అత్యంత చౌకగా పెట్రోల్ లభించే దేశం వెనెజువెలా. చమురుపై ప్రభుత్వం భారీ రాయితీలు ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. కానీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ లాటిన్ అమెరికా దేశంలో సిగరెట్లు, చాకొలెట్లు ఇచ్చి పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే భారీగా పెరిగిన ద్రవ్యోల్బణంతో అక్కడ డబ్బు కన్నా ఈ వస్తువులకే విలువ ఎక్కవ.
పాత కాలం నాటి వస్తుమార్పిడి పద్ధతి ద్వారానే ఇప్పుడు కొనుగోళ్లు చేస్తున్నారు వెనెజువెలా వాసులు. బియ్యం, నూనె.. ఇలా తమ వద్ద ఉన్న ఏదైనా వస్తువును మార్పిడి చేస్తూ అవసరమైనవి పొందుతున్నారు.
"మీరు ఇక్కడ సిగరెట్ కూడా ఇవ్వవచ్చు. ఇందులో రహస్యమేమీ లేదు. ఎందుకంటే పెట్రోల్‌కు విలువ లేదు."
-ఓర్లాండో మోలినా, వాహనదారు
విక్రయదారులు కూడా ఇందుకు అడ్డుచెప్పలేకపోతున్నారు. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిన పరిస్థితుల్లో వారికి ఇంతకుమించిన మార్గం లేదు కూడా.
"చాలా మంది వచ్చి.. పెట్రోల్‌కు మా వద్ద డబ్బు లేదంటారు. అదేమీ పెద్ద సమస్య కాదని చెప్పి మేం వారి వద్ద ఉన్న వస్తువును తీసుకుంటాం. వెనెజువెలా మరింత సంక్షోభంలోకి వెళ్లనుంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి చిన్న సహాయాలు ప్రజలకు మేలు చేస్తాయి."
-ఓర్లాండో గోడోయ్, పెట్రోల్ బంక్ ఉద్యోగి