దేశంలో ఏటా కనీసం కోటి కొత్త ఉద్యోగాలు అవసరం. ప్రభుత్వం, కొన్ని కార్పొరేట్ సంస్థలు కలిసి ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు.. ఈపీఎఫ్‌ఓ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో 89.7లక్షల కొత్త ఉద్యోగాలే వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ వాస్తవంగా కావాల్సిన ఉద్యోగాలకంటే.. 16లక్షల వరకూ తక్కువే ఉండొచ్చనేది అంచనా. ఈ నేపథ్యంలో ఉద్యోగాలను సృష్టించేందుకు అంకుర సంస్థలు (స్టార్టప్స్) కీలకంగా మారాయి. గత ఐదారేళ్లుగా ఇవే యువతకు ప్రధాన ఉద్యోగాధారంగా మారాయి. కొన్ని సంస్థల నివేదికల ప్రకారం రోజుకు 10కి పైగా కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి.
‘స్టార్టప్ ఇండియా.. స్టాండప్ ఇండియా’ భారత ప్రధానమంత్రికి ఎంతో ఇష్టమైన నినాదం. అంకురాలకు కొత్త శక్తులను ఇవ్వాలని, తద్వారా దేశ యువతకు అధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో దీన్ని మొదలు పెట్టారు. కానీ, ఆశించిన మేరకు బడ్జెట్ కేటాయింపులు జరగడంలేదు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల్లోని అంకురాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా గ్రామీణ భారతాన్ని అభివృద్ధి చేసేందుకు వీలవుతుందనేది ఈ రంగంలో ఉన్న వారి మాట.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్త బడ్జెట్ నుంచి ఏం ఆశిస్తున్నారంటే..
గ్రామీణ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం..
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నిధుల లభ్యత పెద్ద ఇబ్బందిగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, వారికోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే సమస్యల పరిష్కారానికి కృషి చేసే వాటికి ఈ నిధి తోడ్పడాలి. పాఠశాల, కళాశాలల స్థాయుల్లో ఉన్న విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారేందుకు అవసరమైన విషయ పరిజ్ఞానం, ప్రోత్సాహం కలిగించేలా ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించాలి. కార్యాలయ స్థలాలకు అధిక అద్దెలు ఉంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో అంకురాల కోసం ప్రత్యేక కో- వర్కింగ్ కార్యాలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి. 25 ఏళ్లలోపు వారు ప్రారంభించే అంకురాలకు హామీలేని రుణాలు, గ్రాంటులు లభించేలా బడ్జెట్‌లో ఏదైనా ప్రతిపాదనలు చేయాలి.
- పవన్ అల్లెన (మెటామార్ఫోసిస్ )
ఆహార శుద్ధిపై దృష్టి..
ప్రభుత్వం రైతుల సమస్యలపై అధికంగానే దృష్టి సారిస్తుంది. వారికోసం ఎంతో ఖర్చు చేస్తుంది. ఇదే సమయంలో దేశంలో ఆహార ఉత్పత్తులు, వాటిని ప్రాసెసింగ్ చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించాలి. నాబార్డ్‌లాంటి సంస్థలు వీరికి రుణాలు ఇచ్చేలా చూడాలి. ప్రభుత్వం రైతుల కోసం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగంలో పనిచేసే అంకురాలకు ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలి. ఇలాంటి వాటికి అందించే యంత్రాలపై రాయితీ లేదా తక్కువ వడ్డీ రుణాలను ఇస్తే బాగుంటుంది.
- బాలా రెడ్డి వీసవరం (అవర్‌ఫుడ్)
పెట్టుబడులు వచ్చేలా..
అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెరిగే దిశగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలి. అంకురాలకు అవసరమైన నిధులు అందేలా చూడాలి. అందుకోసం వీటిల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఐటీ, ఇతర నిబంధనలను కాస్త సరళతరం చేయాలి. ఎంపిక చేసిన అంకురాలకు ప్రభుత్వమే తొలి వినియోగదారు కావాలి. అదే సమయంలో వారికి బిల్లులూ సకాలంలో చెల్లించాలి. ప్రాథమిక స్థాయిలో నిధులను అందించేందుకు ఒక ప్రత్యేక ఏర్పాటు ఉండాలి. పలు ప్రభుత్వ శాఖలు తమ విభాగాల్లో ‘ఇన్నోవేషన్ ఛాలెంజ్’లను నిర్వహించి, సృజనాత్మకంగా ఉన్న సంస్థలు వెలుగులోకి రావడానికి తోడ్పాటునందించాలి. వీటికి గ్రాంటులను అందించి ప్రోత్సహించాలి.
- డాక్టర్ శాంతా తౌటమ్ (వైస్ ప్రెసిడెంట్, టి-హబ్)
నిరుత్సాహపరచకండి..
అంకురాలను ప్రారంభించేవారికి కొన్ని నిబంధనలు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఎన్నో అనుమతులు తీసుకున్నా.. ఒకటి తక్కువే అవుతోంది. ఐఐఎంలు, ఐఐటీల్లో చదివిన వారికీ, కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసి సంస్థలను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నవారికీ ఈ నిబంధనలు చిక్కుముడులుగా మారుతున్నాయి. అంకురాలకు ఒకే చోట అనుమతులు ఇచ్చేలా ఏదైనా ఏర్పాటు చేయాలి. రూ.2కోట్ల లోపు టర్నోవర్ ఉన్న సంస్థలకు నిబంధనలను సరళీకృతం చేయాలి. ఎవరైనా స్టార్టప్ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం లేదా అమ్మేయడం చేసినప్పుడు వారు మరో అంకురంలో పెట్టుబడి పెడితే.. పన్నుపరమైన ప్రయోజనం కల్పించాలి.
- పరేశ్ మసాదే (వావ్)
సామాజిక ప్రాధాన్యం చూడాలి..