తెలంగాణ

telangana

ETV Bharat / business

పద్దు 2019: నిర్మల సవాళ్ల సవారీ - మోదీ

ఎన్డీఏ 2.0 ప్రభుత్వంలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థికమంత్రి. ఎన్డీఏ 1.0లో ఉన్నంత సాఫీగా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు లేదన్నది నిపుణుల విశ్లేషణ. వివిధ రంగాల్లో సంక్షోభం నెలకొంది. ఎగుమతులు పడిపోవటం సహా కీలక సవాళ్లను నిర్మలా సీతారామన్ ఎదుర్కోబోతున్నారు.

పద్దు 2019: నిర్మల సవాళ్ల సవారీ

By

Published : Jun 28, 2019, 6:53 PM IST

ఆర్థిక మంత్రికి సవాళ్ల స్వాగతం

నిర్మలా సీతారామన్​.... దేశంలోనే మొదటి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రి. ఎన్డీఏ 2.0 ప్రభుత్వంలో ఆర్థిక సంస్కరణల సారథి. ఎన్డీఏ 1.0లో రక్షణ శాఖను పర్యవేక్షించిన ఈమె జులై 5న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను దిశానిర్దేశం చేసే బడ్జెట్​ రూపకల్పనలో కీలక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి.

ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నది నిపుణుల విశ్లేషణ. వృద్ధి క్షీణిస్తుండటం సహా అనేక ఆర్థిక సవాళ్లు ఉన్నాయన్నది వారి మాట. ఇందుకు ఎన్డీఏ 1.0 హయాంలో తీసుకున్న నిర్ణయాలతో పాటు చాలా కారణాలు ఉన్నాయంటున్నారు.

దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. వీటన్నింటికీ నిర్మలా సీతారమన్ బడ్జెట్ ద్వారా సమాధానం ఇవ్వాల్సి ఉంది.

ఆర్థిక మందగమనం...

2019 మొదటి త్రైమాసికంలో వృద్ధి 5.8 శాతానికి పడిపోయింది. 17 సంవత్సరాల్లో ఇదే అత్యల్ప త్రైమాసిక వృద్ధి రేటు. గత త్రైమాసికంలో వృద్ధిరేటు 6.8 శాతంగా ఉండగా.. 2018 మొదటి 3 నెలల్లో 8.1 శాతంగా ఉంది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.8 శాతానికి పడిపోయింది. ఇది గత 5 సంవత్సరాల్లో కనిష్ఠం. వేగంగా వృద్ధి చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని కూడా భారత్ కోల్పోయిందని విశ్లేషకుల అంచనా. వృద్ధి మందగమనం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం కూడా కొనసాగే అవకాశం ఉంది.

వ్యవసాయ సంక్షోభం...

దేశంలో మెజారిటీ ప్రజలకు జీవానాధారమైన వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు నినాదంతో ఎన్నికలకు వెళ్లి.. గెలిచిన భాజపా ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ముందు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది.

భారతీయ జనతా పార్టీ హామీలైన రైతు ఫించన్లు, వ్యవసాయ-గ్రామీణంపై రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులను నెరవేర్చటం కీలక సవాళ్లు.

నిరుద్యోగం...

ఎన్‌ఎస్‌ఓ గణాంకాల ప్రకారం 2018 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ రేటు 6.1 శాతంగా ఉంది. గత 45 ఏళ్లలో ఇదే గరిష్ఠం కావటం గమనార్హం. ఈ విషయంపై ప్రభుత్వ వాదన ఎలా ఉన్నా... నిరుద్యోగం మాత్రం పెరిగిందన్నది నిర్వివాద అంశం. మారుతున్న సాంకేతికతతో మరిన్ని ఉద్యోగాలు ఊడిపోతాయన్న అంచనాల మధ్య ఉద్యోగ కల్పన ప్రభుత్వానికి కీలక సవాలే.

ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు...

ప్రస్తుతం దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019 మార్చి త్రైమాసికంలో భారతీయ కంపెనీలు రూ. 1.99 లక్షల కోట్ల కొత్త ప్రాజెక్టులను ప్రకటించాయి. ఇది అంతక్రితం త్రైమాసికంతో పోల్చితే 16 శాతం ప్రతికూల వృద్ధి కాగా ఏడాది క్రితంతో పోల్చితే 46 శాతం తక్కువ.

వాణిజ్య లోటుతో ఇబ్బంది...

మే నెలలో దిగుమతులు 4.31 శాతం పెరగగా.. ఎగుమతుల్లో 3.93 శాతం వృద్ధి కనబడింది. ఫలితంగా వాణిజ్య లోటు 6 నెలల గరిష్ఠానికి చేరింది. ఉద్యోగ కల్పనతో పాటు దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చటానికి ఎగుమతులు కీలకం. ఈ సమస్యను ఎదుర్కోవటం కష్టమనే నిపుణులు చెబుతున్నారు.

నిరర్థక ఆస్తులు...

ఎన్డీఏ 1.0 హయాంలో నిరర్థక ఆస్తుల(ఎన్‌పీఏ) తగ్గింపు కోసం చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ఈ చర్యల వల్ల మార్చి 2018 వరకు 11.5 శాతంగా ఉన్న ఎన్‌పీఏలు మార్చి 2019 వరకు 9.3 శాతానికి తగ్గాయి. అయినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఇవి ప్రతికూల ప్రభావం చూపుతూనే ఉన్నాయి. రెండోసారి బ్యాంకులకు మూలధనాన్ని అందించటం ప్రస్తుత పరిస్థితుల్లో కొంచెం కష్టమే.

లిక్విడిటీ సంక్షోభం...

కొన్ని నెలల క్రితం ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంతో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో లిక్విడిటీ సమస్య ఏర్పడింది. ఇప్పటికీ ఈ సమస్య కొనసాగుతోంది. అప్పుడు ఉన్నంత తీవ్రత ప్రస్తుతం లేనప్పటికీ ప్రభావం వినియోగంపై పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వినియోగ గిరాకీ పడిపోవటం వల్ల దేశ ఆర్థిక వృద్ధి క్షీణిస్తోందని వారు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details