తెలంగాణ

telangana

ETV Bharat / business

పద్దు 2020: అష్టకష్టాలకు... విన్నపాలు - వ్యాపార వార్తలు

ఆర్థిక మందగమనం ప్రభావంతో 2019లో జీఎస్టీ వసూళ్లు బాగా తగ్గాయి. కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాల కన్నా తక్కువగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీఎస్టీ వసూళ్లు వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లు పెంచేందుకు రానున్న బడ్జెట్​లో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారనే అంశమై ఓ కథనం.

gst
జీఎస్టీ

By

Published : Jan 28, 2020, 8:14 AM IST

Updated : Feb 28, 2020, 5:51 AM IST

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఇటీవల బాగా తగ్గాయి. ఈ నేపథ్యంలో వాటిని పెంచుకునేందుకే బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఇదే జరిగితే.. జీఎస్టీ తగ్గించాలంటూ పలు రంగాలు పెట్టుకున్న వినతులు.. అలానే మిగిలిపోవచ్చు. కానీ మనిషి ఆశాజీవి కనుక, బడ్జెట్లో కచ్చితంగా తమకు ఊరట కలిగించే నిర్ణయాలుంటాయని సామాన్యులు, వ్యాపారులు ఆశిస్తున్నారు. ఈసారి బడ్జెట్‌లో జీఎస్టీపై ఎలాంటి ప్రతిపాదనలు ఉంటే బాగుంటుందో చూద్దాం..

1.జీఎస్టీఎన్‌కు నిధులు

జీఎస్టీ నెట్‌వర్క్‌ (జీఎస్టీఎన్‌)లో సాంకేతిక సమస్యలతో అప్పుడప్పుడు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెట్‌వర్క్‌ సాఫీగా పనిచేసేలా సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి.

2. పెట్రోలియం ఉత్పత్తులు

జీఎస్టీ అమల్లోకి తెచ్చిన అనంతరం ఐదేళ్లలోగా పెట్రోలియం ఉత్పత్తులను కూడా ఈ చట్ట పరిధికి తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచినందున.. ఆ దిశగా అడుగులు వేసేలా బడ్జెట్లో ఏదేని ప్రతిపాదన చేయాలి.

3.స్టాంపు డ్యూటీ

స్టాంపు డ్యూటీని సాధ్యమైనంత త్వరగా జీఎస్టీ విధానంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం స్థిరాస్తి రంగం పలు రకాల పన్నుల భారాన్ని మోస్తోంది. ఈ భారం తగ్గితే సామాన్యుడికి గృహాలు అందుబాటు ధరలకు లభిస్తాయి.

4.రిటర్న్‌ల సరళీకరణ

జీఎస్టీ రిటర్న్‌లు దాఖలు క్లిష్టంగా ఉంది. ఆర్‌ఓసీ, ఆదాయపు పన్ను, పీఎఫ్‌ రిటర్న్‌ల దాఖలుతో పోలిస్తే జీఎస్టీ రిటర్న్‌ల దాఖలుకు అధిక సమయం, శక్తి వెచ్చించాల్సి వస్తోంది. రిటర్న్‌ల ప్రక్రియ సులువుగా ఉండే చర్యలను బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించాలి.

5.మళ్లీ రివర్స్‌ఛార్జీ

జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ లేని వాళ్ల నుంచి కొనుగోళ్లు చేస్తే రివర్స్‌ ఛార్జీ వర్తింప చేసే విధానాన్ని ప్రభుత్వం తొలగించింది. రివర్స్‌ ఛార్జీ జీఎస్టీ ఆదాయానికి వెన్నెముక లాంటిది. పన్ను ఎగవేతలనూ అరికడుతుంది. ఈ విధానాన్ని మళ్లీ తేవాలి.

6.పన్ను చెల్లింపుదార్లు

పన్ను వసూళ్లను పెంచుకునేందుకు పన్ను పరిధిలోకి ఎక్కువ మందిని తీసుకుని రావడంపై దృష్టి సారించాలి. వ్యాపారులు జీఎస్టీ లైసెన్సు తీసుకునేలా క్షేత్ర స్థాయి అధికారులను పంపించడం, ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించడం లాంటివి ప్రతిపాదించాలి.

7.జరిమానాలు వద్దు

నిర్లక్ష్యం కావచ్చు.. లేదంటే కంప్యూటర్‌పై అవగాహన లేకపోవడం కావచ్చు.. చిన్న, మధ్య తరహా వ్యాపారుల్లో చాలా మంది నెలవారీ రిటర్న్‌లు దాఖలు చేయలేదు. వీళ్లకు ఎటువంటి జరిమానా పడకుండా ఏదేని ఓ పథకాన్ని ప్రకటిస్తే బాగుంటుంది.

జీఎస్టీ అమల్లోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా సామాన్యులు, వ్యాపారులకు అష్టకష్టాలు తప్పడం లేదు. పైన పేర్కొన్న అష్ట విన్నపాల్లో కొన్నైనా కార్యరూపం దాలిస్తే.. ఈ కష్టాలు ఎంతోకొంత దూరమవుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వీటిని పరిగణనలోకి తీసుకుంటారని, అధికులకు ఊరట కలిగించేలా నిర్ణయాలు ప్రతిపాదిస్తారని ఆశిద్దాం.

ఇదీ చూడండి:ఫర్నీచర్​ కొనడం ఇక ఖరీదైన వ్యవహారమే!

Last Updated : Feb 28, 2020, 5:51 AM IST

ABOUT THE AUTHOR

...view details