తెలంగాణ

telangana

ETV Bharat / business

పద్దు 2021: బడ్జెట్​ సూట్​కేస్ చరిత్ర తెలుసా? - పద్దు 2021

నేడు కేంద్రం పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది. ఈ తరుణంలో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. కొవిడ్​ సంక్షోభంలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్​ ఇది. బడ్జెట్​ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది.. ఆర్థిక శాఖ మంత్రి చేతిలోని సూట్​కేసు. ఎన్డీఏ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆ సంప్రదాయానికి స్వస్తి పలికి ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ ప్రతులను తీసుకొచ్చారు ఆర్థిక మంత్రి. మరి ఈసారి ప్రతుల ముద్రణ లేనందునా.. పార్లమెంట్​కు ఏవిధంగా వస్తారు?

Budget 2021
పద్దు 2021: బడ్జెట్​ సూట్​కేస్ చరిత్ర తెలుసా?

By

Published : Feb 1, 2021, 8:22 AM IST

ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సోమవారం బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది. రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్​ ప్రవేశపెట్టే క్రమంలో సూట్​కేసు సంప్రదాయానికి చెక్​ పెట్టి.. ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ ప్రతులను తీసుకొచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ 2020 జూన్​లోనూ ఆదే సంప్రదాయాన్ని కొనసాగించారు. అయితే.. ఈసారి కరోనా నేపథ్యంలో బడ్జెట్​ ప్రతుల ముద్రణ నిలిపేశారు. డిజిటల్​ విధానంలోనే బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో సూట్​కేస్​పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

2020లో ఎర్రటి వస్త్రంలో ప్రతులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​

అయితే.. బడ్జెట్​ ప్రతులు తెచ్చే ఈ సూట్​కేస్​కు ఓ చరిత్ర ఉందని తెలుసా? ఈ సంప్రదాయం ఎలా వచ్చింది? కాలక్రమేణా రంగులు, పరిమాణంలో మార్పుల గురించి విన్నారా? అసలు ఈ బడ్జెట్​కు, లెదర్ సూట్​కేసుకు సంబంధం ఏమిటో తెలుసా..?

ఫ్రెంచ్​ నుంచి వాడుకలోకి..

బడ్జెట్​ను ఫ్రెంచ్​ భాషలో బోగెటి అంటారు. దీని ఇంగ్లీష్​ అర్థమే లెదర్​ బ్యాగ్​. 1860లో బ్రిటన్ మొదటి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్ గ్లాడ్​స్టోన్ మొదట లెదర్ బ్యాగ్​లో పత్రాలు తీసుకొచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలా ఆయనతో మొదలైన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

బ్రిటిష్​ సంప్రదాయాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన వాళ్లూ కొనసాగిస్తూ వచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపే శక్తి ఈ లెదర్​ సూట్​కేసులో ఉంటుంది. అందుకే.. మంత్రి చేతిలో ఉండే ఈ సూట్​కేసును ప్రత్యేకంగా పరిగణిస్తారు. అయితే.. ఆ బ్రీఫ్​కేసును తెచ్చే సంప్రదాయం మారకపోయినా.. దాని రంగులు మాత్రం మారుతూ వచ్చాయి.

ఈ సూట్​కేసులను ఆర్థిక మంత్రిత్వ శాఖనే సేకరిస్తోంది. విభిన్న రంగుల్లోని నాలుగు బ్యాగ్​లను ఆర్థిక మంత్రి ముందు ఉంచుతుంది. వాటిలో నచ్చిన రంగును ఎంచుకోవచ్చు.

నలుపు నుంచి..

భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్​కే శన్ముఖమ్​ చెట్టీ 1947లో లెదర్​ బ్యాగ్​ వినియోగించారు.

1956-58, 1964-66 సమయంలో ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి ఫైల్​ బ్యాగ్​తో పార్లమెంటులో అడుగుపెట్టారు.

1958లో జవహర్​లాల్​ నెహ్రూ నలుపు రంగు బ్రీఫ్​కేసు వాడారు.

1970ల తర్వాతే..

  • ఆర్థిక మంత్రి యశ్వంత్​ సిన్హా.. ఎరుపు రంగుకు దగ్గరగా ఉన్న బడ్జెట్​ బాక్స్​తో వచ్చారు.
  • మన్మోహన్​ సింగ్​.. బ్రిటన్​ తొలి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్​ గ్లాడ్​స్టోన్ వినియోగించిన బ్రీఫ్​కేస్​ను పోలిన నలుపు రంగు బ్యాగ్​ వాడారు.
  • ప్రణబ్​ ముఖర్జీ అందరిలా కాకుండా.. చెర్రీ ఎరుపు రంగు సూట్​కేసులో బడ్జెట్​ పత్రాలు తీసుకొచ్చి ప్రత్యేకంగా నిలిచారు.
  • బ్రిటన్​ మాజీ ప్రధాని గ్లాడ్​స్టోన్​ తరహాలో.. సాదా గోధుమ రంగు, ముదురు గోధుమ రంగు బ్రీఫ్​కేసుల్ని వినియోగించారు చిదంబరం.
  • మోదీ-1 హయాంలో.. ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు స్వీకరించినప్పుడు మొదటి రెండు సంవత్సరాలు గోధుమ రంగు, లేత గోధుమ రంగు బ్యాగ్​లు వాడారు.
  • 2017లో ముదురు గోధుమ రంగు బ్యాగ్​ వాడారు.
  • 2019 ఎన్నికల ముందు ఆర్థిక మంత్రి హోదాలో పీయూష్ గోయల్ ఎరుపు రంగు సూట్​కేసుతో పార్లమెంట్​లోకి అడుగుపెట్టారు.
    2019లో సూట్​కేస్​తో పార్లమెంట్​కు వచ్చిన అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​

ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక జులై 5న బడ్జెట్​ సమయంలో సూట్‌కేసుతో పార్లమెంటుకు వచ్చే సంప్రదాయానికి చెక్ పెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఆర్థిక శాఖ ప్రముఖులతో కలిసి ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ పత్రాలు తీసుకొచ్చారు. 2020లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించారు.

ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ ప్రతులు

ఈ రోజు బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. మళ్లీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఏ రకంగా పార్లమెంటులో అడుగుపెడుతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. బడ్జెట్​ ప్రతులు లేనందున ట్యాబ్​ను ఎర్రటి వస్త్రంలో పెట్టి తీసుకొస్తారా.. లేక పాత పద్దతికి వెళ్లి సూట్​కేస్​ వినియోగిస్తారా? అన్న సందేహాలు మొదలయ్యాయి.

ఇదీ చూడండి:బడ్జెట్​ 2021-22: ఎన్నో ఆశలు.. మరెన్నో సవాళ్లు

బడ్జెట్ 2021: అంకురాల ఆశలు నెరవేరేనా?

ABOUT THE AUTHOR

...view details