కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. కొవిడ్ కారణంగా ఇప్పటి వరకు దేశంలో 4.6 లక్షల మందికి పైగా మృత్యవాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 46.6 లక్షలపైకి చేరింది. ఆర్థికంగా కూడా ఎంతో మందిని ఈ మహమ్మారి అతలాకుతలం చేసింది. ఎస్బీఐ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. దేశంలోని కుటుంబాల అప్పులు (పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెండింటిలో) గత మూడేళ్లలో రెట్టింపైనట్లు తెలిసింది.
నివేదికలో ఇంకా ఏముందంటే..
దేశవ్యాప్తంగా చాలా కుటుంబాలు గత మూడేళ్లలో అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. కొవిడ్ విజృంభణతో గత ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. ఇంతటి కఠిన పరిస్థితులు అప్పులు పెరిగేందుకు కారణమయ్యాయి.
గ్రామీణ ప్రాంతాల్లో సగటు కుటుంబ కనీస అప్పు రూ.1,16,841కి పెరిగింది.
పట్టణ ప్రాంతాల్లో అయితే.. సగటు కుటుంబ అప్పుల భారం కనీసం రూ.2.34 లక్షలకు చేరింది.
అప్పులు, పెట్టుబడుల సర్వే 2018
అఖిల భారత అప్పులు, పెట్టుబడుల సర్వే (ఏఐడీఐఎస్) 2018 ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో 2018 జూన్ నాటికి సగటు కుటుంబం అప్పు కనీసం రూ.59,748గా ఉండేది. ఇదే సమయంలో పట్టణ ప్రాంత సగటు కుటుంబం కనీస రుణ భారం రూ.1.2 లక్షలుగా ఉన్నట్లు వెల్లడైంది. 2012తో పోల్చితే ఆరేళ్లలో రుణ భారం గ్రామీణ ప్రాంతాల్లో 84 శాతం పెరిగినట్లు తేలింది. పట్టణ ప్రాంతాల్లో 43 శాతం పెరిగినట్లు వెల్లడైంది.
16 రాష్ట్రాల్లో రికార్డు వృద్ధి..
- ఏఐడీఐఎస్ ప్రకారం.. 16 రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో 2018తో ముగిసిన ఆరేళ్ల కాలంలో అప్పుల భారం రెట్టిపు కన్నా ఎక్కువగా పెరిగింది.
- 8 రాష్ట్రాల పట్టణ ప్రాంతాల్లో కూడా సగటు కుటుంబ కనీస అప్పులు రెట్టింపుకన్నా అధికమయ్యాయి.
- పంజాబ్, రాజస్థాన్, అసోం, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల సగటు కుటుంబ కనీస అప్పులు 100 శాతం పెరిగాయి.
- 2018 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో సగటు కుటుంబ ఆస్తి విలువ కనీసం రూ.15.9 లక్షలుగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. పట్టణ ప్రాంతంలో సగటు కుటుంబం ఆస్తి విలువ కనీసం రూ.27.2 లక్షలుగా ఉన్నట్లు తెలిపింది.
- దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని 69,455 కుటుంబాలపై, పట్టణాల్లోని 5,940 బ్లాక్స్లోని 47,000 కుటుంబాలపై చేసిన సర్వే ఆధారంగా ఈ గణాంకాలు విడుదల చేసింది ఏఐడీఐఎస్.
ఇవీ చదవండి: