'జూమ్'.. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో మంచి ఆధరణ పొందిన వీడియో కాన్ఫరెన్సింగ్ సేవల సంస్థ. లాక్డౌన్ సమయంలో కంపెనీల సమావేశాల నుంచి ఆన్లైన్ క్లాసుల వరకు జూమ్ వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో జూమ్ కంపెనీ షేరు విలువ ఈ ఒక్క ఏడాదే దాదాపు 500 శాతం పెరిగింది. ఫలితంగా జూమ్ వ్యవస్థాపకుడు ఎరిక్ యువాన్ సంపద 28.6 బిలియన్ డాలర్లకు పెరిగి.. ప్రపంచ ధనవంతుల్లో 40వ స్థానంలో నిలిచారు.
ఫైజర్ ప్రకటనతో దెబ్బ..
ఇంత వరకు బాగానే ఉన్నా.. అమెరికా మార్కెట్లలో జూమ్ షేరు సోమవారం ఒక్కసారిగా భారీ స్థాయిలో(17 శాతానికిపైగా) కుదేలైంది. ఇందుకు ప్రధాన కారణం కొవిడ్ వ్యాక్సిన్‌పై ఔషధ సంస్థ ఫైజర్ చేసిన ప్రకటన. తాము ఉత్పత్తి చేసిన కొవిడ్ వ్యాక్సిన్.. మానవులపై నిర్వహించిన పరీక్షల్లో 90శాతం మేర కచ్చితమైన ప్రభావం చూపించిందని స్పష్టం చేసింది.
వ్యాక్సిన్ వస్తే..
ఈ ప్రకటనతో.. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరొచ్చనే అంచనాలు పెరిగాయి. ఉద్యోగులు తమ కార్యాలయాలకు, విద్యార్థులు పాఠశాలలకు వెళ్తే.. వీడియో కాన్ఫరెన్సింగ్ వినియోగం భారీగా తగ్గుతుందనే అంచనాలతో జూమ్ షేర్లు ఈ స్థాయిలో పడిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు.