భారత్-అమెరికా మధ్య ఓ పరిమిత వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య సమాఖ్య( యూఎస్ఐస్పీఎఫ్) అధ్యక్షుడు, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ముఖేశ్ ఆఘీ. దిల్లీ వేదికగా మంగళవారం జరిగిన భారత నాయకత్వ రెండో వార్షిక సమావేశం వేదికగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, భారత్, అమెరికా వ్యాపార సంస్థలకు చెందిన ముఖ్య కార్యనిర్వాహణాధికారులు పాల్గొన్నారు. కశ్మీర్లో పరిస్థితులు మెరుగైతే పలు అమెరికా వ్యాపార సంస్థలు ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని... ఈటీవి భారత్‌కు ఇచ్చిన ముఖాముఖి వేదికగా వ్యాఖ్యానించారు.
ప్రశ్న: భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ అంశంపై మీకున్న ప్రధాన లక్ష్యం?
జవాబు: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని.. ఇరుదేశాల మధ్య ఉన్న వ్యాపారాన్ని వేరువేరుగా చూడాలి. 142 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని ఈ ఏడాది మేం 160 బిలియన్ డాలర్లకు మార్చాలనుకుంటున్నాం. గత త్రైమాసికంలో భారత్‌కు అమెరికా చేసే ఎగుమతులు 30శాతం పెరిగాయి. మొత్తంగా ఇది 16 శాతం. భారత్‌లోని అమెరికా వ్యాపార సంస్థలను ఈ విషయమై ప్రశ్నిస్తే.. వారు రెండింతలు పెరిగిందని వెల్లడిస్తారు. మొత్తంగా చూస్తే ఇరుదేశాల మధ్య మంచి వాణిజ్యమే జరుగుతోంది. మనం త్వరగా వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాలి. చాలా తక్కువ అంశాల్లో ఇరుదేశాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. నవంబర్ లేదా డిసెంబర్‌లోగా ఒప్పందం పూర్తవ్వాలి.
ప్రశ్న: అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య సమాఖ్య నాయకత్వ సదస్సు వేదికగా వాణిజ్య ఒప్పందంపై భారత్‌కు కొన్ని హామీలు లభించాయని విదేశాంగమంత్రి జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ద్వారా విన్నాం. పాక్షిక వాణిజ్య ఒప్పందానికి ఆటంకంగా ఉన్న భేదాభిప్రాయాలు ఏమిటి? వీటిపై ఏకాభిప్రాయానికి వస్తున్నారా?
జవాబు: కొన్ని పరిమితులు ఉన్నాయి. వైద్య చికిత్సకు సంబంధించిన స్టెంట్లు, మోకాలి రక్షణకు సంబంధించిన భారత్ ఎగుమతులపై పరిమితులు ఉన్నాయి. యాపిల్, బాదం ఎగుమతులపై అమెరికాకు ఆంక్షలున్నాయి. ఇరుదేశాల మధ్య సరైన సమతౌల్యత ఉండాలి. ఇరు దేశాల ఉద్దేశాలు, వైఖరులపై నాకున్న అవగాహన మేరకు పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్యమంత్రి లైటైజర్.. ఒప్పందాన్ని పూర్తి చేస్తారు.
ప్రశ్న: మే 30 వరకు వాణిజ్యంపై పెద్దగా అవగాహన లేదని యూఎస్ఐఎస్పీఎఫ్ వేదికగా గోయల్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్యమంత్రి లైటిజర్ సంక్లిష్టమైన సంప్రదింపుల్లో సహాయం చేస్తున్నారని తెలిపారు. ఇది దౌత్యపరంగా పూర్తిగా అనుభవరాహిత్యమని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. మీ అభిప్రాయం.?
జవాబు: నేను అలా అనుకోవడం లేదు. వాణిజ్య చర్చల అంశంలో లైటైజర్కు సమాన స్థాయిలో గోయల్ ముందుకు సాగుతున్నారు.
ప్రశ్న: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ద్వారా భారత్ లాభపడుతుందని అనుకుంటున్నారా?
జవాబు: పన్నులు తగ్గించడం ద్వారా భారత్ తన విధానాల్లో కొంత మార్పులు చేసింది. ఈ నెలాఖరు వరకు భారత్‌లోకి నూతనంగా వచ్చే వస్తువులకు 17 శాతం పన్ను మినహాయింపు లభిస్తోంది. కార్మిక సంస్కరణలు, భూ సంస్కరణల ద్వారా భారత్ మరింత ముందుకు వెళ్లనుంది. 200పైగా అమెరికన్ కంపెనీలు... 'చైనా ప్లస్ వన్' అనే వ్యూహంలో భాగంగా భారత్‌ను ప్రాధామ్యంగా పెట్టుకున్నాయి. మా విశ్లేషణ ప్రకారం ఆయా కంపెనీలు భారత్‌లో ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పడం ద్వారా 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇక్కడికి వస్తాయని అంచనా. భారత్ కేవలం ఉత్పత్తికి అనుకూలమే కాదు.. అమెరికా ఉత్పత్తులకు చైనా దారుల మూసివేత దృష్ట్యా అతిపెద్ద మార్కెట్ కూడా. మొత్తం వ్యాపార కోణంలో చూస్తే ఉత్పత్తి ఊపందుకుంటే భారత్‌కు మరింత లబ్ధి చేకూరుతుంది.
ప్రశ్న: మరి ఇండోనేషియా, వియత్నాంలకు వ్యాపారాలు ఎందుకు తరలుతున్నాయి? భారత్‌కు ఇంకా ఏమి కావాలి?
జవాబు: వియత్నాం, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌లకు వెళ్లేదంతా తక్కువ స్థాయి ఉత్పత్తి. వ్యాపార సంస్థలు అత్యంత నైపుణ్యం కలిగిన ఇంజనీరింగ్ నిపుణులు, డిజైనర్ల కోసం చూస్తాయి. ఈ నిపుణులు భారత్‌లోనే లభిస్తున్నారు. వారి సామర్థ్యాలను పెంచవచ్చు కూడా. ఈ నేపథ్యంలో భారత్‌ను ఒక యూనిట్‌గా తీసుకుంటే వ్యాపార సంస్థలు ఇక్కడికి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. భారత్ విజయాలను వివరించి ఇక్కడకి తీసుకురావడం.. ప్రభుత్వం వారికి అవసరమైన కార్మిక, భూమి వంటి వ్యవస్థాపన సౌకర్యాల కల్పన, సులభతర వాణిజ్య విధానాలు చేపట్టడమే అతిపెద్ద సవాలు. సులభతర వాణిజ్య ర్యాంకింగ్‌లో ప్రస్తుతం భారత్ 77వ స్థానంలో ఉంది. అదే చైనా 26లో కొనసాగుతోంది. ఈ ఖాళీని పూరించడంపై దృష్టి సారించి... ర్యాంకింగ్‌లో 50 లోపునకు చేరుకునేందుకు యత్నించాలి.