కరోనా మహమ్మారి సృష్టించిన విలయంతో ప్రజల ఆదాయాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే నెలలో కేంద్రం ప్రవేశపెట్టనున్న 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో పన్ను రాయితీలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని అందరూ ఎదురుచూస్తున్నారు.
ప్రీమియం పెరిగింది.. మినహాయింపు మాటేమిటి?
కొవిడ్-19 తర్వాత ఆరోగ్య బీమా ప్రీమియాలు దాదాపు 10శాతానికిపైగానే పెరిగాయి. అందరూ పెద్దమొత్తం పాలసీలు తీసుకునేందుకే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఆరోగ్య బీమా కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పుడు 60 ఏళ్లలోపు వారికి రూ.25,000, సీనియర్ సిటిజన్లకు రూ.50వేల వరకు ప్రీమియంలో మినహాయింపు లభిస్తోంది. ఈ మినహాయింపును పెంచాలని పాలసీదారులు కోరుకుంటున్నారు. ముందస్తు వైద్య చికిత్సలకోసం రూ.5వేల వరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. పెరిగిన వైద్య పరీక్షల ఖర్చు నేపథ్యంలో దీన్ని రూ.10వేలైనా చేయాలనే సూచనలున్నాయి.
- కొవిడ్-19 చికిత్స కోసం ఖర్చు చేసిన వారికి, ఆ మొత్తాన్ని ఏదైనా ప్రత్యేక సెక్షన్ కింద మినహాయింపు పొందే అవకాశం ఇవ్వాలనేది పన్ను చెల్లింపుదారుల కోరికల్లో ఒకటి.
- గృహ బీమాను ప్రోత్సహించేందుకు ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు చేయాలని బీమా సంస్థలు.. పాలసీదారులూ కొన్నేళ్లుగా కోరుతున్నారు. ఈసారి బడ్జెట్‌లో ఈ అంశంపై ప్రస్తావన ఉండవచ్చనేది నిపుణుల అంచనా.
వడ్డీ పరిమితి పెరుగుతుందా?
ఇప్పుడు చాలామంది గృహరుణం తీసుకుని, సొంతింటి వారయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం వారికి కలిసొచ్చే అంశం. స్థిరాస్తి రంగానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలంటే.. గృహ రుణ వడ్డీపై సెక్షన్ 24(బి) కింద ఇస్తున్న మినహాయింపు పరిమితి రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు పెంచాలనేది కోరిక. గృహరుణ అసలును సెక్షన్ 80సీ నుంచి తప్పించి, మరో సెక్షన్‌లో చేర్చాలని కోరుతున్నారు.
ఇంటి నుంచి పనికి..
కొవిడ్-19తో కార్యాలయాలకు వెళ్లే వారు తగ్గిపోయారు. ఇంటి నుంచి పని చేయడం పెరిగింది. ఉద్యోగులకు ఫర్నీచర్, ఇతర ఖర్చులు పెరిగాయి. కార్యాలయాలకు వెళ్లినప్పుడు లభించే కొన్ని ప్రయోజనాలకూ వారు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో కొవిడ్ పేరుతో ప్రత్యేక ప్రామాణిక తగ్గింపును 2021-22 ఆర్థిక సంవత్సరానికి వర్తించేలా మినహాయింపు అందించాలన్నది పన్ను చెల్లింపుదారుల కోరిక.
జీఎస్‌టీ తగ్గాలి
బీమా పాలసీలు ఇప్పుడు ఆర్థిక ప్రణాళికలో ఎంతో కీలకంగా మారాయి. వీటిని తీసుకునేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. అయితే, ప్రీమియంపై 18 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ఉండటం భారంగా మారింది. దీన్ని కనీసం 12శాతం లేదా అంతకన్నా తక్కువ శ్లాబులోకి చేరిస్తే మేలని గత బడ్జెట్ సమయంలోనూ పలువురు విన్నవించారు. కానీ ఆ ప్రస్తావనే రాలేదు. బీమా పాలసీలు తీసుకుంటున్న వారిని మరింత ప్రోత్సహించేందుకు, ఈసారైనా జీఎస్‌టీని తగ్గించాల్సిన అవసరం ఉంది.