మీకు కావాల్సిన మొబైల్ ఫోన్‌ను క్రెడిట్ కార్డు ద్వారా కొని ఆ మొత్తాన్ని నిర్ణీత సమయంలో ఈఎంఐ రూపంలో చెల్లించాలి అనేది ఈ ఆఫర్ ముఖ్య ఉద్దేశం. ఈ పద్ధతిలో కొనుగోలు చేసేవారికి ప్రత్యేక డిస్కౌంట్‌ను కూడా అందిస్తారు ఈ-కామర్స్ సంస్థల రిటైలర్లు. ఈ పద్ధతిలో కొనుగోలు సరైనదేనా? ఇంతకీ ఈ ఆఫర్ ఎలా పని చేస్తుంది?
నో కాస్ట్ ఈఎంఐలో వడ్డీ ఉండదా?
బ్యాంకులు అందించే సున్నా శాతం వడ్డీ పథకాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు 2013లో నిషేధించింది. అప్పటి నుంచి నో కాస్ట్ ఈఎంఐ పేరుతో కొత్త ఆఫర్‌ను తెరపైకి తెచ్చాయి బ్యాంకులు. ఈ పద్ధతిలో వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదనే వాదన తప్పు. మీరు తీసుకున్న ఉత్పత్తిపై వచ్చిన తగ్గింపును వడ్డీ రూపంలో మీకు రుణ సదుపాయం కల్పించిన బ్యాంకులు పొందుతాయి. అదెలా అంటే మొదట చెప్పినట్లు బ్యాంకుల వడ్డీకి సరిపడా డిస్కౌంట్‌ను వినియోగదారులకు అందిస్తారు రిటైలర్లు. ఈఎంఐలో మాత్రం మొబైల్‌పై ఉన్న పూర్తి ధరనే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణ
మీరు కొనాలనుకున్న ఫోన్ ధర రూ.30,000. దీనిపై రిటైలర్ ఆఫర్ రూ. 500. అప్పుడు మీకు ఫోన్ లభించే ధర రూ.29,500 అవుతుంది. ఈ ఫోన్ ఈఎంఐని రూ.10,000 చొప్పున మూడు నెలల పాటు చెల్లించాలి. ఇందులో మీకు డిస్కౌంట్‌గా లభించిన రూ.500ని బ్యాంకులు వడ్డీ రూపంలో పొందుతాయి. వీటితో పాటు బ్యాంకులకు అదనంగా పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
నో కాస్ట్ ఈఎంఐ ఎలా పని చేస్తుంది?
ఇందులో ముగ్గురు వాటాదారులు ఉంటారు. రిటైలర్, బ్యాంకు, వినియోగదారుడు. సాధారణంగా కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ అందిస్తాయి. రిటైలర్స్ వేగంగా అమ్ముకోవాలనుకుంటున్న ఉత్పత్తులపై మాత్రమే నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను అందిస్తాయి. నో కాస్ట్ ఈఎంఐ విషయంలో, కస్టమర్ చెల్లించే వడ్డీకి సమానమైన తగ్గింపును ఇవ్వడానికి రిటైలర్ సుముఖంగా ఉంటారు. డిస్ట్రిబ్యూటర్ లేదా ఆయా వస్తువుల తయారీదారు కస్టమర్‌కు రాయితీ వడ్డీని చెల్లిస్తారు.