పారు బాకీలు పెరిగిపోయి, అసలు పెట్టుబడికే దిక్కు లేకపోవడంతో భారత రిజర్వు బ్యాంకు ఏప్రిల్ మూడో తేదీ వరకు ఎస్ బ్యాంకుపై మారటోరియం విధించడం ఖాతాదారులనే కాక ప్రజలందరినీ దిగ్భ్రాంతపరచింది. మారటోరియం అంటే డిపాజిట్ల ఉపసంహరణపై కొంతకాలం పరిమితి విధించడం. దీనివల్ల బ్యాంకు కార్యకలాపాలకు విఘాతం ఏర్పడుతోంది. ఎస్ బ్యాంకు డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని ఇవ్వజూపడం, ఆధునిక సాంకేతికత ఆధారిత సేవలు, ఉత్పత్తులను అందించడం వల్ల యువ ఖాతాదారులు విశేషంగా ఆకర్షితులయ్యారు. తీరా ఇప్పుడు ఆ ఆకర్షణలన్నీ కాకి బంగారం మెరుపులని తేలిపోయింది. బ్యాంకులో ఎంత డబ్బు డిపాజిట్ చేసినా, ఖాతాదారు తీసుకోగలిగింది రూ.50,000 మాత్రమే. ఈ మారటోరియం లేదా నిషేధం తాత్కాలికమే కానీ, దాని మీద సామాజిక మాధ్యమాల్లో గగ్గోలు రేగుతోంది. దీంతో ఎస్ బ్యాంకు షేర్ విలువ 85శాతంవరకు పడిపోయి లక్షలాది మదుపరులు తీవ్రంగా నష్టపోయారు. ఇలాంటి అనుమానాలు తలెత్తకుండా చూడటానికి రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినా, ఎస్ బ్యాంకు పారు బాకీలు పెరిగిపోవడం, మూలధన నిష్పత్తి (సీఏఆర్) ఉండాల్సినంత లేకపోవడంతోపాటు నిర్వహణ లోపాలు పెచ్చుపెరిగి ఖాతాదారుల పుట్టి ముంచాయి. సమస్య కేవలం మూల ధనం, నగదు లభ్యతకు సంబంధించినదైతే ముందుగానే గుర్తించి నివారించడం సాధ్యమయ్యేది. అంతకుమించి అవకతవకలు జరగడం వల్లనే పరిస్థితి ఇంతగా దిగజారింది.
లోటుబాట్లే వైఫల్యానికి కారణమా?
ఎస్ బ్యాంకు 2004లో ప్రారంభమై చాలా శీఘ్రంగా నాలుగో పెద్ద ప్రైవేటు బ్యాంకు స్థాయిని అందుకుంది. సమర్థుల నిర్వహణలో కేవలం 15 ఏళ్లలోనే రూ.3.62లక్షల కోట్ల ఆస్తులు సాధించింది. 2019 మార్చి వరకు కూడా బ్యాంకు సీఏఆర్ 15.7 శాతంగా ఉంది. మొత్తం నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 7.39శాతంగా, నికర ఎన్పీఏలు 4.35 శాతంగా లెక్కతేలాయి. ఇవి మరీ తీవ్రమైనవేమీ కావు- ఆర్‌బీఐ నియంత్రణ ప్రమాణాలను పాటించి సరిచేసుకోగల లోటుపాట్లే. వీటిని మించిన అంతర్గత వైఫల్యాలు ఉండబట్టి ఎస్ బ్యాంకు అధోగతికి జారిపోయింది. 2019 మార్చినాటికి 28 రాష్ట్రాలు, తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ బ్యాంకుకు వెయ్యికి పైగా శాఖలు, 1,800 ఏటీఎంలూ ఉన్నాయి. బ్యాంకులో మొత్తం రూ.2.27లక్షల కోట్ల డిపాజిట్లు ఉండగా, రూ.2.64లక్షల కోట్ల రుణాలు ఇచ్చింది. ఎస్ బ్యాంకు ఖాతాదారుల్లో అనేకమంది అతి సంపన్నులు (హెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) ఉన్నారు. 2019 సెప్టెంబరు వచ్చేసరికి ఎస్ బ్యాంకు డిపాజిట్లు రూ.2.09లక్షల కోట్లకు దిగివచ్చాయి. దాంతో నగదు లభ్యతకు కటకట ఏర్పడింది. ఎస్ బ్యాంకు పరిస్థితి అనూహ్యంగా, ఆకస్మికంగా దిగజారి, రిజర్వు బ్యాంకు శీఘ్ర దిద్దుబాటు చర్యలకు (పీసీఏ) వ్యవధి లేకుండా పోయింది. సాధారణంగా నాలుగు సందర్భాల్లో రిజర్వు బ్యాంకు పీసీఏకు దిగుతుంది. అవి- బ్యాంకు మూలధనం 10.875 శాతం కన్నా దిగువకు పడిపోయినప్పుడు; నికర అనుత్పాదక ఆస్తులు ఆరు శాతాన్ని మించినప్పుడు; ఆస్తులపై, ముఖ్యంగా ఇచ్చిన రుణాలపై రాబడి వరుసగా రెండు త్రైమాసికాల్లో ప్రతికూలంగా మారినప్పుడు; బ్యాంకు మూలధనానికి, దాని మొత్తం ఆస్తులకు మధ్య నిష్పత్తి 4.5శాతాన్ని మించినప్పుడు రిజర్వు బ్యాంకు పీసీఏ చేపడుతుంది. ప్రస్తుతం యునైటెడ్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంకు వంటి నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు ఐడీబీఐ బ్యాంకు, లక్ష్మీ విలాస్ బ్యాంకు కూడా పీసీఏ చట్రంలో ఉన్నాయి.