ఫేక్ వీడియోలు చూస్తే విసుగొస్తుందా..? సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో అలాంటివే కనిపిస్తున్నాయా..? వాస్తవాలుగా నమ్మించి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయా..? వాటికి చెక్ పెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తోంది ఫేస్బుక్.
తప్పుడు వీడియోల బాధితుల్లో ఫేస్బుక్ మొదటి వరుసలో ఉంటుంది. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), కొత్తగా పుట్టుకొస్తున్న అధునాతన సాంకేతికత తప్పుడు వీడియోలను సృష్టించేందుకు తోడ్పడుతోంది. ఇది ఫేస్‌బుక్‌లోనే అధికం. అవి మార్ఫింగ్ చేసి సృష్టించినవే అయినా... ఎలాంటి సందేహాలు రాకుండా వాస్తవాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదే అంశంపై స్పందించారు ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్. కొలొరాడోలో జరిగిన 'ఆస్పెన్ ఐడియాస్ ఫెస్టివల్'లో పాల్గొన్న ఆయన ఫేక్ వీడియోల గురించి మాట్లాడారు.
''ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలను.. తప్పుడు, నకిలీ వార్తలకు భిన్నంగా చూడాలి. అధునాతన సాంకేతికత మరింత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ సమయంలో ఫేక్ వీడియోలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన విధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. వీటి కోసం వివిధ రంగాల నిపుణులతో మాట్లాడుతున్నాం.''
- మార్క్ జుకర్‌బర్గ్, ఫేస్బుక్ సీఈఓ