తెలంగాణ

telangana

ETV Bharat / business

స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో మళ్లీ షియోమీనే టాప్ - వన్ ప్లస్

వరుసగా రెండో త్రైమాసికంలోనూ భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో షియోమీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఏప్రిల్-జూన్ మూడు నెలల కాలంలో 3.7 కోట్ల స్మార్ట్ ఫోన్లు విక్రయించింది ఈ ఎలక్ట్రానిక్​ దిగ్గజం.

షియోమీ

By

Published : Jul 27, 2019, 7:26 PM IST

భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్​లో షియోమీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 3.7 కోట్ల స్మార్ట్ ఫోన్లు విక్రయించి 28శాతం మార్కెట్ వాటాతో ఈ స్థానాన్ని దక్కించుకుంది.

శాంసంగ్ 25 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో ఉంది. ఒప్పో, వీవో, రియల్​ మీ, వన్​ప్లస్ సంస్థలకు 30 శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు కౌంటర్​పాయింట్​ రీసర్చ్ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది.

శాంసంగ్ ఫోన్ల అమ్మకాలు గత ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే 7 శాతం తగ్గినప్పటికీ.. మార్చి త్రైమాసికంతో పోలిస్తే మాత్రం 30 శాతం వృద్ధి చెందాయి. శాంసంగ్ 'ఏ', 'ఎం' శ్రేణి ఫోన్లకు దక్కిన ఆదరణ ఇందుకు కారణం.

చైనా ఎలక్ట్రానిక్​ దిగ్గజం హువావేపై అమెరికా నిషేధం ఆ సంస్థ అమ్మకాలపై భారీ ప్రభావమే చూపింది. గత ఏడాదితో పోలిస్తే హువావే మార్కెట్​ విలువ కాస్త తగ్గింది. అయినప్పటికీ పది ఉత్తమ ఫోన్లలో హువావేకు చోటుందని కౌంటర్​పాయింట్ పేర్కొంది.

జోరుకు కారణాలు...

దేశీయంగా స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా కొత్త మోడళ్లు సరసమైన ధరలకు లభించడం, పాత మోడళ్లపై ధరలు తగ్గించడం వంటి అంశాలు అమ్మకాలకు ఊతమిచ్చాయి. ఆఫ్​లైన్​ మార్కెట్లకు బ్రాండెడ్ ఫోన్ల విస్తరణ కూడా అమ్మకాల వృద్ధికి మరో కారణం.

ప్రీమియం విభాగంలో 'వన్​ప్లస్​' టాప్​

జనవరి-మార్చి త్రైమాసికంలో ప్రీమియం స్మార్ట్ ఫోన్ విభాగంలో ప్రథమ స్థానంలో ఉన్న శాంసంగ్​ స్థానాన్ని రెండో త్రైమాసికంలో వన్​ప్లస్ కైవసం చేసుకుంది. వన్​ ప్లస్​ 7 సీరిస్ ఫోన్లకు ఉన్న ఆదరణ ఇందుకు ప్రధాన కారణం.

ప్రీమియం విభాగంలో రియల్​మీ, ఆసుస్, వన్​ప్లస్, నోకియా మాతృ సంస్థ హెచ్​ఎండీ గ్లోబల్ గత ఏడాదితో పోలిస్తే.. ప్రస్తుతం వేగంగా వృద్ధి చెందుతున్నాయని కౌంటర్​పాయింట్ పేర్కొంది.

ఇదీ చూడండి: శాంసంగ్ గెలాక్సీ ఏ10 ఎస్ ఫీచర్లు ఇవే!

ABOUT THE AUTHOR

...view details