తెలంగాణ

telangana

ETV Bharat / business

పద్దు 2020: ఆదాయపు పన్ను రూ.7లక్షల వరకూ 5 శాతమే! - వేతన జీవులకు ఊరట

కేంద్రం బడ్డెట్​ ప్రవేశపెడుతుందంటే వేతన జీవుల నుంచి సంపన్న వర్గాల వరకు ఒకటే ఆశ.. ఈ సారి పన్ను భారం ఏమైనా తగ్గుతుందా అని. అయితే ఈ ఏడాది పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో రిబేటుపై వేతన జీవుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయి?

TAX
పద్దు 2020

By

Published : Jan 23, 2020, 9:27 AM IST

Updated : Feb 18, 2020, 2:09 AM IST

బడ్జెట్‌ అనగానే అందరి దృష్టీ ప్రత్యక్ష పన్నుల విషయంలో ఆర్థిక మంత్రి ప్రతిపాదించే అంశాలపైనే ఉంటుంది. మధ్య తరగతి నుంచి సంపన్న శ్రేణి వరకూ తమపై పన్ను భారం ఏమన్నా తగ్గుతుందా అనేది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఓవైపు ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, చేతిలో మిగులుతున్న మొత్తం తగ్గిపోవడంలాంటివి వేతన జీవులను ఇబ్బంది పెడుతున్నాయి. కొనుగోళ్లపైనా ఈ ప్రభావం పడుతుండటం వల్ల అనేక పరిశ్రమలు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో.. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్‌ పన్ను చెల్లింపుదారులకు తీపి కబురు వినిపిస్తుందా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​

ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పనిలో భాగంగా మధ్యతరగతి వర్గాలకు పన్ను భారం తగ్గించేందుకు, తద్వారా వారి దగ్గర మిగులు మొత్తాన్ని పెంచే చర్యలు చేపడతామని ఆర్థిక మంత్రి గతంలో ప్రకటించారు. కొత్త పన్ను శ్లాబులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? అనేది ఇప్పుడు అందరూ ఆశగా ఎదురుచూస్తోన్న అంశం.

శ్లాబుల్లో సవరణలు?

చాలా ఏళ్లుగా వ్యక్తిగత పన్ను శ్లాబుల్లో సవరణలు ఉండటం లేదు. పరిమితులను పెంచిందీ లేదు. ఏదో కొన్ని రిబేట్లు ప్రకటించడం తప్ప, మినహాయింపులను పెంచలేదు. ఈసారి రిబేట్లలాంటి ప్రత్యామ్నాయాలను కాకుండా.. నేరుగా పన్ను శ్లాబుల్లో మార్పు చేస్తే బాగుంటుందనేది అందరి కోరిక.

ఐదు శ్లాబుల సూత్రం..

ప్రత్యక్ష పన్నుల కోడ్‌ ప్రతిపాదించినట్లుగా చెబుతున్న 5, 10, 20, 30, 35 శాతం శ్లాబులు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 5, 20, 30శాతం శ్లాబులు ఉన్నాయి. ఆదాయాన్ని ఐదు శ్లాబులుగా విభజిస్తే.. ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుందనేది ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అంశం.

చాలామంది ఎదురుచూస్తున్నట్లుగా.. ఆదాయ పరిమితిని రూ.5లక్షలకు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకూ... ఇది రూ.2,50,000లుగా ఉంది. రూ.2,50,000-రూ.5,00,000 వరకూ 5శాతం పన్ను విధిస్తున్నారు. పన్ను వర్తించే ఆదాయం రూ.5,00,000లోపు ఉన్నప్పుడు రూ.12,500 ప్రత్యేక రిబేటు లభిస్తోంది. దీనివల్ల కొందరికి లాభం చేకూరుతున్నప్పటికీ.. ఆదాయ పరిమితిని రూ.5,00,000లకు పెంచితే.. ఎంతోమందికి పన్ను భారం తగ్గుతుంది. అయితే, ఆదాయపు పన్ను పరిమితి పెంచకుండా.. వర్తించే శ్లాబును సవరించినా.. మేలు చేసినట్లే..
ఆర్థికమంత్రి గతంలో చెప్పిన అంశాల ఆధారంగా ఇప్పటికే పన్ను వర్తించే విషయంలో కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. అవి ఎలా ఉన్నాయంటే..

పరిమితి పెంచండి..

  • ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000 వరకూ మినహాయింపు వర్తిస్తోంది. ఈ పరిమితిని కొన్నేళ్లుగా పెంచాలనే డిమాండు ఉన్నప్పటికీ.. ప్రతిపాదనలు మాత్రం రావడం లేదు. పెట్టుబడులను ప్రోత్సహించాలంటే ఈ మొత్తం పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిమితిని రూ.2,50,000 వరకూ పెంచితే బాగుంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా మరికొన్ని ప్రతిపాదనలూ ఉన్నాయి. జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియాన్ని ప్రత్యేకంగా పరిగణించినా మంచిదే. ఈ రెండింటిలో ఏది ప్రతిపాదిస్తారన్నది ఇప్పుడు అందరి ఎదురుచూపు..
  • ఇంటి రుణం కోసం చెల్లించే వడ్డీకి సెక్షన్‌ 24 ప్రకారం రూ.2లక్షల వరకూ మినహాయింపు ఉంది. ఇళ్ల ధరలు పెరిగి, రుణం ఎక్కువగా చెల్లిస్తున్న నేపథ్యంలో దీన్ని కనీసం రూ.3లక్షలకు పెంచాలని ప్రతిపాదిస్తే.. ఇల్లు కొనేవారికి ఉపయోగం. స్థిరాస్తి రంగాన్నీ ఆదుకున్నట్లు అవుతుంది.
  • వైద్య ఖర్చులను తట్టుకోవడానికి ఆరోగ్య బీమా ప్రీమియం తీసుకోవడం ఇప్పుడు తప్పనిసరి అయ్యింది. పైగా వీటి ప్రీమియాలూ ఇటీవల కాలంలో కాస్త పెరిగాయి. తక్కువ మొత్తంతో పాలసీ తీసుకున్నా ఉపయోగం లేకుండా పోతోంది. సెక్షన్‌ 80డీ ప్రకారం ఇప్పుడిస్తున్న మినహాయింపు రూ.25,000 ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ పరిమితిని కనీసం రూ.35,000 చేస్తేనే మేలు జరుగుతుంది.
    అంచనాలు..

ఆ పన్ను సంగతేమిటీ?

ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించి ఆర్జించినప్పుడు ఆ పై మొత్తానికి 10శాతం పన్ను చెల్లించాలి. ఇది చాలామంది మదుపరులకు ఇబ్బందిగా మారింది. ఈ పరిమితిని రూ.2లక్షలు చేయాలని అటు మదుపరులు, ఇటు పరిశ్రమవర్గాలూ కోరుతున్నాయి. దేశీయ ఈక్విటీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఈ చర్య ఎంతో అవసరం.

డెట్‌ ఫండ్లతో.. పన్ను ఆదా..

బ్యాంకులో ఐదేళ్ల పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉంటాయి. ఇదే తరహాలో ‘డెట్‌ లింక్డ్‌ సేవింగ్‌ స్కీం’ ప్రతిపాదించాలని భారతీయ మ్యూచువల్‌ ఫండ్ల సంఘం (యాంఫీ) ప్రతిపాదిస్తోంది. దీనివల్ల డెట్‌ పథకాల్లోకి పెట్టుబడులు పెరుగుతాయని పేర్కొంటోంది. చిన్న మదుపరులకూ పన్ను ఆదా కోసం అధిక ఆదాయానికి ఇది ఉపకరించవచ్చు. దీంతోపాటు గతంలో ఉన్న దీర్ఘకాలిక మౌలిక వసతుల బాండ్లనూ తిరిగి ప్రవేశపెడితే.. ప్రభుత్వం ఖర్చు పెట్టేందుకు తద్వారా మౌలిక రంగం వృద్ధికీ తోడ్పడుతుంది.

ఇదీ చూడండి:పద్దు​ 2020: వేతన జీవులకు ఊరట లభించేనా?

Last Updated : Feb 18, 2020, 2:09 AM IST

ABOUT THE AUTHOR

...view details