తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎస్​ బ్యాంకులో ఐఎంపీఎస్​, నెఫ్ట్ సేవల పునరుద్ధరణ - ఎస్ బ్యాంకు కుంభకోణం

ఎస్ బ్యాంకు నేటి నుంచి నెఫ్ట్, ఐఎంపీఎస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇతర బ్యాంకు ఖాతాల నుంచి క్రెడిట్ కార్డు బకాయిలు, రుణాలు చెల్లించుకునే వీలు కల్పించింది. బ్యాంకులో సమూల మార్పులు చేస్తామని పాలనాధికారి ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. ఇందులో భాగంగా కార్పొరేట్​ రుణాల నుంచి రిటైల్​ లోన్ల వైపు బ్యాంకును మళ్లిస్తామని స్పష్టం చేసింది.

yes bank
ఎస్ బ్యాంకు

By

Published : Mar 10, 2020, 3:23 PM IST

సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్‌ బ్యాంక్‌.. సేవల విషయంలో ఖాతాదారులకు కాస్త ఊరట కల్పించింది. మంగళవారం నుంచి ఐఎంపీఎస్‌, నెఫ్ట్‌ సేవలను తిరిగి అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని బ్యాంక్‌ నేడు ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది.

"ఐఎంపీఎస్‌, నెఫ్ట్‌ సేవలను పునరుద్ధరించాం. ఇక ఇతర బ్యాంక్‌ ఖాతాల నుంచి మీరు ఎస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు బకాయిలు, రుణాలు చెల్లించుకోవచ్చు. మీ సహకారానికి కృతజ్ఞతలు."

-ఎస్ బ్యాంకు

ఎస్‌ బ్యాంకు పునరుద్ధరణ ప్రణాళిక అనుమతికి సంబంధించి ముసాయిదాను ఆర్బీఐ త్వరలో కేబినెట్‌కు సమర్పించనుంది. వచ్చే శుక్రవారం పబ్లిక్‌ డొమైన్‌ నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్న తర్వాత ఆర్బీఐ ఈ ముసాయిదాను ఖరారు చేయనుంది. ఆర్బీఐ ముందుగా ప్రకటించిన ప్రకారం ఎస్‌ బ్యాంకులోని 49 శాతం షేర్లను స్టేట్‌ బ్యాంకు కొనుగోలు చేయనుంది. గత సోమవారంతో ఈ కొనుగోలుకు సంబంధించి సలహాలు, సూచనలు ముగిశాయి.

సమూల మార్పులు!

ప్రభుత్వ అనుమతితో ఆర్బీఐ నియమించిన పాలనాధికారి ప్రశాంత్‌కుమార్‌ ప్రస్తుత ఎస్‌ బ్యాంకు వ్యవహారాలను చక్కబెడుతున్నారు. కార్పొరేట్‌ రుణాల బకాయిలు, అంతర్గత అవకతవకల కారణంగా కష్టాల్లో కూరుకుపోయిన ఎస్‌బ్యాంక్‌లో సమూల మార్పులు తీసుకురావాలని ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. ఇందులో భాగంగా కార్పొరేట్‌ రుణాలను విక్రయించే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. బ్యాంక్‌ను కార్పొరేట్‌ రుణ వ్యాపారం నుంచి రిటైల్‌ లోన్‌ వ్యాపారం వైపు మళ్లిస్తామని పేర్కొన్నారు. ఆర్‌బీఐ హామీ ఇచ్చాక బ్యాంక్‌ ఏటీఎంల వద్ద క్యూ తగ్గిందన్నారు.

బ్యాంకుపై నమ్మకం పోలేదు..

ఎస్‌బీఐ 49శాతం పెట్టుబడి పెట్టనుండటం బ్యాంక్‌పై నమ్మకాన్ని పెంచిందన్నారు ప్రశాంత్ కుమార్​. బ్యాంక్‌ రిసొల్యూషన్‌ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుండటం, దీనికి ఆర్‌బీఐ, ఎస్‌బీఐ మద్దతు ఉండటం వల్ల ప్రజలు కొంత స్థిమితపడ్డారని వెల్లడించారు. బ్యాంక్‌ మూలధన సేకరణ ప్రణాళికలు సిద్ధం కావడమూ ప్రజల్లో విశ్వాసం పెంచిందని వివరించారు. మార్చి 14వ తేదీన బ్యాంక్‌ త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. డిపాజిట్లను విత్‌డ్రా చేసుకొనే కస్టమర్ల అవసరాలు తీర్చడం తమ ముందున్న తక్షణ కర్తవ్యమని ఆయన చెప్పారు.

త్వరలోనే బోర్డు..

బ్యాంక్‌కు పూర్తిస్థాయి బోర్డును ఏర్పాటు చేసేందుకు ఆర్‌బీఐ కసరత్తు చేస్తోంది. బోర్డు ఏర్పడగానే రిటైల్‌ బ్యాంక్‌గా మార్చే అంశం బోర్డు ముందుకు రానుంది. ఇప్పటికే ఉన్న కార్పొరేట్‌ రుణాల విభాగం ఇక నుంచి కేవలం గతంలో ఇచ్చిన రుణాల వసూలుకు మాత్రమే పరిమితం అవుతుంది. కొత్త రుణాలను ఇవ్వదు. భవిష్యత్తులో బ్యాంక్‌ ఆస్తుల్లో 70శాతం వరకు రిటైల్‌ రుణాలు ఉండేట్లు చూసుకోనుంది. ప్రస్తుతం ఇవి కేవలం 30 నుంచి 35శాతం వరకు మాత్రమే ఉన్నాయి.

ఇదీ చూడండి:'త్వరలోనే మారటోరియం ఎత్తివేస్తాం.. సేవలందిస్తాం'

ABOUT THE AUTHOR

...view details