వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ కసరత్తు జట్టులో ఈ సారి ఇద్దరు కీలక అధికారుల కొరత ఏర్పడింది. ఇదే తరుణంలో మోదీ 2.0 ప్రభుత్వం బడ్జెట్‌పై కసరత్తు ముమ్మరం చేసింది.
2020-21 కేంద్ర బడ్జెట్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక మాంద్యం భయాలు, వృద్ధి మందగమనం వంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి బడ్డెట్లో నిర్మాణాత్మక సంస్కరణలకు పెద్దపీట వేయొచ్చనే అంచనాలు ఉన్నాయి.
రెండు కీలక పదవులు ఖాళీ..
ఈ సమయంలో బడ్జెట్ రూపకల్పనలో కీలకమైన వ్యయాల కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి(బడ్జెట్) పదవులు దాదాపు మూడు నెలలుగా ఖాళీగా ఉన్నాయి.
ఇంతకు ముందు వ్యయాల కార్యదర్శిగా ఉన్న గిరీశ్ చంద్ర ముర్మును కొత్తగా ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్‌కు తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించింది కేంద్రం. ముర్ము స్థానంలో ఆర్థిక కార్యకలాపాల కార్యదర్శి అతాను చక్రవర్తికి వ్యయాల కార్యదర్శి అదనపు బాధ్యతలను అప్పగించింది.
చక్రవర్తి 1985 గుజరాత్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆర్థిక శాఖలో ఆర్థిక కార్యకలాపాల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ శాఖలో ఏడాదిపాటు పని చేసిన తర్వాత 2019 జూన్‌లో చక్రవర్తిని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా నియమించింది కేంద్రం.