అవకాశం ఉందని 58 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
- వారసత్వ సుంకాలను తిరిగి తీసుకురావచ్చని 13 శాతం, సంపద/ఎస్టేట్ పన్నును పునరుద్ధరించొచ్చని 10 శాతం మంది తెలిపారు.
- గృహ రుణాలపై ప్రస్తుతం ఇస్తున్న మినహాయింపు మరింత పెంచే అవకాశం ఉందని 65 శాతం మంది తెలిపారు.
బడ్జెట్ ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పరిశ్రమ వర్గాలు జరిపిన చర్చల ఆధారంగా.. అన్ని కంపెనీలకు కార్పొరేట్ సుంకం 25 శాతానికి తగ్గించడం కష్టమేనని 46 శాతం మంది పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పద్దు 2019: బడ్జెట్ సూట్‌కేస్ చరిత్ర తెలుసా?