తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా కాలంలో క్రెడిట్​ కార్డు వాడండిలా..

కరోనాతో ఆదాయం తగ్గినా.. క్రెడిట్​ కార్డు ఉందిగా అని చాలా మంది ధీమాగా ఉన్నారు. ఇది మంచికే అయినా ప్రస్తుత పరిస్థితుల్లో క్రెడిట్ కార్డును విచ్చలవిడిగా వాడితే భవిష్యత్​లో ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందుకే లాక్​డౌన్​లో అప్పుల భారం ఎక్కువగా లేకుండా క్రెడిట్ కార్డును ఎలా వాడాలి? అనే విషయాలు మీ కోసం.

credit card tips_
కరోనా కాలంలో క్రెడిట్​ కార్డు వాడండిలా..

By

Published : Jul 2, 2020, 11:27 AM IST

డబ్పులు లేకున్నా మనకు కావాల్సిన కొనుగోళ్లు జరిపేందుకు క్రెడిట్​ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ప్రస్తుతం కరోనా సంక్షోభం నడుస్తోంది. ఇలాంటి సమయాల్లో క్రెడిట్​ కార్డులను సరైన పద్ధతిలో వినియోగించకుంటే మాత్రం అప్పులు ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా క్రెడిట్​ కార్డు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం.

ఈఎంఐకి మార్చుకునే ఉచ్చులో పడొద్దు..

మీరు క్రెడిట్​ కార్డు ద్వారా ఏదైనా భారీ కొనుగోలు జరిపితే.. వెంటనే మీకు బ్యాంకుల నుంచి ఫోన్లు వస్తుంటాయి. ఒకేసారి మొత్తం చెల్లించడం కన్నా ఈఎంఐలలో చెల్లించండి అంటూ ఆఫర్లు ఇస్తుంటాయి. ఇలా మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని ఈఎంఐకి మార్చుకుంటే జేబుకు చిల్లుపడినట్లే.

ఎందుకంటే క్రెడిట్​ బిల్లును ఈఎంఐకి మార్చుకోవడం వల్ల ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ పేరుతో మీ నుంచి అధిక సొమ్ము వసూలు చేస్తాయి బ్యాంకులు.

వీటితో పాటు మీరు మళ్లీ ఏమైనా కొనుగోలు చేయాలంటే ఈఎంఐల కారణంగా.. మీ కార్డులో లిమిట్​తక్కువగా ఉంటుంది.

ప్రతినెలా బిల్లు సరిచూసుకోవడం మర్చిపోవద్దు..

ఇది క్రెడిట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కచ్చితంగా చేయాల్సిన పని.

ఎప్పుడైనా మీ బిల్లులో బీమా ప్రీమియం, హిడెన్​ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు ఏవైనా ఉన్నాయా అని సరిచూసుకోవాలి.

ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే సంబంధిత బ్యాంకుకు ఫోన్ చేసి విషయం చెప్పాలి. మీ అనుమతి లేకుండా ఎలాంటి చెల్లింపు చేయొద్దని సూచించాలి. అదనపు ఛార్జీలు ఏవైనా ఉంటే వాటి గురించి ఆరా తీయాలి.

ఇప్పడు కొని తర్వాత చెల్లిస్తాం కదా! అనే ధోరణి వీడండి..

క్రెడిట్​ కార్డు ఉంది కదా అని అవసరమున్నా లేకున్నా కొనుగోళ్లు చేయడం సరైన పద్ధతి కాదు. ఇప్పుడు కొంటే తర్వాత బిల్లు కట్టాలి.. అనే ఆఫర్ చాలా మందిని అనవసర కొనుగోళ్లకు ప్రేరేపిస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎప్పుడైనా వాటిని మీ జేబు నుంచే చెల్లించాలి.

మరీ ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయింది. దీని వల్ల ఎక్కువ క్రెడిట్​ కార్డు బిల్లు పెట్టుకోవడం సమస్యగా మారొచ్చు. అందుకే ఏది అవసరమో అది మాత్రమే కొనడం ఉత్తమం.

మారటోరియంతో ఉపయోగముందా?

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్​డౌన్​తో చాలా మందికి ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో రుణాల భారం నుంచి ఉపశమనం కల్పించే ఉద్దేశంతో ఆరు నెలల వరకు మారటోరియం విధించింది ఆర్​బీఐ. అయితే మారటోరియం ఎంచుకోవడం వల్ల క్రెడిట్ స్కోరుపై ఎలాంటి ప్రభావం లేనప్పటికీ.. ఎంచుకున్న కాలానికి వడ్డీ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.

మారటోరియం ఎంచుకుని ఏదైనా కొనుగోలు జరిపితే.. మొదటి రోజు నుంచే వడ్డీ వేయడం ప్రారంభిస్తాయి బ్యాంకులు. అందుకోసం క్రెడిట్​ కార్డు బిల్లులు చెల్లించి (మీరు చెల్లించే స్థితిలో ఉంటే) అదనపు భారం నుంచి తప్పించుకోవడమే ఉత్తమమైన ఎంపిక.

క్రెడిట్ కార్డు జాగ్రత్తగా ఉంచుకోండి..

క్రెడిట్ కార్డును జాగ్రత్తగా ఉంచుకోవడం ఎప్పుడైనా చాలా ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో అది మరీ ఎక్కువ అవసరమనే చెప్పాలి. మీ క్రెడిట్​ కార్డును ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్చుకోవడం అంత సులువైన పని కాదు. ఎందుకంటే బ్యాంకులు తక్కువ సిబ్బందితో పని చేస్తున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా బ్యాంకు చుట్టూ తిరగటం కూడా అంత మంచిది కాదు.

రివార్డ్ పాయింట్లు వాడుకోండి..

క్రెడిట్ కార్డు వాడే విధానం ఆధారంగా బ్యాంకులు మీకు రివార్డ్​ పాయింట్లు కేటాయిస్తుంటాయి. వీటిని మీరు కూపన్లలోకి మార్చుకుని షాపింగ్​లో వాడుకునే వీలుంది. ఈ రివార్డ్ పాయింట్లతో మీరు నిత్యవసరాలు కూడా కొనుగోలు చేయొచ్చు.

పైన చెప్పిన అన్ని విషయాలు పాటిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని మీరే సమీక్షించుకోండి. కాని ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి.. ఇప్పుడు పాటించే తప్పుడు ఆర్థిక అలవాట్లతో భవిష్యత్​లో ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందుకే సరైన ప్రణాళికతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడం మంచిది.

(రచయిత:విరాల్ భట్, పర్సనల్ ఫినాన్స్ నిపుణులు)

  • గమనిక:ఈ కథనంలోని అంశాలన్నీ రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. వీటితో ఈటీవీ భారత్​కు, సంస్థ యాజమాన్యానికి సంబంధం లేదు.
  • పర్సనల్​ ఫినాన్స్​కు సంబంధించి ఏదైన సందేహాలు ఉంటే businessdesk@etvbharat.com ను సంప్రదించవచ్చు.

ABOUT THE AUTHOR

...view details