బ్యాంకులకు మొండి బాకీలు పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 'బ్యాడ్ బ్యాంకు' ఏర్పాటు తప్పనిసరని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. అంతకంటే మరొక పరిష్కారం కూడా కనిపించటం లేదన్నారు. సాధారణ బ్యాంకులతో పోల్చితే మొండి బాకీల పరిష్కారంలో బ్యాడ్ బ్యాంకు త్వరితంగా, క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కొన్ని దేశాల్లో ఈ ప్రయోగం విజయవంతమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
'దనహర్త ఆఫ్ మలేషియా' ఒక మంచి ఉదాహరణ, మనదేశంలో బ్యాడ్ బ్యాంకును రూపొందించటానికి ఈ సంస్థను అధ్యయనం చేయటం మేలు- అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
బ్యాడ్ బ్యాంక్ అంటే?
బ్యాంకుల వద్ద మొండి బాకీల ఖాతాలన్నింటినీ ఒక సంస్థకు బదిలీ చేసి సత్వరం ఆ ఖాతాలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఇటువంటి సంస్థనే బ్యాడ్ బ్యాంకు అని వ్యవహరిస్తున్నారు.