ప్రభుత్వాలకు అధికంగా ఆదాయం వచ్చేది పన్నుల రూపంలోనే. ఏటా ఈ ఆదాయ అంచనాలను పెంచుకుంటూ వెళ్తుంటారు. ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూపేణ మరో షాక్ తగలబోతోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.13.5 లక్షల కోట్లు సమీకరించాలన్నది గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అయితే మార్చి 31 నాటికి ఇందులో 23 శాతం తక్కువే సమకూరుతుందని ఆర్థికశాఖ సీనియర్ అధికారులు తాజాగా అంచనా వేస్తున్నారు. ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నులను కలిపి ప్రత్యక్ష పన్నులుగా వ్యవహరిస్తుంటారు. ఈ పన్ను ఆదాయం తగ్గనుండటం, రెండు దశాబ్దాల్లో ఇదే తొలిసారని పలువురు సీనియర్ అధికారులు తెలిపినట్లు రాయిటర్స్ వెల్లడించింది.
ఇవీ కారణాలు
కార్పొరేట్ పన్ను రేట్లను తగించడానికి తోడు, ఆర్థిక మందగమనం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. తయారీ కంపెనీలు, పెట్టుబడులను ఆకర్షించేందుకే కార్పొరేట్ పన్ను రేట్లు తగ్గించారు.
ప్రజల కొనుగోళ్లు తగ్గడంతో, వ్యాపారాలు మందకొడిగా సాగుతున్నాయి. ఇందువల్ల కంపెనీలు కొత్త పెట్టుబడులు పెట్టకపోగా, ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 5 శాతానికి పరిమితమవుతుందని, ఇది 11 ఏళ్ల కనిష్ఠస్థాయి అని ప్రభుత్వమే ప్రకటించాల్సి వచ్చింది.