చిన్న మదుపరులు ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఇప్పటి వరకూ అవకాశం ఉండేది కాదు. కేవలం బ్యాంకులు, బీమా సంస్థలు, విదేశీ మదుపరులు, పింఛను ఫండ్లు ఇందులో మదుపు చేసేందుకు అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు చిన్న మదుపరులకూ ఈ అవకాశం కల్పించాలని భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. ఇందుకోసం 'రిటైల్ డైరెక్ట్' పేరుతో త్వరలోనే వెబ్‌సైటునూ ప్రారంభించబోతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వ బాండ్లు (గవర్నమెంట్ సెక్యూరిటీలు) ఎంత వరకూ ఆకర్షణీయం.. వీటిలో మదుపు చేస్తే మన ఆర్థిక లక్ష్యాలు సాధించేందుకు వీలవుతుందా? చూద్దాం!
ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే ప్రజలకు బాండ్ మార్కెట్లో మదుపు చేసేందుకు అవకాశం ఇస్తున్నాయి. 'కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకులు చిన్న మదుపరులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేసేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ఈ బాండ్ మార్కెట్లో చిన్న మదుపరులు ప్రైమరీ, సెకండరీ మార్కెట్లతోపాటు, రిజర్వు బ్యాంకు ద్వారా మదుపు చేసేందుకు వీలు కల్పిస్తున్నాం. ఈ విధాన నిర్ణయం ద్వారా చిన్న మదుపరులు ప్రభుత్వ బాండ్లలోనూ మదుపు చేసి, వారి పెట్టుబడులను మరింత విస్తృతం చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఇలాంటి సౌకర్యం ఉన్న కొన్ని దేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా చేరింది.' అని ఇటీవల రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. మరి, ఈ ప్రకటన చిన్న మదుపరులకు ఎంత వరకూ మేలు చేకూరుస్తుందనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.
ఎన్ని రకాలు..
కొన్ని ప్రముఖ ప్రభుత్వ బాండ్లను పరిశీలిస్తే.. క్యాష్ మేనేజ్‌మెంట్ బిల్స్ (సీఎంబీ), ట్రెజరీ బిల్స్ (టీ-బిల్స్), డేటెడ్ జీ-సెక్యూరిటీస్, స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ (ఎస్‌డీఎల్)లు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం టీ-బిల్లులను నగదు మార్కెట్లోకి విడుదల చేస్తుంది. సాధారణంగా ఇవి ఏడాదిలోపు వ్యవధితో ఉంటాయి. సాధారణంగా టీ-బిల్లుల వ్యవధి 91 రోజులు, 182 రోజులు, 364 రోజులు ఉంటాయి. సాధారణంగా ఇవి ఇతర బాండ్లలాగా వడ్డీని ఇవ్వవు. వీటి ముఖ విలువపై కొంత రాయితీకి లభిస్తాయి. వ్యవధి తీరిన తర్వాత వీటి పూర్తి విలువను చెల్లిస్తారు.
సీఎంబీలు కూడా ముఖ విలువపై రాయితీకి లభిస్తాయి. వ్యవధి తీరిన తర్వాత పూర్తి విలువను చెల్లిస్తారు. ఇవి సాధారణంగా 91 రోజుల వ్యవధికి లభిస్తాయి. స్వల్పకాలిక పెట్టుబడుల కోసం వీటిని వినయోగించవచ్చు.
దీర్ఘకాలిక వ్యవధితోనూ ప్రభుత్వం కొన్ని బాండ్లను విడుదల చేస్తుంది. ఇవి దాదాపు 40 ఏళ్ల వ్యవధికీ ఉంటాయి. వీటిని డేటెడ్ ప్రభుత్వ సెక్యూరిటీలుగా పిలుస్తారు. వీటిని జారీ చేసేటప్పుడే వడ్డీ రేటును నిర్ణయిస్తారు. ఇందులో ఫ్లోటింగ్ రేట్ బాండ్లు, క్యాపిటల్ ఇండెక్స్ బాండ్లు, సావరీన్ గోల్డ్ బాండ్లు, ఇన్‌ఫ్లేషన్-ఇండెక్స్‌డ్ బాండ్లు తదితరాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వాలూ తమ అవసరాల కోసం కొన్ని రుణ పత్రాలను జారీ చేస్తుంటాయి. వీటిని ఎస్‌డీఎల్‌లుగా పిలుస్తారు. ఇవి డెటేడ్ గవర్నమెంట్ సెక్యూరిటీలే అయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేయడం ఒక్కటే ప్రత్యేకత.
మంచివేనా?