భారత ఆర్థిక వ్యవస్థపై మాంద్యం ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలిపే అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) వెలువరించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి అంచనాలను గణనీయంగా తగ్గించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 5.1 శాతానికే పరిమితమవుతుందని అంచనా వేసింది ఏడీబీ. ఉద్యోగ నియామకాల్లో స్తబ్దత, దేశవ్యాప్తంగా తగ్గిన పంటల సాగుతో వినియోగం తగ్గి దేశ వృద్ధిరేటు గణనీయంగా క్షీణించనున్నట్లు వివరించింది.
తొలుత అంచనాలు ఇలా..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో భారత ఆర్థిక వృద్ధిరేటు 7.2 శాతం వరకు ఉంటుందని ఏడీబీ అంచనా వేసింది. అయితే సెప్టెంబర్లో సవరించిన అంచనాల్లో వృద్ధి రేటును 6.5 శాతానికి తగ్గించింది. మళ్లీ ఇప్పుడు 5.1 శాతానికే పరిమితమవుతుందని అంచనా వేసింది.
తాజా వృద్ధి అంచనా కోతతో భారత ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పింది ఏడీబీ.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మందగించినా.. 2020-21లో పుంజుకుంటుందని ఏడీబీ విశ్లేషించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.5 శాతం వరకు ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి:ఆర్థిక పునరుజ్జీవం కోసం మరింత పదునుగా సంస్కరణలు