దేశీయ వ్యవసాయ పరిశోధనలు, నూనె గింజల ఉత్పత్తి సహా సేంద్రీయ సేద్యం ప్రోత్సహించేందుకు రానున్న బడ్జెట్లో కేటాయింపులు పెరగాలని నిపుణులు కేంద్రానికి సూచిస్తున్నారు.
'మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇందుకోసం వచ్చే బడ్జెట్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు వడ్డీ మాఫీ, పన్నుల తగ్గింపు, సాంకేతిక అనుసంధానం వంటి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి' అని డీసీఎం శ్రీరామ్ సంస్థ ఛైర్మన్, సీనియర్ ఎండీ అజయ్ శ్రీరామ్ పేర్కొన్నారు.
నగదు ఇవ్వడమే మేలు..
రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఏటా నేరుగా రూ.6 వేలు జమ చేసే పథకం పీఎం-కిసాన్‌ను మరింత విస్తరించాలని ఆయన సూచించారు. రైతులకు రాయితీలు ఇవ్వడం కన్నా.. నేరుగా నగదు బదిలీ చేయడమే ఉపయోగకరమన్నారు.
'వారి ఖతాల్లో జమ అయిన డబ్బును న్యాయంగా ఎలా వినియోగించుకోవాలో రైతులకే వదిలేయాలి. నేరుగా రైతులకు డబ్బులు అందితే వాళ్లు మంచి విత్తనాలను, ఎరువులను కొనగలుగుతారు.' అని అజయ్ శ్రీరామ్ అభిప్రాయపడ్డారు.
పరిశోధనల్లో పెద్దగా పురోగతి లేదు..
అగ్రి-టెక్నాలజీ విభాగంలో చాలా దేశీయ అంకురాలు పెట్టుబడులు పెట్టాయని తెలిపారు శ్రీరామ్. వాటి వృద్ధిని ప్రోత్సహించేందుకు, వ్యవసాయంలో కొత్త సాంకేతికతలను వినియోగించేందుకు ప్రభుత్వం విధానాలు రూపొందించాల్సి అవసరముందన్నారు.
ఇటీవలి కాలంలో వ్యవసాయ పరిశోధనలల్లో పెద్దగా పురోగతి కనిపించలేదన్న శ్రీరామ్.. ప్రభుత్వం వాటిపై దృష్టి సారించాలన్నారు. జన్యు మార్పిడి (జీఎం) పంటలపైనా దృష్టి సారించాల్సిన అవసరముందని వివరించారు.
పశువుల పెంపకంలో సవాళ్లను అధిగమించాలి..
రైతుల ఆదాయాన్ని పెంచడంలో పశువుల పెంపకం కూడా కీలకమైందని కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ పేర్కొంది. ఈ రంగానికి ప్రధాన అవరోధాలైన వ్యాధులు, పశుమరణాలను నివరించేందుకు ప్రభుత్వ చర్యలు అవసరమని తెలిపింది. ఇందుకోసం వ్యాక్సిన్ సరఫరా మాత్రమే కాకుండా.. టీకాల తయారీ, అందుకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వచ్చే బడ్జెట్లో కేటాయింపులు అవసరమని వివరించింది.
సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి..
రైతులను సేంద్రీయ వ్యవసాయం దిశగా ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు ఆర్గానిష్ ఓవర్సిస్ సంస్థ వ్యవస్థాపకుడు చిరాగ్ అరోరా. ఈ విభాగంలో అంకురాలకు ప్రోత్సాహమందించాలని సూచించారు. కోల్డ్ చైన్, స్టోరేజ్ సామర్థ్యాల పెంపునకు బడ్జెట్లో కేటాయింపులు పెరగాలన్నారు.
మానవ వనరులపై దృష్టి సారించాలి..
వ్యవసాయ పరిశోధనలకు మౌలిక సదుపయాలకన్నా.. మానవ వనరుల పెంపుపైనే కేంద్రం ప్రస్తుతం దృష్టి సారించాలని బీఎకేస్ సంస్థ ఛైర్మన్ అజయ్ వీర్ పేర్కొన్నారు. రీసెర్చ్ విభాగంలో 50 శాతానికి పైగా ఖాళీలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని సూచించారు.
ఇదీ చూడండి:'నగదు బదిలీతోనే ఆర్థిక పునరుద్ధరణ సాధ్యం'