దాదాపు వందేళ్లుగా తెలుగులోగిళ్లలో భాగమైన ఆంధ్రాబ్యాంక్ కనుమరుగు కానుంది. దశాబ్దాలుగా ఖాతాదారులకు సేవలు అందిస్తూ వస్తోన్న ఈ బ్యాంకు ఇక చరిత్రలో భాగం కానుంది. బ్యాంకుల విలీనంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఐదు ట్రిలియన్ డాలర్లకు దేశ ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లడమే లక్ష్యంగా... ప్రస్తుతమున్న 27 బ్యాంకులను విలీనం చేసి 12 బ్యాంకుల ద్వారా సేవలందించనున్నారు. విలీనం తర్వాత ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూబీఐ... ఒకే బ్యాంక్‌గా ఏర్పడనుంది. కొత్త విలీనంతో బ్యాంక్ బిజినెస్ విలువ 14.6 లక్షల కోట్లకు పెరగనుంది.
దేశంలోని ప్రముఖ వాణిజ్య బ్యాంకుల్లో ఒకటైన ఆంధ్రాబ్యాంక్ దాదాపు వందేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైంది. 1923, నవంబరు 20న స్వాతంత్య్ర సమర యోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్థాపించారు. 1980లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ బ్యాంక్‌ను జాతీయం చేశారు. 1981లోనే క్రెడిట్ కార్డులను జారీ చేసి.. దేశానికి ఈ వ్యవస్థను పరిచయం చేసిన బ్యాంకుగా ఆంధ్రాబ్యాంక్ నిలిచింది. 2003 నాటికి 100శాతం కంప్యూటరీకరణ సాధించిన ఘనత ఆంధ్రాబ్యాంక్ది.