జాతీయ పెన్షన్ సిస్టం (ఎన్‌పీఎస్) పరిధిలోని అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana) అతిపెద్ద సామాజిక భద్రత పథకంగా (Social security scheme) అవతరించించింది. 2.8 కోట్ల మంది ఇప్పటి వరకు ఇందులో చేరారు. ఎన్‌పీఎస్ పరిధిలో మొత్తం 4.2 కోట్ల మంది ఉండగా.. అందులో 2.8 కోట్ల మంది అంటే 66 శాతం మంది 2020-21 ఆర్థిక సంవత్సరాంతానికి ఈ పథకంలో చందాదారులుగా మారినట్లు ఎన్‌పీఎస్ ట్రస్ట్ పేర్కొంది. ఇందులో చేరిన వారిలో మెట్రో కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని ట్రస్ట్ వెల్లడించింది.
2015 మే నెలలో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను తీసుకొచ్చింది. 18-40 వయసున్న వారు ఈ స్కీంకు అర్హులు. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పింఛను పొందొచ్చు. ఇందుకోసం నెలవారీగా కొంత మొత్తం జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చందాదారుడు మరణిస్తే అంతే మొత్తాన్ని జీవిత భాగస్వామికి చెల్లిస్తారు. ఆ వ్యక్తి కూడా మరణిస్తే పెన్షన్ కోసం సమకూరిన మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు, గ్రామీణ బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్) ఈ పథకంలో చేరొచ్చు.