భారత్‌లో కొన్ని రోజుల నుంచి 'బాయ్‌కాట్ చైనా' నినాదం ఎక్కువగా వినిపిస్తోంది. తూర్పు లద్దాక్‌లోని గల్వాన్ లోయలో చైనా దళాలు భారత్‌లోకి చొచ్చుకొచ్చి.. 20 మంది సైనికులను బలిగొన్న తర్వాత దీనికి మద్దతు మరింత పెరిగింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం కన్నా చైనాను ఆర్థికంగా దెబ్బతీయడమే ఉత్తమమని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ప్రత్యక్ష యుద్ధం, అణు దాడులు వంటివి కాకుండా సైనికేతర దాడులతోనే చైనాకు బుద్ది చెప్పే మార్గాలు ఎంచుకోవాలి అని అంటున్నారు.
ఆర్థికంగా దెబ్బతీయడం సాధ్యమేనా?
'బాయ్‌కాట్ చైనా' వినేందుకు బాగానే ఉన్నా.. అది అంత సులువు కాదంటున్నారు వాణిజ్య నిపుణులు. ఎందుకంటే భారత్‌లో చాలా రంగాలు చైనా దిగుమతులపై ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా ఫార్మా, హెవీ ఇంజినీరింగ్, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాలకు చైనా దిగుమతులు ఎంతో కీలకం.
ఎగుమతుల్లో భారత్, చైనా స్థానాలు..
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సర్వే ప్రకారం.. ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుల్లో చైనా ప్రధానమైంది. ప్రపంచవ్యాప్త ఎగుమతుల్లో 13 శాతం, దిగుమతుల్లో 11 శాతం వాటాను కలిగి ఉంది చైనా. ప్రపంచ వాణిజ్యంలో చైనా వాటా 13.3 శాతంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికా వాటా 8 శాతంగా ఉండగా.. భారత్ 1.7 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంది.
భారత్-చైనా ద్వైపాక్షిక వాణిజ్యం..
ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరిశీలిస్తే చైనాకే దేశానికే ఎక్కువ అనుకూలతలు ఉన్నట్లు తెలుస్తోంది.
2018-19 గణాంకాల ప్రకారం చైనా-భారత్ మధ్య 87 బిలియన్ డాలర్ల ఎగుమతి, దిగుమతులు జరిగాయి. ఇందులో చైనా నుంచి మన దేశం చెసుకున్న దిగుమతుల విలువ 70.3 బిలియన్ డాలర్లుగా ఉంది. మన దేశం నుంచి చైనాకు చేసిన ఎగుమతుల విలువ 16.75 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిసింది. దీని ప్రకారం భారత్‌కు 53.55 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడింది.
వాణిజ్య లోటుతో నష్టాలేమిటి?
ఏదైనా దేశంతో వాణిజ్య లోటు ఏర్పడింది అంటే.. దిగుమతుల కన్నా ఎగుమతులు తక్కువగా ఉన్నాయని అర్థం. దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి అంటే.. వాటిని కొనుగోలు చేసేందుకు మన దేశం డాలర్లలో లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. దీని వల్ల మన దేశంలో విదేశీ మారకపు నిల్వలు తగ్గిపోతాయి.
మన ఎగుమతులు ముడి సరుకే..
భారత్ నుంచి చైనాకు ఎగుమతయ్యే వాటిలో ముడి సరుకే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉక్కు, ఇతర ముడి పదార్థాలను చైనాకు ఎగుమతి చేస్తోంది మన దేశం.
చైనా మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వినియోగదారులకు నేరుగా విక్రయించే వస్తువులైన.. ఇంజినీరింగ్ పరికరాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఐటీ ఉత్పత్తులు వంటివి ఎగుమతి చేస్తోంది. ఔషధాల తయారీకి కావాల్సిన కీలకమైన ముడి రసాయానాలను కూడా చైనా భారత్‌కు ఎగుమతి చేస్తోంది.
భారత్-చైనా వాణిజ్య సామర్థ్యాలు..
భారత్ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న ఎగుమతుల్లో చైనా వాటా 3 శాతం మాత్రమే. చైనా ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్న దిగుమతుల్లో భారత్ వాటా 1 శాతం మాత్రమే. దీని ఆధారంగా చైనాకు ఎగుమతులు పూర్తిగా నిలిపేసినా.. ఆ దేశానికి ఒక శాతం దిగుమతులపై మాత్రమే ప్రభావం పడుతుంది. ఈ లోటును భర్తీ చేసుకోవడం చైనాకు పెద్ద సమస్య కాదంటున్నారు నిపుణులు.
ఇదే సమయంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్న దిగుమతుల్లో చైనా వాటా 14 శాతంగా ఉంది. ప్రపంచ దేశాలకు చైనా చేస్తున్న ఎగుమతుల్లో భారత్ వాటా 5 శాతంగా ఉంది. ఒకవేళ ఇరు దేశాలు దైపాక్షిక వాణిజ్యం ఆపేస్తే.. చైనా ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే అంతకంటే ఎక్కువగా భారత దిగుమతులపై ప్రభావం పడుతుంది. ఆ లోటును భర్తీ చేసుకోవడం భారత్‌కు ఇప్పుడు అంత సులువు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.