సొంతంగా క్రిప్టోకరెన్సీని ప్రవేశపెట్టే ఉద్దేశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో శివసేన సభ్యుడు సంజయ్‌రౌత్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్. క్రిప్టోకరెన్సీని చట్టబద్ధమైన కరెన్సీగా- లీగల్ టెండర్‌గా పరిగణించబోమని 2018-19 బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు.
చట్ట వ్యతిరేక ఆర్థిక కార్యకలాపాలు, చెల్లింపు వ్యవస్థల నుంచి క్రిప్టోకరెన్సీ వినియోగాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి 'బ్లాక్‌చైన్' సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకుంటామన్నారు.
సుంకాల ద్వారా రూ.8.81 లక్షల కోట్లు..
గత మూడేళ్లలో సుంకాల రూపంలో రూ.8,81,721 కోట్ల వసూలయ్యయని అనురాగ్ ఠాకూర్ వివరించారు. కేంద్ర పన్నుల్లో వాటా కింద సెస్సుల ద్వారా వచ్చిన మొత్తాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడం లేదని స్పష్టం చేశారు.
సుంకాలు భారత సంఘటిత నిధిలో భాగమని, వాటిని ఎందుకోసమైతే వసూలు చేస్తామో దానికోసమే ఉపయోగించాల్సి ఉంటుందని వెల్లడించారు. అందులోంచి చాలా రాష్ట్రాలకు గ్రాంట్లు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఉదాహరణకు జీఎస్‌టీ పరిహార సెస్సు రూపంలో వసూలుచేసే మొత్తాన్ని జీఎస్‌టీ ప్రవేశ పెట్టడం వల్ల ఆదాయం కోల్పోయే రాష్ట్రాలకు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.