"అప్పుడప్పుడు ఇంటి భోజనం కూడా తినండి" అనే తమ ట్వీట్‌ను కాపీ చేసిన దిగ్గజ సంస్థలకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో గట్టి కౌంటర్ ఇచ్చింది. 'అప్పుడప్పుడు సొంతంగా ట్వీట్లు ఆలోచించండి' అంటూ ఆయా సంస్థలను ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్ చేసింది జొమాటో.
ఇలా మొదలు..
జొమాటో... ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ. వ్యాపారం పెంచుకునేందుకు నిరంతరం విశ్వప్రయత్నాలు చేస్తుంటుంది. మీ దగ్గర్లోని రెస్టారెంట్లలో అద్భుత వంటకాలు ఉన్నాయంటూ, సూపర్ ఆఫర్లు ఇస్తున్నామంటూ ఆహార ప్రియుల్ని ఊరిస్తూ ఉంటుంది.
కాస్త భిన్నంగా...
"అప్పుడప్పుడు ఇంటి భోజనం కూడా చేయండి" అంటూ జొమాటో ఇటీవల ఓ సరదా ట్వీట్ చేసింది. హోటల్ ఫుడ్‌తోపాటు త్వరలో ఇంటి భోజనం హోమ్ డెలివరీ సేవలనూ అందుబాటులోకి తెస్తుందన్న ఊహాగానాలకు తావిచ్చింది.
సామాన్యుల నుంచి వచ్చిన భారీ స్పందనతో ఈ ట్వీట్ కాస్త వైరల్‌గా మారింది. యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, మొబిక్విక్ వంటి వేర్వేరు రంగాల వ్యాపార దిగ్గజాలు ఇదే ట్రెండ్ ఫాలో అయ్యాయి. తాము అందించే సేవలకు పూర్తిగా భిన్నమైన సలహాలను యూజర్లకు ఇస్తూ ట్వీట్లు చేశాయి.
రాత్రి మూడు గంటల తర్వాత ఫోన్ పక్కన పెట్టి పడుకోండి అంటూ యూట్యూబ్ ఇండియా ట్వీట్ చేసింది.
అప్పుడప్పుడు లైన్లో నిల్చుని కరెంట్ బిల్ చెల్లించండి అంటూ మొబిక్విక్ సరదా ట్వీట్ చేసింది.