దేశ బడ్జెట్ 2021-22కు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. గత బడ్జెట్‌తో పోల్చితే పెద్ద సవాళ్లపై ప్రభుత్వంపై దృష్టి సారించాల్సి ఉంటుందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఫైనాన్స్ కమిషన్ సిఫారసులను బడ్జెట్లో పొందుపరచటం అతిపెద్ద సవాలని బేస్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డా.ఎన్ఆర్ భానుమూర్తి అన్నారు.
ఈ నెల మొదట్లో 15వ ఫైనాన్స్ కమిషన్ 2021-22 నుంచి 2025-26 సంబంధించిన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. ఇందులో రాష్ట్రాలకు పన్ను వాటా, స్థానిక స్వపరిపాలన సంస్థలకు గ్రాంట్లు, విపత్తు నిర్వహణ గ్రాంట్లు తదితరాల అంశాలపై సిఫారసులు చేసింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అనంతరం ఈ నివేదిక ప్రజలకు అందుబాటులోకి రానుంది.
“ఫైనాన్స్ కమిషన్ సిఫారసులే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితిపై వాటి ప్రభావం ఎలా ఉంటుందన్నది విషయం ఇంకా తెలియదు. ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు కావాల్సిన రోడ్ మ్యాప్‌పై కొంచెం దృష్టి సారించే అవకాశం ఉంటుందని భావిస్తున్నా. రాష్ట్రాలకు, స్థానిక స్వపరిపాలన సంస్థలకు పన్నుల్లో వాటా గురించి ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు చేస్తుంది కాబట్టి.. రాష్ట్రాల బడ్జెట్లు కమిషన్ సిఫార్సులు, వాటి అమలుపై ఆధారపడి ఉంటాయి”- భానుమూర్తి, బేస్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్.
5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ
కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించిన అనంతరం మార్చి 25 నుంచి మూడు నెలల పాటు దేశం మొత్తం లాక్ డౌన్లోకి వెళ్లింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఏప్రిల్-జూన్ మధ్య జీడీపీ 23.9 శాతం తగ్గిపోయింది.
ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఇప్పటి వరకు రూ.29.87 లక్షల కోట్ల మేర ఉద్దీపన ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. జీడీపీలో ఈ ఉద్దీపన ప్యాకేజీని పోల్చినట్లైతే కేవలం సింగిల్ డిజిట్ నంబర్ కు పరిమితమైందని, దీనితో మరిన్ని చర్యలకు వెసులుబాటు ఉన్నట్లు భానుమూర్తి అభిప్రాయపడ్డారు.
“నా అంచనా ప్రకారం ఈ సంవత్సరం బడ్జెట్ వచ్చే ఐదు సంవత్సరాలను ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని 2025-26కు పొడిగించే అవకాశం ఉంది. కోవిడ్ రికవరీలో ఉండే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక పరిస్థితులు ఉండనున్న దృష్ట్యా… గత బడ్జెట్ తో పోల్చితే రాబోయే బడ్జెట్ లో సవాళ్లు పెద్దవిగా ఉండనున్నాయి” - భానుమూర్తి.