తెలంగాణ

telangana

ETV Bharat / business

రిటైర్మెంట్​ కోసం పొదుపు... ఇప్పటి నుంచే మేలు - బిజినెస్ వార్తలు తెలుగు

ఉద్యోగం ఉన్నప్పుడు సరైన ఆర్థిక ప్రణాళిక పాటించక.. చాలా మంది పదవీ విరమణ తర్వాత అర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొంత మంది పదవీ విరమణ వయస్సు సమీపిస్తున్న సమయంలో భవిష్యత్ ఆర్థిక అవసరాల గురించి ఆలోచిస్తుంటారు. అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు.. రిటైర్​మెంట్​కు కనీసం పదేళ్ల ముందు నుంచి సరైన పొదుపు ప్రాణాళిక పాటిస్తే.. భవిష్యత్ ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. ఇందుకోసం ఉన్న మార్గాలేంటో ఇప్పుడే తెలుసుకోండి.

రిటైర్​మెంట్ ప్రణాళిక

By

Published : Nov 17, 2019, 1:26 PM IST

భవిష్యత్​ అవసరాలకు ఆర్థిక ప్రణాళిక అనేది ఎంతో ముఖ్యమైన అంశం. కొత్తగా ఉద్యోగంలోకి చేరితే.. తొలినాళ్ల నుంచే సరైన ప్రణాళికతో ముందుకు సాగటం ఉత్తమం. ఫలితంగా భవిష్యత్​లో ఎదురయ్యే ఆర్థిక సమస్యలను సులభంగా ఎదుర్కోవచ్చు. అలా కాకుండా.. మునుముందు చూద్దాంలే.. అనుకుంటూ చాలా మంది ప్రణాళికను పాటించారు. అలా అనుకుని పదవీ విరమణ వయస్సు దగ్గరపడుతున్నప్పుడు భవిష్యత్ ఆర్థిక ప్రణాళిక గురించి ఆలోచిస్తుంటారు. పదవీ విరమణకు పదేళ్లు ఉన్నప్పటి నుంచి సరైన ప్రణాళికను అనుసరిస్తే.. భవిష్యత్​ ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.

యాభై ఏళ్ల వయసు వచ్చిందంటే.. ఉద్యోగ విరమణ సమయం దగ్గర పడుతుందని అర్థం. క్రమం తప్పకుండా నెలనెలా వచ్చే ఆదాయం ఆగిపోయి, ఖర్చులు మాత్రమే ఉంటే.. ఎంత ఇబ్బంది? కాబట్టి, పదేళ్ల తర్వాత ఆర్థికంగా కష్టం రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 60 ఏళ్ల తర్వాత మీకు కావాల్సినంత భరోసా ఉందా లేదా అనేదీ చూసుకోవాలి.

ఎక్కువ కాలం జీవిస్తామనుకోవడమే మేలు..

పదవీ విరమణ ప్రణాళిక వేసుకునేప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది మనం ఎంత కాలం జీవిస్తాం అనేది.. వీలైనంత వరకూ ఎక్కువ కాలమే వేసుకోవాలి. మన (జీవిత భాగస్వామితో సహా కలిపి) తర్వాత మిగిలిన ఆస్తులు, డబ్బు అంతా పిల్లలకు చెందుతుంది. ఆ! 60 ఏళ్ల తర్వాత మహాఅయితే మరో పదేళ్లు బతుకుతామేమో అని చాలామంది అనుకుంటారు. ఇది పొరపాటు. కనీసం మరో 25-30 ఏళ్లు జీవిస్తామనే ఆశ ఇక్కడ ఉండాలి. తక్కువ కాలానికి ప్రణాళిక వేసుకుంటే.. భవిష్యత్తులో ఆర్థికంగా చిక్కులు రావచ్చు. పిల్లల కోసం ఆస్తులు ఇచ్చేమాట పక్కన పెడితే.. నిత్యం ఎదురయ్యే ఖర్చులకూ ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. లేదా పదవీ విరమణ తర్వాతా కష్టపడాల్సిన అవసరం రావచ్చు. ఈ రెండూ సమస్యలే. కాబట్టి, విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు ఎంత మొత్తం అవసరమో పక్కాగా లెక్కలు వేసుకోవాలి.

భవిష్యత్ అవసరాలకు ముందస్తు అంచనా..

పదవీ విరమణ తర్వాత అవసరాల కోసం ఎంత మొత్తం కావాలనేది తెలుసుకునేందుకు సరైన లెక్క అవసరం. ఇప్పుడు ఎంత ఖర్చవుతుంది? ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. భవిష్యత్తులో ఎంత అవసరం అనేదీ ఇక్కడ ముఖ్యం. ఉదాహరణకు మీ వయసు 60 ఏళ్లు వచ్చేనాటికి నెలకు రూ.50,000ల ఖర్చు అవుతుందనుకుందాం. మరో పదేళ్ల తర్వాత అంటే.. 70 ఏళ్లు వచ్చేటప్పటికి నెలకు అయ్యే ఖర్చు రూ.89,542. అదే 80 ఏళ్ల వయసునాటికి నెలకు రూ.1,60,352 అవుతుంది. ఇదంతా ఏడాదికి 6 శాతం ద్రవ్యోల్బణం లెక్కతో.. ఇది పెరిగితే.. ఈ లెక్కా మారుతుంది.

వీలైనంత పొదుపు చేయండి

చాలామంది తమ 60 ఏళ్ల వయసు తర్వాత ఏమిటి అనేది ఆలోచించరు. తీరా పదవీ విరమణ దగ్గరకు వస్తుంటే.. చిన్న ఆందోళన మొదలవుతుంది. ఇప్పటికీ ఆలస్యం కాలేదనుకుని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మీ జీవనశైలి ఖర్చులను తగ్గించుకొని, వీలైనంత వరకూ పొదుపు చేయాలి. మరీ భయపడుతూ మదుపు చేయకూడదు. ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి వచ్చే పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి. పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. అదే సమయంలో అవసరానికి డబ్బును వెనక్కి తీసుకునే వీలుండేలా ప్రణాళికను రూపొందించుకోవాలి. పదవీ విరమణ అంటే.. మారథాన్‌ పరుగు పందెం లాంటిది. మొదట నుంచీ జాగ్రత్తగా, ఓ ప్రణాళికతో పరుగు ప్రారంభించిన వారే పోటీలో విజేతగా నిలుస్తారు. వెనకబడిన వారూ.. సరైన సమయంలో కాస్త కష్టపడితే.. మరీ చివరి స్థానం కాకుండా కాస్త మెరుగైన స్థానంలో నిలుస్తారు. 50 ఏళ్లలో వేసుకునే ఆర్థిక ప్రణాళికా ఈ కోవలోకే వస్తుంది.

ఆ నిధిని ఖర్చు చేయొద్దు..

50 ఏళ్ల వయసులో బాధ్యతల బరువు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లల ఉన్నత చదువులు, వారి వివాహంలాంటివి ఉంటాయి. ఈ రెండు అవసరాలకూ ఖర్చు చేసే ముందు మీ పదవీ విరమణ నిధిని సిద్ధం చేసుకోవడం మర్చిపోవద్దు. పిల్లల చదువుల కోసం అవసరమైతే.. విద్యా రుణం తీసుకోండి. చదువు పూర్తయి, ఉద్యోగంలో చేరిన తర్వాత వారే ఆ రుణాన్ని తీర్చేస్తారు. వివాహం కోసం మీ తాహతుకు మించి ఖర్చు చేయొద్దు. భావోద్వేగ ఖర్చులకు దూరంగా ఉండండి. 50 ఏళ్లు దాటాక చేసే ప్రతి ఖర్చు విషయంలోనూ ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వీలైనంత వరకూ కొత్త అప్పులకు దూరంగా ఉండటమే మేలు.

ఆరోగ్యం జాగ్రత్త..

ఉద్యోగంలో ఉన్నన్ని రోజులు.. యాజమాన్యం అందించే బృంద ఆరోగ్య బీమా తోడుగా ఉంటుంది. ఉద్యోగం నుంచి విరమణ తీసుకున్న తర్వాత ఈ బీమా అండగా ఉండదు. కాబట్టి, ఈ సమయంలో వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ కచ్చితంగా అవసరం. కాబట్టి, ముందు జాగ్రత్తగా వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీని తీసుకోండి. మీ జీవిత భాగస్వామి పేరూ ఇందులో జత చేయండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవడం సులువు అవుతుంది. మున్ముందు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. పాలసీ దొరకడం అంత తేలికకాదు. పైగా ప్రీమియం భారం అవుతుంది. ఒకవేళ మీ యాజమాన్యం ఉద్యోగ విరమణ తర్వాతా ఆరోగ్య బీమా రక్షణ కల్పిస్తుంటే అది మీ అవసరాలకు సరిపోతుందా? లేదా? అనేది ఒకసారి తనిఖీ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే.. టాపప్‌ లేదా సూపర్‌ టాపప్‌ ఆరోగ్య బీమా తీసుకోండి.

వీలునామా సిద్ధం చేయండి..

మన దేశంలో చాలామంది తమ తర్వాత ఆస్తులు ఎవరికి చెందాలనే విషయాన్ని రాసి పెట్టాలనే విషయాన్ని ఆలోచించరు. ఆస్తులు సంపాదించడం ఎంత ముఖ్యమో.. అవి ఆ వ్యక్తి తదనంతరం వారసులకు ఏ ఇబ్బంది లేకుండా బదిలీ కావడమూ అంతే ప్రధానం. పెట్టుబడులకు నామినీ పేరు రాస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ, వాస్తవం వేరు. పెట్టుబడి పెట్టిన వ్యక్తి మరణిస్తే.. అతని చట్టబద్ధమైన వారసులకే ఆ పెట్టుబడుల మొత్తం చెందుతుంది. నామినీ ఈ విషయంలో ఆ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు సహాయం మాత్రమే చేయగలరు. ఆ డబ్బును వారసులకు అందించాల్సిన బాధ్యత తనపైన ఉంటుంది. వీలునామా రాయడం వల్ల ఆ డబ్బులో ఎంత మొత్తం ఎవరికి చెందాలి? అనేది చెప్పొచ్చు. సాధ్యమైతే.. ఆ వీలునామాను రిజిస్ట్రేషన్‌ చేయిస్తే ఇంకా మేలు.

ఇదీ చూడండి: వాట్సాప్​లో కొత్త ఫీచర్ల సందడి.. అవేంటో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details