అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ వచ్చే ఏడాది నుంచి పాలన సాగించనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానంలో బైడెన్ అగ్రరాజ్య పీఠమెక్కుతున్న నేపథ్యంలో చాలా దేశాలు వాణిజ్య పరంగా భారీ మార్పులు రావచ్చని అంచనాలు వేసుకుంటున్నాయి. మరి భారత్ విషయంలో ఈ అంచనాలు ఎలా ఉన్నాయి? బైడెన్ అధికారంలోకి వస్తే భారత్-అమెరికా వాణిజ్య బంధాలు మెరుగవుతాయా? అనే అంశంపై నిపుణుల విశ్లేషణలు ఇలా ఉన్నాయి.
బైడెన్ అధ్యక్ష పదవిలోకి వచ్చినా.. అమెరికాతో వాణిజ్యం విషయంలో భారత్ పెద్ద మార్పులను ఆశించడలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) భారత మాజీ అంబాసిడర్ జయంత్ దాస్ గుప్తా ఈ అంశంపై 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు.
'డెమొక్రాట్లు, రిపబ్లికన్లు రెండు పార్టీల అధ్యక్షుల పాలనల్లోనూ భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు బలహీన పడుతూ వచ్చాయి. ఇప్పుడు బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టాక భారత్‌తో వాణిజ్యం విషయంలో అమెరికా వైఖరిలో పెద్ద మార్పు ఉంటుందని అనుకోవడం లేదు' అని జయంత్ అభిప్రాయపడ్డారు.
ఇరు దేశాల వాణిజ్యం ఇలా..
భారత్-అమెరికాల ద్వైపాక్షిక వాణిజ్యం 2000 సంవత్సరంలో 19 బిలియన్ డాలర్లుగా ఉంటే.. 2018 నాటికి అది 142 బిలియన్ డాలర్లకు పెరిగింది. అది ఈ ఏడాది 150 బిలియన్ డాలర్లు దాటుతుందని అంచనా. ఏదేమైనప్పటికీ.. ఇరు దేశాధినేతలు జాతీయ ఆర్థిక విధానాలను పాటింస్తుండటం వల్ల కొన్నాళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
ప్రతీకార చర్యలు..
కొన్నాళ్లుగా ఇరు దేశాల మధ్య పలు వాణిజ్య అంశాల్లో విబేధాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సార్లు అమెరికా బహిరంగంగానే భారత్‌పై కోపాన్ని వ్యక్తం చేసింది. సుంకాల పెంపు, మేధో సంపత్తి హక్కులు వంటి పరిణామాలే ఇందుకు ఉదాహరణ.