ఆర్థిక వ్యవస్థను వేధిస్తున్న మందగమనాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలన్నీ సంధిస్తారనే అంచనాల నడుమ 2020 బడ్జెట్ మన ముందుకొచ్చింది. కాకపోతే, అలాంటి భారీ అంచనాలను అందుకునే విషయంలో అది కొంత దూరంలోనే ఆగిపోయిందని చెప్పుకోవాలి. ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులను ఎదుర్కొంటూ, ఉపశమనం కోసం ఎదురు చూస్తున్న చాలా మందికి ప్రస్తుత బడ్జెట్ ఎంతోకొంత నిరాశ మిగిల్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం వనరుల కొరతతో కొట్టుమిట్టాడుతోందన్న సంగతి తెలిసినా, వాణిజ్య వర్గాలు, కుటుంబాలు తమ వినియోగ శక్తిని పెంచే దిశగా బడ్జెట్ ఏదో ఒక స్థాయిలో తోడ్పాటును అందిస్తుందని ఆశించాయి. సబ్సిడీ చెల్లింపుల వాయిదా, వచ్చే ఏడాది భారీ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా అసాధారణ రీతిలో వనరుల సమీకరణ తదితర మార్గాల్ని ఆవిష్కరించినా బడ్జెట్ ద్రవ్యపరమైన ఉత్తేజాన్ని కల్పించలేకపోయింది. కేవలం ద్రవ్యలోటు సంకోచాన్ని మాత్రమే పరిహరించగలిగింది.
శ్లాబులు, పన్నురేట్లలో మినహాయింపుండేనా.?
కొన్ని నెలల క్రితం కార్పొరేట్ సంస్థలకు అందించిన తరహాలోనే తమకూ కొంత ఉపశమనం లభిస్తుందని ఆదాయ పన్ను చెల్లింపుదార్లు ఆశలు పెట్టుకున్నారు. అయితే కొత్త శ్లాబులు, పన్ను రేట్లను తీసుకొచ్చినా... ఈ విధానంలో మినహాయింపులు పొందే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఉద్యోగులు శ్లాబుల్లో మార్పులు ప్రతిపాదించిన కొత్త విధానాన్నిగానీ, పాత పద్ధతినిగానీ రెండింట్లో ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు పలు మినహాయింపుల్ని, తగ్గింపుల్ని వదులుకోవడం ద్వారా కొత్త రేట్లకు మారాల్సి ఉంటుంది. భత్యాలు, గృహరుణంపై వడ్డీ తదితర ముఖ్యమైన మినహాయింపుల్ని వదులుకోవాల్సి ఉంటుంది.
పన్ను ఆదాకు దారితీసేనా...
డిమాండ్‌ను పెంచే విషయంలో ఈ చర్యలు వెనువెంటనే ప్రభావం చూపించే అవకాశం లేకపోవచ్చు. ఆదాయ పన్ను విషయంలో చెల్లింపుదార్లు కొంతమేర జాగ్రత్తగా ఉంటూ, పాత, కొత్త పద్ధతుల్లో ఒకదానిని ఎంచుకునే విషయంలో తమ తుది వినియోగ ఆదాయంపై పడే ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో నికర ఫలితాలు తేటతెల్లమయ్యేందుకు కొంత ఎక్కువ కాలమే పడుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి ఎంత సోదాహరణంగా వివరించినప్పటికీ రెండింటిలో ఏది ఎంచుకున్నా దాని ఫలితం చాలావరకు పన్ను ఆదాకు దారితీయకపోవచ్చు.