ఆదాయ పన్ను రిటర్నులకు సంబంధించి నూతన ఐటీఆర్ ఫారాలను విడుదల చేసింది ఆదాయ పన్ను శాఖ. 2018-19తోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికీ వీటినే ఉపయోగించాలని స్పష్టం చేసింది.
ఐటీఆర్ 1( సహజ్)లో స్వల్ప మార్పులు చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ). ఇతర ముఖ్యమైన వివరాలు చూద్దాం.
ఐటీఆర్ 1 ఎవరు వాడాలి?
ఇది భారత్‌లో నివసిస్తున్న వారికే. వేతనాలు, ఇంటి అద్దె, ఇతర ఆదాయ మార్గాల(వడ్డీలు) నుంచి రూ.50 లక్షల లోపు ఆదాయం వచ్చే వారు దీనిని దాఖలు చేయాల్సి ఉంటుంది.
స్టాండర్డ్ డిడక్షన్(ప్రామాణిక కోత)
ఈ ఏడాది ఐటీఆర్1లో స్టాండర్డ్ డిడక్షన్ చేసేందుకు ప్రత్యేక కాలమ్‌ను పొందుపరిచింది ఆదాయపన్ను శాఖ. స్టాండర్డ్ డిడక్షన్ అంటే వేతనంలోంచి వైద్యం, రవాణా ఖర్చుల నిమిత్తం తీసేసే మొత్తం. దీనిపై ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరంలేదు.
గతంలో ఇది 34,200గా ఉండేది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి స్టాండర్డ్ డిడక్షన్(ప్రామాణిక కోత)కు రూ.40,000 పరిమితి విధించింది కేంద్రం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి దీన్ని రూ.50,000కు పెంచింది.
ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయం వివరాలు
ఇప్పటి వరకూ ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయం ఎంత అని రిటర్నులో పేర్కొంటే సరిపోయేది. తాజా మార్పుల్లో ఆ ఆదాయం ఎలా వస్తుందనే పూర్తి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.