కొవిడ్-19 సంక్షోభం మధ్య సోమవారం 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఆర్థికంగా పీకల లోతులో కూరుకుపోయిన పర్యటకం, ఆతిథ్య రంగం.. ఈ బడ్జెట్లో చేయూతను కోరుకుంటోంది. లాక్డౌన్ కాలానికి అనుమతుల రుసుముల మినహాయింపు, హోటళ్లు, రెస్టారెంట్లపై ఇన్పుట్ క్రెడిట్‌తో 10 శాతంగా ఒకే విధమైన జీఎస్టీ రేట్లతో పాటు ఇతర ఉపశమన చర్యలు ప్రకటిస్తారని ఆశిస్తోంది.
భారత పర్యటకం, ఆతిథ్య రంగ సమాఖ్య ప్రధాన కార్యదర్శి, పర్యటక రంగ నిపుణులు సుభాశ్ గోయల్.. బడ్జెట్లో పర్యటక రంగానికి ఇవ్వాల్సిన ఉపశమన చర్యలను 'ఈటీవీ భారత్'తో పంచుకున్నారు.
"ఇప్పటికీ హోటళ్లపై జీఎస్టీ రేటును నిర్ణయించలేదు. దానిపై మేము ఇన్పుట్ క్రెడిట్‌ను పొందలేదు. ఒక స్థిరమైన పద్దును కోరుకుంటున్నాం. హోటళ్ల స్థాయిని బట్టి గతంలో జీఎస్టీ 18 నుంచి 12 శాతం వరకు ఉండేది. అందుకే ఇన్పుట్ క్రెడిట్‌తో కూడిన ఒకే విధంగా 10 శాతం జీఎస్టీ కోరుకుంటున్నాం.
కరోనాతో పర్యటకం రంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 7.5 కోట్ల మంది ఆధారపడి ఉపాధి పొందేవారు. కరోనా దెబ్బకు 3 కోట్లు మంది ఉపాధి కోల్పోయారు. కోటి మంది వరకు జీతాలు లేక సెలవుపై వెళ్లారు. సుమారు 53 వేల మంది ట్రావెల్ ఏజెంట్లు, 1.3 లక్షల మంది టూర్ ఆపరేటర్లు, వేల సంఖ్యలో ట్రాన్స్పోర్టర్లు, టూరిస్ట్ గైడ్లు జీవితాన్ని నెట్టుకొచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు."
- సుభాశ్ గోయల్, పర్యటక రంగ నిపుణులు
ఇతర దేశాలలో మాదిరిగా పర్యటక రంగానికి ప్రత్యేక ప్యాకేజీలు మన ప్రభుత్వం నుంచి అందలేదన్నారు గోయల్. కాబట్టి ఈ బడ్జెట్లో పర్యటకానికి పలు ఉపశమనాలు కల్పిస్తుందనే భరోసాతో ఉన్నట్లు చెప్పారు. దాని ద్వారా పర్యటక రంగం నిలదొక్కుకోవటమే కాకుండా.. లక్షలాది మందికి ఉద్యోగాలు దక్కుతాయని వివరించారు.