తెలుగు రాష్ట్రాల్లో సామాజిక అంకుర సంస్థలు విస్తృతమవుతున్నాయి. నిలదొక్కుకునేందుకు కొంచెం కష్టమైనా.. నలుగురికి మేలు చేయవచ్చనే సంకల్పంతో యువత వీటివైపు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ‘సోషల్ స్టార్టప్’లకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. మన దేశంలో ఇప్పుడిప్పుడే వీటికి ఆదరణ పెరగడంతోపాటు వివిధ రంగాలకు విస్తరిస్తున్నాయి. యూకేలో అంకుర సంస్థలకు అత్యంత ఆదరణ ఉంది. అక్కడ ప్రభుత్వమే ఔత్సాహికుల రాయితీలు ఇస్తుంది. అమెరికాలో కూడా పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉన్నారు. వీరంతా ఆసియా మార్కెట్ లక్ష్యంగా పెట్టుబడులు పెడుతుంటారు. మార్కెట్‌పరంగా ఆసియా ప్రథమ స్థానంలో ఉందని నిపుణులు చెబుతున్నారు.
సామాజిక అంకుర సంస్థలంటే?
సాధారణ అంకుర సంస్థ పూర్తిగా లాభాపేక్ష, వ్యాపార దృక్పథంతో ఉంటుంది. సామాజిక అంకుర సంస్థల్లో మాత్రం పేద, మధ్య తరగతి వర్గాలు భాగస్వాములై ఉంటారు. అవి వారి ఆదాయాన్ని పెంచేవిగా ఉంటాయి. లాభాల్లో ఆ వర్గాలకు వాటా ఉంటుంది.
5-10 ఏళ్లలో రెట్టింపు
సామాజిక అంకుర సంస్థలలో పెట్టుబడి ద్వారా వివిధ కంపెనీలు సాయం అందిస్తున్నాయి. రానున్న 5-10 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో 10 వేల వరకు సోషల్ స్టార్టప్స్ ఏర్పాటవుతాయని మార్కెట్‌వర్గాల అంచనా. వీటి వ్యాపారం రూ.5-6 వేల కోట్లకు చేరుకునే వీలుంది.
ఇదీ క్లుప్తంగా..
* తెలుగు రాష్ట్రాల్లోని సామాజిక అంకుర సంస్థలు: 2,500-3,000
* ప్రస్తుత మార్కెట్: సుమారు రూ.600 కోట్లు
* ఏర్పాటు దశలో ఉన్నవి: 1,500-2,000
* ప్రాథమిక పెట్టుబడి: రూ. 5 లక్షల నుంచి 25 లక్షలు
* ఇంక్యుబేషన్ కేంద్రాలు: ట్రిపుల్‌ఐటీ-గచ్చిబౌలి, ఐఐటీ హైదరాబాద్, తెలంగాణ ఇన్నోవేషన్ కౌన్సిల్, బాల వికాస, సెర్జ్ ఇంపాక్ట్.
సీడ్‌ఫండింగ్ బాగా పెరగాలి
పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణతో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు సామాజిక అంకురసంస్థలు కీలకమవుతాయి. కొన్నిసార్లు నిలదొక్కుకుని లాభాలు ఆర్జించేందుకు 3 నుంచి 5 ఏళ్లు పట్టొచ్చు. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థలకు మంచి భవిష్యత్తు ఉంది. వచ్చే 5, 10 ఏళ్లలో పెద్దసంఖ్యలో ఏర్పాటవుతాయి. ఇందుకుతగ్గ మార్కెట్ సిద్ధంగా ఉంది. ఉత్తరభారతంలో క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కొరత ఉంది. మనదగ్గర అలా కాదు. వినియోగదారులను చేరుకోవడం ఎంతో సులువు. అయితే.. సీడ్‌ఫండింగ్ అనేది బాగా పెరగాలి.
- రాజ్ జనగాం, సీఈవో, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, ట్రిపుల్‌ఐటీ
తడి చెత్త నుంచి ఎరువు
భవిష్యత్తులో వ్యర్థాల నిర్వహణ సవాలుగా మారనుంది.. నగరాలు, పట్టణాల్లో చెత్త కారణంగా గాలి, నేల, నీరు కాలుష్యమవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు వ్యర్థాలను ఎరువుగా మార్చడమే కీలకం. ‘‘తడి చెత్తను ప్రాసెస్ చేసి ఎరువుగా మార్చాలన్న ఆలోచనతో 2016లో ఎకో ఎప్సిలాన్ అనే అంకుర సంస్థను స్థాపించాను. ఏపీలోని రాజాం, విజయవాడ మున్సిపాలిటీల్లో మా ప్రాజెక్టు అమల్లో ఉంది. తెనాలిలో రెండేళ్లు ‘కంపోస్ట్’ ఎరువును తయారు చేశాం. మున్సిపాలిటీల్లో తడిచెత్తను సేంద్రియ ఎరువుగా మార్చడమే మా సంస్థ లక్ష్యం. ఇలా తయారు చేసిన ఎరువును విక్రయిస్తాం. ప్రస్తుతం రోజుకు 40-45 టన్నులు తడి చెత్తను ఎరువుగా మారుస్తున్నాం. -పరుచూరి సాయికేశ్.
చిన్న మిల్లు.. రైతుకు ఆదాయం ఫుల్లు
‘‘మాది నల్లగొండ జిల్లా ఆత్మకూరు (ఎస్). సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా మంచి జీతం వస్తున్నా ఏదో తెలియని వెలితి. ఉద్యోగం వదిలేసి అహ్మదాబాద్ ఐఐఎంలో పీజీ చేశాను. 2016లో అవర్ ఫుడ్ పేరిట అంకుర సంస్థ స్థాపించా. రూ. 2.5 లక్షలతో పప్పులు, శనగలు, వేరుసెనగలు, పసుపు, కారం వంటివి ఆడే చిన్నసైజు మిల్లును రైతులతో ఏర్పాటు చేయించడమే మా లక్ష్యం. పూర్వం ఇళ్లలో వాడే విసుర్రాయి స్ఫూర్తితో ఈ మిల్లును డిజైన్ చేశాం. తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో 600 యూనిట్లు ఏర్పాటు చేయించగలిగాం. పంట విక్రయానికి రైతు పడే ఇబ్బందులెన్నో! పంటను ప్రాసెస్ చేసి విక్రయిస్తే రైతులకు మంచి ధర వస్తుంది. - ‘వి.బాలరెడ్డి, అవర్‌ఫుడ్’ అంకురసంస్థ వ్యవస్థాపకుడు.
సర్కారీ బడి పిల్లలకు కోడింగ్
ప్రస్తుతం కోడింగ్ ఎంతో కీలకమైంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్లు లేక నేర్చుకోలేకపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు హైదరాబాద్‌కు చెందిన సూరజ్.వి.మేయుర్, సౌజన్య కలిసి నెక్ట్స్‌స్కిల్స్ 360 ఎడ్‌టెక్ అనే అంకురసంస్థ స్థాపించారు. దీని గురించి సూరజ్ వివరిస్తూ..‘‘ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు ఉండవు. కరెంటు సరిగా ఉండదు. కంప్యూటర్ లేకుండా కోడింగ్ అంటే కష్టమే. దీన్ని అధిగమించేందుకు కార్డ్‌బోర్డు సాయంతో ప్రత్యేక కిట్ తయారు చేశాం. ఉపాధ్యాయులకు కోడింగ్‌పై శిక్షణ ఇచ్చి విద్యార్థులకు నేర్పిస్తున్నాం. విద్యార్థులకు ఇచ్చిన కిట్ సాయంతో కోడింగ్ చేస్తారు. దీన్ని ఉపాధ్యాయుల ఫోన్‌లో వేసుకున్న యాప్ సాయంతో స్కాన్ చేసి అప్‌లోడ్ చేస్తే.. సరిగా కోడింగ్ అయిందో.. లేదో చెప్పేస్తుంది. తెలంగాణలోని 18 పాఠశాలల్లో అమలు చేస్తున్నాం. మహారాష్ట్రలో 8 వేలమంది విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నాం. సత్యం, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లో పనిచేసి ఉద్యోగం వదిలేసి 2018లో ఈ సంస్థను ఏర్పాటు చేశాను. మాకు గతేడాది స్కోచ్, హైసియా నుంచి అవార్డులు లభించాయి.
మహిళలకు ఉపాధి మంత్రం.. గుర్రపుడెక్క
కాలువలు, చెరువుల్లో పెరిగే గుర్రపుడెక్క కలిగిస్తున్న నష్టం ఎంతో ఎక్కువ. వాటితో అందమైన కళాకృతులు తయారు చేయవచ్చని నిరూపిస్తున్నారు.‘‘మాది ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి. నీరు కాలుష్యమవడం మొదలుకుని భూగర్భజలాలు పడిపోవడం వరకు గుర్రపుడెక్క కారణమవుతోంది. దీని నుంచి నారను తీసి అందమైన కళాకృతులు చేయాలనే ఆలోచన వచ్చింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివి అంకుర సంస్థ ఏర్పాటు చేయాలనుకున్నా. 2014లో ‘అల్లిక’ అంకుర సంస్థ ఏర్పాటు చేశా. గుర్రపుడెక్కను సేకరించి కళాకృతులు తయారు చేసే విధానాన్ని అసోంలో చేస్తున్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లి గమనించా. మా ఊరిలో ఆరుగురితో ప్రారంభించా. ఇప్పుడు వందమంది పనిచేస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లోని చెరువుల నుంచి గుర్రపుడెక్క సేకరించి కళాకృతులు, నీటిబాటిళ్లు, ల్యాప్‌టాప్, లంచ్ బ్యాగులు తయారు చేస్తున్నాం. - -అబ్దుల్‌ముజీబ్.
పరీక్షించాకనే ఇంటింటికి పాలు
కల్తీ కాకుండా పాలను ఎలా అందించాలన్న ఆలోచనలోంచి పుట్టిందే సిద్స్ ఫార్మ్ అంకురసంస్థ.‘ఐఐటీ ఖరగ్‌పుర్‌లో బీటెక్ అయ్యాక యూఎస్‌లో మాస్టర్స్, పీహెచ్‌డీ చేశా. ఆరున్నరేళ్లు ఇంటెల్‌లో పనిచేశా. ఏడేళ్ల కిందట ఇక్కడకు వచ్చేసి రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో డెయిరీ ఫామ్ ప్రారంభించా. కల్తీ లేని పాలను అందించాలనే ఉద్దేశంతో సొంతంగా ల్యాబ్ ఏర్పాటు చేసి 26 రకాల పరీక్షలు చేస్తున్నాం. తొలుత పది లీటర్లతో ప్రారంభమై.. ఇప్పుడు రోజుకు 1000 మంది రైతుల ద్వారా పదివేల లీటర్ల పాలు సేకరిస్తున్నాం. పశువులకు కృత్రిమ ఇంజెక్షన్లు ఇచ్చినా గుర్తించేలా ప్రత్యేక పరీక్షలు చేస్తున్నాం. రైతుల నుంచి వినియోగదారుల వరకు కోల్డ్‌చైన్ దెబ్బతినకుండా డెయిలీ ఆర్డర్స్ యాప్ ద్వారా సరఫరా చేస్తున్నాం. ఇందుకు 150 మంది పనిచేస్తున్నారు. త్వరలో సొంత యాప్ ద్వారా సరఫరా ప్రారంభిస్తాం. -కిశోర్ ఇందుకూరి
సేంద్రియ పత్తి.. గిరిజనులకు వరం
‘‘మాది కడప జిల్లా పులివెందుల. వివిధ బహుళజాతి పురుగుమందుల కంపెనీల్లో ఉద్యోగం చేశాను. రసాయనాల వాడకంతో పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి ఉద్యోగం వదిలేశా. నెదర్లాండ్స్ వెళ్లి ఆర్గానిక్ అగ్చికల్చర్‌లో పీజీ చేశా. ఆ క్రమంలో సేంద్రియ పద్ధతిలో పత్తి పండించడంపై ఆసక్తి కలిగింది. విజయనగరం జిల్లా సాలూరులోని 46 గ్రామాల్లో గిరిజన రైతులకు అవగాహన కల్పించి ఆర్గానిక్ పత్తిని పండించేలా ప్రోత్సహించాను. అవసరమైన విత్తనాలు, సేంద్రియ ఎరువులు అందించి, రసాయనాలు వాడకుండా పత్తిని పండిస్తున్నాం. దీని ఎగుమతికి యూరోపియన్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నాం. పత్తి సాగు ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. కానీ సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసి లాభాలు ఆర్జించవచ్చు. -‘అనిల్‌కుమార్ అంబవరపు, యషశ్రీ ఇంపాక్ట్’ అంకుర సంస్థ వ్యవస్థాపకులు.
ఇదీ చూడండి:నాలా ప్రక్రియ మార్పు.. స్థిరాస్తికి ఊపు